పక్కాగా ఈ ఆస్పత్రి రిజిస్ట్రేషన్
-
డీఎంహెచ్‌ఓ డాక్టర్ వరసుందరం
నెల్లూరు(అర్బన్):
జిల్లాలోని పీహెచ్‌సీలలోని డాక్టర్లందరూ ఈ ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ను పక్కాగా అమలు చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ వరసుందరం సూచించారు. స్థానిక సంతపేటలోని జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో బుధవారం జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ఈ ఆస్పత్రి వల్ల బాధ్యత పెరుగుతుందన్నారు. ఏయే పరికరాలున్నాయి, మందులు, వైద్యం తదితర అన్ని రకాల వివరాలను రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా రోగులకు మెరుగైన సేవలందించవచ్చన్నారు. పీహెచ్‌సీలలో డాక్టర్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తప్పని సరిగా ఉండాలన్నారు. బయోమెట్రిక్‌ను పక్కాగా అమలు చేయాలన్నారు. టీకాల కార్యక్రమం వంద శాతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ రమాదేవి, పీఓడీటీ పి.రమాదేవి, డీఐఓ జయసింహ, డీటీసీవో సురేష్‌కుమార్, సమాచార అధికారి సాయిసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.