ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు రంగు
- జడ్చర్ల బస్సు ప్రమాదంపై ప్రభుత్వం విచారణ
- ఇద్దరు అధికారులపై వేటు
- సిద్దిపేట రవాణా శాఖలో కలకలం
సిద్దిపేట జోన్: ఐదేళ్లుగా యథేచ్ఛగా జరుగుతున్న ‘తప్పు’.. ఇద్దరి అధికారులపై వేటుపడేలా చేసింది. కృష్ణ పుష్కరాలకు వెళ్లిన బస్సు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల శివారులో మంగళవారం ప్రమాదానికి గురై 32 మందికి గాయాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కొనసాగిన విచారణలో అప్పటి సిద్దిపేట ఎంవీఐ(ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఎంవీఐ) సుభాష్ చంద్రారెడ్డితో పాటు సిద్దిపేట ప్రస్తుత ఏఎంవీఐ విక్రమ్‌ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ సుల్తానీయా ఆదేశాలు జారీ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట పట్టణానికి చెందిన ఏపీ 23 యూ 8899 నంబర్ బస్సు ఆర్టీసీలో కొంత కాలంగా అద్దెకు తిరుగుతోంది. ఈక్రమంలో 2011లో నిర్ణీత గడువు ముగియడంతో బస్సును స్టేజీ క్యారియర్ నుంచి కాంట్రాక్ట్ క్యారేజీగా మారుస్తూ సిద్దిపేట ఆర్టీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో సిద్దిపేట ఎంవీఐగా పనిచేసిన సుభాష్ చంద్రబోస్ కన్వెర్షన్ చేస్తూ ఫిట్‌నెస్ అదే సంవత్సరంలో మంజూరు చేశారు.
అయితే, అప్పటి నుంచి నేటి వరకు ఏటా రవాణా శాఖలో ఫిట్‌నెస్ పొందుతున్నా బస్సు రంగును మాత్రం మార్చలేదు. ఈ క్రమంలోనే కృష్ణ పుష్కరాల కోసం సిద్దిపేటలోని ట్రావెల్స్ ద్వారా కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు అద్దెకు ఇదే బస్సులో బయలుదేరారు. కాగా, మంగళవారం బస్సు ప్రమాదానికి గురైంది. సంఘటనపై ప్రభుత్వం విచారణ జరపడంతో ‘రంగ’ విషయం బయటపడింది. ఐదేళ్లుగా రంగు మార్చకుండా అద్దె ప్రతిపాదికన తిరుగుతున్నట్లు విచారణంలో తేలింది. దీనిపై రాష్ట్ర కమిషనర్ సుల్తానీయా సుభాష్‌తో పాటు విక్రమ్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
జరిమానాల నుంచి గట్టెక్కేందుకే ..
సిద్దిపేట ఆర్టీఏ పరిధిలో సుమారు 48 కాంట్రాక్ట్ క్యారేజీ బస్సులు ఉన్నాయి. ఇవన్నీ ఏటా ఫిట్‌నెస్, ట్యాక్స్, ఇన్సు ్య రెన్స్ సంస్థ నుంచి పొందాల్సి ఉంటుంది. కాగా, కొందరు బస్సుల యజమానులు ఇవేమీ పొందకుండా బస్సులను యథేచ్ఛగా స్టేజీ క్యారియర్లగా వినియోగిస్తున్నారు.
నిబంధనల మేరకు ఆర్టీసీకి చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సులకు నీలం, తెలుపు రంగులను వాడాల్సి ఉంటుంది. అయితే, అద్దె ప్రతిపాదికన తిరుగుతున్న బస్సులు సైతం ఇవే రంగులో దర్శనమివ్వడం కొనమెరుపు. ఈ క్రమంలోనే సిద్దిపేటకు చెందిన ఏపీ 23యూ 8899 నంబర్ గల బస్సు అదే రంగులో తిరుగుతూ వివాదాలకు ప్రస్తుతం కేంద్రబిందువైంది.