ముళ్లపొదల నుంచి స్పెయిన్ దేశానికి...!
Published Fri, Jan 13 2017 12:45 AM | Last Updated on Tue, Sep 5 2017 1:06 AM
– శిశుగృహ చిన్నారిని దత్తత తీసుకున్న స్పెయిన్ దంపతులు
– ఆర్‌జేడీ సమక్షంలో దంపతులకు అప్పగింత
కర్నూలు(హాస్పిటల్):
ఆసుపత్రి ముళ్లపొదల్లో రక్తమడుగులో లభించింది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ చిన్నారి ఇక బతకదని భావించారు. పెద్దాసుపత్రి వైద్యుల పుణ్యమా అని ఆ చిన్నారి మళ్లీ ఈ లోకాన్ని చూసింది. శిశుగృహలో పెద్దగై ఆరేళ్ల వయస్సులో ఇప్పుడు స్పెయిన్ దేశానికి చెందిన దంపతుల ముద్దుల కూతురు కాబోతోంది. ఎక్కడ పుట్టిందో తెలియకపోయినా స్పెయిన్ దేశంలో పెరిగి పెద్దకాబోతోంది చిన్నారి లలిత.
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల విభాగం సమీపంలో ముళ్లపొదల్లో మూడేళ్ల క్రితం మూడున్నరేళ్ల ఆడపిల్ల పడి ఉంది. ఒళ్లంతా గాయాలు, ముఖమంతా ఉబ్బిపోయి చావుకు దగ్గరలో ఆ చిన్నారిని కన్న వారు కొట్టిపారేసి వెళ్లిపోయారు. ఈ దృశ్యాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చిన్నపిల్లల విభాగంలో చికిత్స నిమిత్తం చేర్పించారు. ఎంతో కష్టించి వైద్యులు పాపకు మెరుగైన వైద్యంతో బాగు చేశారు. అనంతరం పాపను స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు అప్పగించారు. ఈ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశు విహార్‌కు తరలించి వసతి కల్పించారు. అక్కడ పాపకు లలిత అని పేరు పెట్టారు. అప్పటి నుంచి అక్కడి ఆయాలే పాపకు అమ్మానాన్న. మూడేళ్ల పాటు వారి సంరక్షణలోనే లలిత పెరిగి పెద్దయ్యింది.
స్పెయిన్ దేశ దంపతుల దత్తత
శిశుగృహలోని చిన్నారుల ఫొటోలను దత్తత ఇచ్చేందుకు అధికారులు ఆన్‌లైన్‌లోని ప్రత్యేక వెబ్‌సైట్‌లో పెడుతుంటారు. ఈ క్రమంలో స్పెయిన్ దేశంలోని కిడాడ్రేర్ ప్రాంతానికి చెందిన జీసస్ డెమోగన్ మార్కజ్, మరియాథెరిసా డీ జీసస్ ఆరగాన్ పిరేజ్ దంపతులు పిల్లలను దత్తత తీసుకునేందుకు అన్వేషిస్తున్నారు. వారికి పెళ్లై 20 ఏళ్లయినా సంతానం కలుగలేదు. దీనికి తోడు వారి దేశంలో ఎవరినైనా పిల్లలను దత్తత తీసుకుందామంటే చాలా మంది సంతానలేమితో బాధపడుతున్న వారే అధికం. దీంతో ఇతర దేశాల్లో పిల్లలను ఆన్‌లైన్‌లో వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే శిశుగృహలోని చిన్నారుల ఫొటోలు వారి కంట పడ్డాయి. అందులోంచి లలితను ఎంచుకున్నారు. ఈ మేరకు మన దేశం వచ్చి అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. గురువారం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆర్‌జేడీ శారద, శిశు గృహ మేనేజర్ సమక్షంలో చిన్నారి లలితను స్పెయిన్ దంపతులకు అప్పగించారు. జిల్లా జడ్జి సమక్షంలో మరిన్ని ఆధారాలు చూపించిన అనంతరం వారం రోజుల్లో స్పెయిన్ దేశానికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎవరికి జన్మించిందో.. ఎక్కడ పుట్టిందో తెలియని చిన్నారి.. ఇప్పుడు స్పెయిన్ దేశానికి వెళ్తుండటంతో శిశుగృహతో పాటు స్త్రీ, శిశు సంక్షేమ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement