ప్రేక్షక పాత్ర వద్దు.. చర్యలు తీసుకోవాలి | cabinet meeting held on demonetization issue | Sakshi
Sakshi News home page

ప్రేక్షక పాత్ర వద్దు.. చర్యలు తీసుకోవాలి

Published Mon, Nov 28 2016 2:07 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

ప్రేక్షక పాత్ర వద్దు..  చర్యలు తీసుకోవాలి - Sakshi

ప్రేక్షక పాత్ర వద్దు.. చర్యలు తీసుకోవాలి

  • ప్రజల ఇబ్బందులపై తగిన చర్యలు తీసుకోవాలి: సీఎం కేసీఆర్
  • పెద్ద నోట్ల రద్దుతో లక్షలాది మంది కష్టాలు పడుతున్నారు
  • భవిష్యత్తులో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలి
  • అధికారులు, మంత్రులూ.. సూచనలివ్వండి
  • నగదు రహిత లావాదేవీల విధానంపై అధికారులతో కమిటీ
  • నేడు మంత్రివర్గ సమావేశం
  • సాక్షి, హైదరాబాద్
    పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం సరైంది కాదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులు, సోమవారం జరిగే కేబినెట్ భేటీలో చర్చించాల్సిన అంశాలపై ప్రగతిభవన్‌లో సీఎం ఆదివారం సమీక్ష నిర్వహించారు. పెద్దనోట్ల రద్దుతో లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారని, వాటిని అధిగమించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులు, మంత్రులు తగిన సలహాలు, సూచనలు అందించాలని ముఖ్యమంత్రి కోరారు.
     
    భవిష్యత్తులో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు, ప్రజలకు అవగాహన కల్పించేలా కలెక్టర్లు బ్యాంకర్లతో మాట్లాడేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు ప్రభుత్వం సహాయకారిగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం ఏం చేయాలో స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం తదితర అంశాలపై కేబినెట్‌లో కూలంకషంగా చర్చించేందుకు వీలుగా సమగ్ర నివేదిక తయారు చేసి మంత్రులకు అందివ్వాలని ఆర్థిక శాఖ కార్యదర్శికి సూచించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, సీఎస్ రాజీవ్ శర్మ, సీనియర్ అధికారులు నర్సింగ్ రావు, శాంతకుమారి, రామకృష్ణారావు, నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.
     
    అయిదుగురు సభ్యులతో కమిటీ
    రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలు, ఎలక్ట్రానిక్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు అవసరమైన విధానం రూపొందించేందుకు అయిదుగురు సభ్యులతో సీఎం ఉన్నత స్థాయి కమిటీని నియమించారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు సురేశ్ చంద్ర, శాంతికుమారి, నవీన్ మిట్టల్, జయేశ్ రంజన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘనందన్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్ ఈ కమిటీలో ఉన్నారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు సచివాలయంలో జరగనుంది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు అవసరమైన విధానానికి రూపకల్పన చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement