ఖతర్నాక్ పావని!
ఖతర్నాక్ పావని!
Published Tue, Jan 5 2016 10:33 AM | Last Updated on Sun, Sep 3 2017 3:08 PM
- పైకి చీరల వ్యాపారం.. చేసేది వడ్డీ వ్యాపారం
- ముత్తూట్‌లో 244 ఖాతాల్లో 8 కిలోల బంగారం తాకట్టు
- పావనికి చింటూ అండ.. కస్టడీకి కోరనున్న పోలీసులు
చిత్తూరు: నగరంలోని ఎస్‌బీఐ కాలనీకి చెందిన పావని గురించి బాధితుల్ని విచారిస్తున్న పోలీసులకు దిమ్మతిరిగే వాస్తవాలు తెలుస్తున్నాయి. మూడేళ్లుగా పావని చిత్తూరులో చీరల వ్యాపారం చేస్తోంది. ఆమె భర్త చరణ్ అలియాస్ చెర్రీ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పావని కాలనీలోని మహిళలతో సన్నిహితంగా మెలుగుతూ వారి నుంచి అప్పులు తీసుకునేది. మూడేళ్ల కాలంలో చిత్తూరు నగరంతో పాటు శ్రీకాళహస్తి ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు మహిళల నుంచి నగదు, బంగారు ఆభరణాలు అప్పుగా తీసుకుంది. 2013 నవంబరు నుంచి 2015 డిసెంబరు వరకు చిత్తూరులోని ముత్తూట్ గోల్డ్ ఫైనాన్స్‌లో 244 ఖాతాలు తెరిచి 7.882 కిలోల బంగారు ఆభరణాలు కుదువ పెట్టింది. ఇందులో 1.30 కిలోల బంగారు ఆభరణాలను ముత్తూట్ సంస్థ వేలం వేయగా, 4.308 కిలోల ఆభరణాలను రూ.91 లక్షలు చెల్లించి పావని విడిపించుకుంది. 1.600 కిలోల ఆభరణాలను వారం క్రితం చిత్తూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మూడు నెలల క్రితం శ్రీకాళహస్తి కోర్టులో ఐపీ దాఖలు చేసిన పావనిని నగల యజమానులు ఆభరణాలను ఇచ్చేయమని ఒత్తిడి తెచ్చారు. పావని తనను మోసగించి 406 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకెళ్లినట్లు నగరానికి చెందిన ఓఎం. రాందాస్ భార్య జ్యోత్న్స పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ బండారం బయటపడింది.
చింటూపై కేసు
ఈ నేపథ్యంలో పావని హరిదాస్ ద్వారా చింటూ వద్దకు వెళ్లి పరిచయం పెంచుకుంది. రాందాస్ భార్య జ్యోత్న్సతోపాటు పలువురు మహిళలను చింటూ బెదిరించినట్లు పోలీసుల రికార్డుల్లో నమోదయ్యింది. దీంతో పోలీసులు చింటూ, హరిదాస్, పావని, చెర్రీలపై ఐపీసీ 420, 384, 109 ఆర్‌డబ్ల్యూ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో విచారించడానికి చింటూ, హరిదాస్‌ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. మేయర్ దంపతుల హత్యకు వారం ముందే పావనిని చింటూ బయటకు పంపించేశాడని, తరువాత ఇతను కూడా ఆమె వద్దకు వెళ్లనున్నట్లు సమాచారం రావడంతో ఆ దిశగా కూడా నెలక్రితం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు చెబుతున్నారు.
Advertisement
Advertisement