భజనలతో నిరసన చేస్తున్న కళాకారులు
– టీటీడీ పరిపాలనా భవనం ఎదుట
హోరెత్తిన వత్తి కళాకారుల దీక్ష
–సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ఆందోళన
–కళాకారుల దీక్షలను పలు పార్టీల సంఘీభావం
తిరుపతి అర్బన్ : శ్రీవారి సేవలను విస్తృతం చేసే కళాకారుల సమస్యల పట్ల టీటీడీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని జానపద వృత్తి కళాకారుల సంఘం అధ్యక్షుడు యాదగిరి పేర్కొన్నారు. జానపద వృత్తికళాకారుల సంఘం ఆధ్వర్యంలో తిరుపతిలోని టీటీడీ ఏడీ బిల్డింగ్ వద్ద చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షలు గురువారం రెండో రోజుకు చేరాయి. కర్ణాటక, తమిళనాడుతో పాటు అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన కళాకారులు ఈ ఆందోళనపథంలో పాల్గొంటున్నారు. దీక్షలకు వైఎస్సార్‌సీపీ, మహిళా కాంగ్రెస్, సీపీఐ, లోక్‌సత్తా, సంఘీభావం తెలిపాయి. కళాకారులు గోవిందనామ సంకీర్తన, భజనలతో మార్మోగించారు. తమ సమస్యలు పరిష్కారం చేసే వరకు దీక్షలు ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గౌరవ పారితోషికం ఇవ్వాలని, వాయిద్య పరికరాలు అందించాలని, అర్హులైన భజన గురువులకు శిక్షణ ఇవ్వాలన్న డిమాండ్‌తో 176 భజన బృందాలు దీక్షలో పాల్గొంటున్నాయి. గురువారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. చంటిబిడ్డలు, వృద్ధులతో వారు రోడ్లపై పడుతున్న అవస్థలు దయనీయంగా ఉన్నాయి. చంటిబిడ్డలకు పుట్‌పాత్‌లపై చెట్లకొమ్మలకు ఊయల కట్టి లాలించడం కదిలించింది. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ ప్రజల్లో భక్తి చైతన్యాన్ని నింపుతూ శ్రీవారి ప్రాశస్త్యాన్ని నలుదిశలా ప్రచారం చేస్తున్న కళాకారుల దీనవస్థలను అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కళాకారుల సంప్రదాయాన్ని మెరుగు పరుస్తున్నామన్న అధికారుల మాటలు హామీలకే పరిమితమయ్యాయని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవకోన రాజేంద్ర మాట్లాడుతూ కళాకారులపై కూడా వివక్ష చూపడం తగదన్నారు. స్వామి వారి వైభవాన్ని కళా రూపాలతో ప్రపంచానికి తెలియజేస్తున్న కళాకారుల సమస్యలపై ఏళ్ల తరబడి నిర్లక్ష్యం చేయడం సమంజసం కాదన్నారు. మహిళాకాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ ఉద్యమాలు చేసిన ప్రతిసారీ అధికారులు హామీలతో సరిపెడుతుండడంతో ఈసారి దీక్షలకు దిగారని తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు మాట్లాడుతూ టీటీడీ అధికారులు అనవసర పనులకు కోట్లాదిరూపాయల ఖర్చులు పెడుతూ భజన సంప్రదాయాన్ని కొనసాగించే కళాకారులకు ఖర్చు చేసేందుకు మాత్రం ఆలోచించడం విడ్డూరమన్నారు. ప్రజానాట్యమండలి నాయకుడు పెంచలయ్య, గుర్రప్ప, మునీంద్ర, నాగరాజు, జానపద కళాకారులు అమరనా«ద్, సుబ్బారెడ్డి, రఫీ, జగన్, వెంకటాచలపతి, రవితేజ, రాజగోపాల్, హనుమంత రాయుడు తదితరులు పాల్గొన్నారు.