మారతారా.. మార్చమంటారా
మారతారా.. మార్చమంటారా
Published Fri, May 12 2017 10:17 PM | Last Updated on Tue, Sep 5 2017 11:00 AM
కొందరి తప్పులతో రెవెన్యూ శాఖకు చెడ్డపేరు
–రెవెన్యూ శాఖను సంస్కరణల బాట పట్టించాం
–భూముల రీ సర్వేతోనే సమస్యలకు పరిష్కారం
– అలసత్వపు సర్వేయర్లను సస్పెండ్ చేయండి: డిప్యూటీ సీఎం
కర్నూలు(అగ్రికల్చర్): ‘‘రెవెన్యూ శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం.. రైతుల సంక్షేమం దృష్యా అసెంబ్లీలో మూడు కీలకమైన బిల్లులను ఆమోదించాం.. త్వరలో జీవోల రూపంలో రానున్నాయి.. అయితే కొంత మంది అధికారులు చేస్తున్న తప్పుల వల్ల మొత్తం రెవెన్యూ వ్యవస్థకే చెడ్డపేరు వస్తోంది. ఇక దీన్ని చూస్తూ కూర్చోలేం. మీరు మారండి.. లేకపోతే మేమే మార్చాల్సి వస్తుంది.’’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తహసీల్దార్లను హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారుల సదస్సు నిర్వహించారు. రాష్ట్ర భూ పరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ అనిల్‌చంద్రపునీత, సర్వే సెటిల్‌మెంట్, ల్యాండ్ రికార్డ్స్ స్పెషల్ కమిషనర్ సీహెచ్ విజయమోహన్, అసిస్టెంట్ సీసీఎల్‌ఏ జగన్నాథం, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ డిప్యూటీ ఐజీ ఉదయభాస్కర్ తదితరలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేఇ కృష్ణమూర్తి మూట్లాడుతూ.. మీసేవ కేంద్రాల ద్వారా జారీ చేస్తున్న ఆదాయ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు.. ఎఫ్–లైన్ పటిషన్‌లు, మ్యుటేషన్‌లు, ఈ–పాసు పుస్తకాల జారీలో అవినీతి ఎక్కువగా ఉందని, ఈ సేవలను సరళతరం చేసే విధంగా జిల్లా కలెక్టర్, జేసీలు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేకించి మ్యుటేషన్స్‌కు సంబంధించి రైతులు ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిర్ణీత గడువు 30 రోజుల్లోపు తహసీల్దార్లు చర్యలు తీసుకోకపోతే ఆటో మ్యుటేషన్ జరుగుతుందని స్పష్టం చేశారు.
సంస్కరణల బాట
రెవెన్యూ శాఖలో పారదర్శకత పెంపొందించడంలో భాగంగా మీ భూమి వెబ్‌సైట్‌ను తెలుగులో రూపకల్పన చేసి ప్రజలకు అందుబాటులో ఉంచామని డిప్యూటీ సీఎం తెలిపారు. రైతులు తమ భూముల వివరాలు సరిగా లేకపోయినట్లయితే ఫిర్యాదు చేయడానికి వెబ్‌సైట్‌లో వెసులుబాటు కల్పించామన్నారు. ఈ ఫిర్యాదులను జేసీ మానిటర్ చేసి పరిష్కరిస్తారన్నారు. సంస్కరణలతో రెవెన్యూ శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తున్నా.. నాణేనికి రెండో వైపు ఉన్నట్లు కొంత మంది అధికారులు స్వార్థంతో రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేస్తున్నారన్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
భూముల రీ సర్వే జరుగాలి
పట్టాదారుల సమస్యలు పూర్తిగా పరిష్కారం కావాలన్నా.. లోపాలను పూర్తిగా సరిదిద్దేందుకు భూముల రీ సర్వే జరగాలని.. ఆ దిశగా సర్వే సెటిల్‌మెంటు, ల్యాండ్ రికార్డ్స్ స్పెషల్ కమిషనర్ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మండల కార్యాలయాల్లో సర్వే పిటిషన్‌లు పేరుకుపోతున్నాయని, సర్వే కోసం వచ్చే పిటిషన్‌లను వేగంగా పరిష్కరించేందుకు అధునాతన టెక్నాలజీని ఉపయోగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 670 ఈటీఎస్ మిషన్‌లు వినియోగించడంతో పాటు జిల్లాకు ఒక డీజీపీఎస్ మిషన్ సరఫరా చేశామన్నారు.
పనిచేయని సర్వేయర్లను సస్పెండ్ చేయండి
సర్వేయర్లు టూర్ డైరీ సక్రమంగా నిర్వహించడం లేదని, ఈవిషయంలో పై అధికారులు కూడా తనిఖీలు చేయడం లేదని కేఈ అన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహించే వారిపై ఎలాంటి చర్యలు లేకపోవడం దారుణమన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే సర్వేయర్లను సస్పెండ్ చేయాలని.. టూర్ డైరీని విధిగా తనిఖీ చేయాలని వివరించారు. ప్రభుత్వ నిర్ణయాలు త్వరితగతిన అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ఆలస్యం వల్ల ప్రజల్లో అసహనం పెరుగుతోందన్నారు.
కర్నూలు జిల్లాను మొదటి స్థానంలో నిలపాలి: సీసీఎల్‌ఏ
రెవెన్యూ అంశాల్లో కర్నూలు జిల్లాను మొదటి స్థానంలోకి తీసుకొచ్చేందుకు రెవెన్యూ శాఖలోని ప్రతి ఒక్కరు మరింత పట్టుదలతో పనిచేయాలని సీసీఎల్‌ఏ అనిల్‌చంద్రపునీత అన్నారు. ఇప్పటి వరకు అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాలు మొదటి స్థానాల్లో ఉన్నాయని.. ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి కేఇ కృష్ణమూర్తి సొంత జిల్లాను మొదటి స్థానంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు. సర్వే సెటిల్‌మెంట్, ల్యాండ్ రికార్డ్స్ స్పెషల్ కమిషనర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ ఎఫ్‌ఎంబీల డిజిటలైజేషన్ త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ రెవెన్యూలో జిల్లాను ఆరు నెలల్లో ఉన్నత స్థానానికి తీసుకొస్తామన్నారు. సమావేశంలో జేసీ ప్రసన్నవెంకటేష్, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, సర్వే డీడీ ఝూన్సీరాణి.. కర్నూలు, నంద్యాల, ఆదోని ఆర్‌డీఓలు హుసేన్‌సాహెబ్, రాంసుందర్‌రెడ్డి, ఓబులేసు , సర్వే ఏడీ చిన్నయ్య, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement