హద్దులు లేక అన్యాక్రాంతం నగరంలో కానరాని చెరువులు
యథేచ్ఛగా ఆక్రమణలు
చెరువుల భూముల్లో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు
అధికారుల పాత్రపై అనుమానాలు
గ్రేటర్ పరి«ధిలోని పలు చెరువులకు హద్దులు పెట్టకపోవడంతో అవి ఆక్రమణకు గురవుతున్నాయి. జలాశయాలను పరిరక్షించాలని స్వచ్ఛంద సంస్థల ప్రతి నిధులు, చెరువుల రక్షణ సొసైటీలు జిల్లా యంత్రాంగానికి ఎన్ని వినతి పత్రాలు ఇస్తున్నా స్పందన కరువైంది.
వరంగల్: గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి ఇబ్బందిగా మారడంతో గ్రామాల్లోని కూలీలు నగరానికి వలస వస్తున్నారు. ఇలాంటి వారు నివాసముండేందుకు ప్రభుత్వ స్థలాలే దిక్కయ్యాయి. వీటితో పాటు చెరువుల శిఖం భూముల్లో వీరు తాత్కాలికంగా నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ, వారి ముసుగులో రియల్టర్లు చెరువుల భూములను చెరపడుతున్నారు. ఒకనాటి రామసముద్రం నేడు ఎస్‌ఆర్ నగర్‌గా మారింది. కాలనీ వాసులు మౌలిక వసతుల కోసం కేటాయించిన ప్రభుత్వ భూమి సైతం ఆక్రమణకు గురైంది. దీనిపై స్థానికులు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోకపోవడంపై అధికారుల పాత్రపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
నగరంలో చెరువులు ప్రశ్నార్థకమే...
గ్రేటర్ వరంగల్ పరిధిలో సమ్మర్ స్టోరేజీ రిజర్వాయర్లుగా, మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేస్తున్న కొన్ని చెరువులు మినహాయిస్తే మిగిలిన చెరువులు కనిపించని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. హన్మకొండ, వరంగల్, కాజీపేట, హస¯Œపర్తి రెవెన్యూ గ్రామాల పరిధిలో 34 చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. హన్మకొండలోని న్యూశాయంపేట కోట చెరువు, కాజీపేట దంతాల చెరువు, బంధం చెరువు, భట్టుపల్లి కోట చెరువు, తిమ్మాపూర్ బెస్తం చెరువు, మడికొండ లోయకుంట, అయో«ధ్యాపురం దాసరి కుంట, సోమిడి ఊర చెరువు, పైడిపెల్లిలోని ఉగాది చెరువు, పురిగిద్దు చెరువు, మొగుళ్లబంధం, ఆరెపల్లి తుర్కకుంట, తిమ్మాపూర్‌లోని మద్దెలకుంట, మంగళకుంట, ఎర్రకుంట, మామునూరులోని భగవాన్ చెరువు, సాయికుంట, ఎనుమాములలోని సాయి చెరువు, రామసముద్రం, బ్రాహ్మణకుంట, గోపాలపురంలోని ఎనకెర్ల సూరం కుంట, ఊర చెరువు, పలివేల్పులలోని పెద్ద చెరువు, ఉంగల చెరువు, మాలకుంటలు ఉన్నాయి.
వరంగల్ మండలం పరిధిలో ఉర్సు రంగసముద్రం, మట్టెవాడ కోట చెరువు, నిమ్మల చెరువు, దేశాయిపేట కొత్త వడ్డేపల్లి చెరువు, హసన్‌పర్తి మండల పరిధిలో వంగపహాడ్ చింతల్ చెరువు, ఎల్లాపూర్ సాయన్న చెరువు, బీమారం శ్యామల చెరువు, హసనపర్తి చెన్నంగి చెరువు, ముచ్చర్ల వెంకటాద్రి చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల పరిధిలోని వేలాది ఎకరాల్లో ఇళ్లు, ఫ్లాటింగ్ చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అసలు చెరువు విస్తీర్ణం ఎంత ఉంది. అందులో ఎన్ని ఎకరాలు అన్యాక్రాంతమైందన్న వివరాలు ఇరిగేషన్ అధికారులు చెప్పలేకపోతున్నారు.
హద్దులు తేల్చని రెవెన్యూ శాఖ...
నగరంలోని చెరువులు మైనర్ ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉన్నప్పటికీ వాటి విస్తీర్ణం ఎంత ఉన్నదన్న విషయాలను రెవెన్యూ శాఖ నిర్ధారించాల్సి ఉంది. విస్తీర్ణం ఎంత ఉందో అన్నది రెవెన్యూ శాఖ గుర్తించి హద్దులు నిర్ణయిస్తే ఇరిగేషన్ శాఖ అధికారులు ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) నిర్ధారించాల్సి ఉంటుంది. ఇరు శాఖల్లో సమన్వయం లేకపోవడంతో చెరువుల భూములు ఆక్రమణకు గురువుతున్నాయి. ఈ చెరువుల పరిధిలో పట్టా భూములు ఉన్నాయని, హద్దులు గుర్తిస్తే తమ భూముల్లో హద్దులు పెట్టుకుంటామని భూహక్కుదారులు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను సంప్రదిస్తున్నా పట్టించుకోని పరిస్థితులు నెలకొన్నాయి. చెరువుల ఎఫ్టీఎల్ ఏమేరకు విస్తరించి ఉన్నది...విస్తీర్ణం ఎంత ఉన్నదన్న విషయాలను ప్రయివేటు ఏజెన్సీలతో సర్వే చేసి నిర్ణయిస్తామని అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ కరుణ ప్రకటించినా నేటి వరకు ఎలాంటి సర్వేలూ చేపట్టలేదు.
నిలిచిన ‘బతుకమ్మ’ గద్దె నిర్మాణ పనులు
చిన్నవడ్డేపల్లి చెరువులో ప్రతి ఏటా బతుకమ్మ ఆడేందుకు స్థలాన్ని ఎఫ్టీఎల్ పరిధిలో కేటాయించారు. ఈ స్థలంలో గద్దె నిర్మించి బతుకమ్మ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ప్రారంభమైన పనులు నిలిచిపోయాయి. రెండు రోజుల క్రితం పనులు జరుగుతున్న స్థలంతో పాటు సుమారు నాలుగున్నర ఎకరాల భూమిపై కోర్టు తీర్పు ఇచ్చిందని స్థల యాజమాని చెప్పడంతో బతుకమ్మ గద్దె పనులు నిలిచిపోయాయి. అసలు చెరువు ఎఫ్‌టీఎల్ ఎంత వరకు విస్తరించి ఉన్నది. అందులో ప్రభుత్వ భూమి ఏమేరకు ఉన్న విషయాలను గుర్తించి హద్దులు పెట్టాలని చెరువుల పరిరక్షణ కమిటీలు డిమాండ్ చేస్తున్నాయి.