రెండు బియ్యం లారీల పట్టివేత
చిలమత్తూరు : చిలమత్తూరు మండలం కొడికొండ సమీపంలోని జిలాచర్ల క్రాస్‌లో బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న రెండు లారీలను వాణిజ్య పన్నుల శాఖ స్పెషల్ ఏసీటీ ఓ బేబీ నందా మంగళవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. కొత్తచెరువు ప్రాంతం నుంచి రెండు లారీలలో 33 టన్నుల బియ్యం బస్తాలను కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా బంగారుపేటకు అక్రమంగా తరలిస్తుండగా వెంబడించి పట్టుకున్నామని ఆమె తెలిపారు. అనంతరం వాటిని స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు వివరించారు. అయితే లారీల్లోని సరుకు స్టోర్లదా, లేక ఇతర బియ్యమా అనే వివరాలు ఓపెన్ చేస్తే తెలుస్తుందన్నారు. కాగా లారీలను వదిలిపెట్టాల్సిందిగా అధికార పార్టీ నేతల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వచ్చినట్లు తెలిసింది. అప్పటికే ఆ లారీలను ఆమె పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం.