‘ఔటర్’పై కారు బోల్తాముగ్గురికి గాయాలు
ఊడిన ముందు చక్రం అతివేగంతో ప్రమాదం
మహేశ్వరం : ఔటర్‌రింగ్ రోడ్డుపై ఓ కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. మహేశ్వరం మండలం మంఖాల్ ఔటర్‌రింగ్‌రోడ్డుపై శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కేరళకు చెందిన ముగ్గురు వ్యక్తులు స్విఫ్ట్ కారులో బొంగ్లూర్ ఔటర్ రింగ్ రోడ్డుపై రావిర్యాల మీదుగా శంషాబాద్ వైపు వెళ్తున్నారు. ఈక్రమంలో మంఖాల్ గ్రామ సమీపంలోకి రాగానే వేగంగా ఉన్న కారు ముందు చక్రం ఊడిపోయింది.
అంతలోనే వెనుక టైర్ పగలడంతో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కాలువిరిపోయింది. వెనుక కూర్చున్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఔటర్ రింగ్ రోడ్డు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తీసుకెళ్లారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని పహాడిషరీఫ్ సిఐ చలపతి తెలిపారు.