
సీసీ కెమెరాకు చిక్కిన దొంగ
కారు పార్కింగ్ పాయింట్‌లో ఉంచిన హోటల్ డ్రైవర్ తాళాలను దొంగ చేతికి ఇచ్చి వెళ్లాడు.
అమీర్‌పేట: సినీ ఫక్కీలో ఓ దొంగ కారు ఎత్తుకెళ్లాడు. వాటర్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగి శ్రీమన్నారాయణ బుధవారం రాత్రి తన స్నేహితులతో కలిసి అమీర్‌పేట్ గ్రీన్‌పార్కు హోటల్‌కు వచ్చాడు. కారు దిగి హోటల్ డ్రైవర్‌కి తాళాలు ఇచ్చాడు. అదే సమయంలో రెప్పపాటులో మరో వ్యక్తి మరోవైపు డోర్‌లోంచి కారులో కూర్చున్నాడు.
కారు తాళాలు ఇచ్చిన వారితో అతను కూడా వచ్చాడనుకున్న హోటల్ డ్రైవర్...‘సార్! లోపలికి వెళ్లండి’ అనగా... ‘నాకు అన్ ఈజీగా ఉంది, కారులోనే ఉంటా... ఏసీ ఆన్ లో ఉంచు’.. అని కారులో కూర్చున్న వ్యక్తి అన్నాడు. కారు పార్కింగ్ పాయింట్‌లో ఉంచిన హోటల్ డ్రైవర్ తాళాలను దొంగ చేతికి ఇచ్చి వెళ్లాడు.
కొద్ది సేపటి తర్వాత అందరి కళ్లుకప్పి దొంగ కారుతో ఊడాయించాడు. డిన్నర్ ముగించుకొని వచ్చిన శ్రీమన్నారాయణ తన కారు ఏదని ప్రశ్నించాడు. తర్వాత మోసం జరిగిందని తెలుసుకొని ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ పుటేజీల ఆధారంగా పోలీసులు దొంగ ఫోటొను విడుదల చేశారు. నిందితుడిని ఎవరైనా గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.