రోడ్డుపై బ్యాగు.. భారీగా డబ్బు
విజయవాడ: విజయవాడ బీసెంట్ రోడ్డులో సంఘవి జ్యూలరీ షాపు వద్ద గల్లంతైన నగదు బ్యాగ్ కేసును సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు గంటల వ్యవధిలోనే చేధించారు. జ్యూయలరీ షాపులో పని చేస్తున్న గుమస్తా రామకృష్టకి బ్యాంకులో డీడీ తీయమని యజమాని రూ.36 లక్షలు ఇచ్చాడు. ఈ డబ్బును ఓ బ్యాగ్ లో పెట్టుకుని రామకృష్ణ తన బైక్ పెట్రోల్ ట్యాంకు కవర్ పై బ్యాగ్ పెట్టాడు. బ్యాంకుకు బయలు దేరేందుకు బైక్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నగదు బ్యాగు కిందకు జారి పడిపోయింది.
అతడు చూసుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. షాపు నుంచి కొంచం దూరం వెళ్లిన తరువాత చూసుకోగా బ్యాగు లేక పోవటంతో కంగారు పడ్డ రామకృష్ణ చుట్టుపక్కల గాలించాడు. ఫలితం లేకపోవడంతో షాపు యజమానికి తెలియజేశాడు. యజమాని వెంటనే గవర్నర్‌పేట పోలీసులకి ఫిర్యాదు చేశారు. అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ శ్రావణి అధ్వర్యంలో పోలీసులు షాపు వద్ద పరిశీలించారు. షాపు వద్ద ఉన్న సీసీ పుటేజ్ పరిశీలించగా షాపు దగ్గర బైక్‌లో పెట్టుకున్న బ్యాగ్ అక్కడే పడిపోవడం అందులో రికార్డయింది.
అప్పుడే అటుగా వచ్చిన ముగ్గురు పాదచారుల్లో ఓ వ్యక్తి ఆ బ్యాగ్ తెరచి చూసి డబ్బులు ఉండటంతో బ్యాగ్ తీసుకుని వెళ్లి పోవటం మొత్తం సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయి. పోలీసులు నగరంలో అన్ని ప్రాంతాలలో ఉన్న పోలీసులను అప్రమత్తం చేశారు. నగరంలో బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే బ్యాగ్‌ను తీసుకువెళ్లిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి నగదుతో కూడిన బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నారు. డబ్బు తిరిగి దొరకడంతో జ్యూయలరీ షాపు యజమాని, గుమాస్తా రామకృష్ట ఊపిరి పీల్చుకున్నారు.