Cash bag
-
పార్క్ చేసి ఉన్న బైక్‌పై డబ్బుల బ్యాగ్.. తర్వాత ఏం జరిగిందంటే..
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన చదల అమరేశ్వరరావు రిటైర్డ్ ఉద్యోగి. సోమవారం గవర్నర్‌పేట బకింగ్ హామ్ పోస్టాఫీసులోని తన ఖాతా నుంచి రూ. 5లక్షలు డ్రా చేశాడు. ఇంటికి తిరిగి వెళ్తూ అక్కడ పార్క్ చేసి ఉన్న బైక్‌పై నగదు బ్యాగ్ ఉంచాడు. ఈ లోగా ఫోన్ రావడంతో మాట్లాడుకుంటూ బ్యాగ్ మరచిపోయి వెళ్లిపోయాడు. చదవండి: మాదాపూర్: ‘ఓయో’పై దాడి.. 8 మంది అరెస్ట్ కొద్ది సేపటికి బైక్ యజమాని కాగిత నరసింహారావు వచ్చి చూడగా తన బైక్‌పై క్యాష్ బ్యాగ్ కనిపించింది. వెంటనే అతను బకింగ్‌హామ్ పోస్టాఫీసు లోపలికి వెళ్లి బ్యాగ్ విషయం అక్కడ ఉన్న సిబ్బందికి తెలిపాడు. అప్పటికే అమరేశ్వరరావు పోలీసు స్టేషన్‌కు వచ్చారు. పోస్టాఫీసు నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి క్యాష్ బ్యాగ్‌ను పరిశీలించి అమరేశ్వరరావుకు చెందినదని నిర్ధారించి అతనికి అప్పగించారు. నిజాయితీగా వ్యవహరించిన కాగిత నరసింహారావును పోలీసులు, పోస్టాఫీసు సిబ్బంది అభినందించారు. -
డబ్బు సంచులతో ఘనీ పరారీ
మాస్కో: సంక్షోభ అఫ్గాన్ నుంచి సంచులకొద్దీ సొమ్ముతో అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ పారిపోయారని తెలుస్తోంది. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్.. నగదుతో నిండిపోయిందని రష్యా అధికార వార్తా వెల్లడించింది. అఫ్గాన్ రాజధాని కాబూల్‌లో ఉన్న రష్యా రాయబార కార్యాలయం అందించిన వివరాలను రష్యా అధికారిక వార్త సంస్థ టాస్ (టీఏఎస్ఎస్) సోమవారం బయటపెట్టింది. ఘనీ కోసం భారీస్థాయిలో డబ్బుల కట్టలను కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించారు. మొత్తం నగదుతో నింపిన నాలుగు కార్లను ఎయిర్‌పోర్టు రన్‌వే మీదకు తెచ్చారు. కార్లలో ఉన్న నగదుతోపాటు విడిగా మరో క్యాష్ బ్యాగ్‌ను అక్కడికి తీసుకొచ్చారు. వీలైనంత ఎక్కువ నగదు కట్టలను హెలికాప్టర్లోకి ఎక్కించారు. సరిపడా ఖాళీ లేకపోవడంతో, చేసేదేమీలేక కొంత నగదును రన్‌వే మీదనే వదిలేసి అధ్యక్షుడు ఘనీ అఫ్గాన్‌ను వదిలి విదేశం వెళ్లిపోయారని ‘టాస్’ వెల్లడించింది. ఘనీతోపాటు చాలా నగదు దేశం దాటి పోయిందని రష్యా దౌత్య మిషన్ అధికార ప్రతినిధి నికిత ఇషెంకో చెప్పారు. -
కోతి చేష్టతో లబోదిబో: రూ.3 లక్షలు ఎత్తుకెళ్లిన వానరం
లక్నో: కోతి చేష్టలు అని ఊరికే అనరు. తాజాగా ఆ చేష్టలతో ఓ వ్యక్తి రూ.3 లక్షలు నష్టపోయాడు. నగదుతో కూడిన బ్యాగ్‌ను వానరం ఎత్తుకెళ్లడంతో బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి జిల్లా సాండీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ఆశిష్‌సింగ్ అనే యువకుడు భూమి అమ్మగా వచ్చిన రూ.3 లక్షల డబ్బును ఓ బ్యాగ్‌లో పెట్టి బైక్ కవర్లో ఉంచాడు. అనంతరం లేక్పాల్ను కలిసేందుకు వచ్చాడు. సాండీ పోలీస్‌స్టేషన్ వద్ద బైక్‌ను నిలిపి లేక్పాల్ను కలిసేందుకు వెళ్లాడు. మాట్లాడి వచ్చి చూడగా బైక్ కవర్లో ఉన్న నగదుతో ఉన్న బ్యాగ్ కనిపించలేదు. కోతులు ఆ బ్యాగ్‌ను చిందరవందర చేశాయని గుర్తించాడు. కోతుల వెంట ఆశిష్ పరుగెత్తాడు. నగదు కోసం గాలించగా ఎక్కడా కనిపించలేదు. లబోదిబో అనుకుంటూ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా ఓ సెక్యూరిటీ గార్డు పిలుపునిచ్చాడు. చిందరవందరగా ఉన్న నగదును తీసుకొచ్చి ఆశిష్‌కు అందించాడు. తినే వస్తువులు కావడంతో కోతులు ఒకచోట పడేయగా వాటిని సెక్యూరిటీ గార్డు గమనించాడు. కిందపడిన నగదును నిజాయతీతో బాధితుడికి అందించాడు. పోయిన డబ్బులు తిరిగి రావడంతో ఆశిష్ ఆనంధానికి అవధులు లేవు. ఈ సందర్భంగా సెక్యూరిటీ గార్డుకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పి కొంత నగదు కానుక అందించాడు. -
పడి ఉన్న డబ్బుల కట్టలను కాదనుకుని ఆదర్శంగా నిలిచిన యువత
పెద్దాపురం: పది రూపాయలు దొరికితే జేబులో వేసుకునే నేటి కాలంలో అక్షరాలా రూ.3.50 లక్షల నగదు దొరికితే వెంటనే సొంతం చేసేసుకోవాలనే దుర్బుద్ధే చాలామందికి పుడుతుంది. కానీ, తాము మాత్రం అందుకు భిన్నమని నిరూపించి, పదిమందికి ఆదర్శంగా నిలిచారా యువకులు. ఎస్సై రావూరి మురళీమోహన్ కథనం ప్రకారం.. స్థానిక వడ్లమూరు రోడ్డులోని ఎపెక్స్ రొయ్యల పరిశ్రమలో సర్దార్ అనే వ్యక్తి కార్మిక కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు. పట్టణంలోని వివిధ బ్యాంకుల ఏటీఎంలలో రూ.3.50 లక్షలు డ్రా చేసి, చివరిగా స్థానిక సూర్యారావు హోటల్ వెనక ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంకు వెళ్లాడు. అక్కడ కొంత నగదు డ్రా చేసి, జేబులో పెట్టుకుని, చేతిలో ఉన్న నగదు బ్యాగ్‌ను అక్కడే మరచిపోయి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి సూరంపాలెం రోడ్డులోని కోరమండల్ పరిశ్రమలో మిషన్ ఆపరేటర్‌గా పని చేస్తున్న శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన పెంటకోట రవీంద్ర, భువనేశ్వర్‌కు చెందిన సంతోశ్‌రెడ్డి, బిహార్‌కు చెందిన అమిత్ యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంకు నగదు డ్రా చేసేందుకు వెళ్లారు. అక్కడ క్యాష్ బ్యాగ్ కనబడడంతో కలవరపడి వెంటనే తమ సూపర్వైజర్ సుధీర్‌కు సమాచారం అందించారు. ఆయన సూచన మేరకు ఆ బ్యాగ్‌ను పోలీస్ స్టేషన్లో ఎస్సై మురళీమోహన్‌కు అందజేశారు. అదే సమయానికి బ్యాగ్ పోగొట్టుకున్న విషయంపై ఫిర్యాదు చేసేందుకు సర్దార్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. పోయిందనుకున్న క్యాష్ బ్యాగ్‌ను తిరిగి అప్పగించిన ఆ యువకులను ఎస్సై మురళీమోహన్, రొయ్యల పరిశ్రమ హెచ్ఆర్ ప్రతినిధి భరత్, సర్దార్ అభినందించి, రూ.10 వేల నగదు, శాలువతో సత్కరించారు. నిజాయతీని చాటుకున్న ఆ యువకులను పోలీసులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అభినందించారు. -
కళ్లెదుటే డబ్బులున్నా చలించని ధనాజీ..
పుణే: ప్రపంచమంతా డబ్బు చుట్టే తిరుగుతున్నా కొందరు మాత్రం దాని మోజుకు దూరంగానే ఉంటారు. అలాంటి కోవలోకే వస్తాడు మహారాష్ట్రలోని సతారాకు చెందిన ధనాజీ జగ్దలే. తనకు ఓ బస్టాప్‌లో దొరికిన రూ.40 వేలను సొంతదారుకే తిరిగి ఇచ్చేశాడు. అంతేకాదు ఆ వ్యక్తి రూ.వేయి బహుమతిగా ఇస్తానంటే సున్నితంగా తిరస్కరించి, బస్సు చార్జీలకు కేవలం 7 రూపాయలు చాలన్నాడు. ధనాజీ నిజాయితీ మెచ్చిన సతారా ఎమ్మెల్యే శివేంద్రరాజే భోసలే, మాజీ ఎంపీ ఉదయన్‌రాజే భోసలే, మరికొన్ని సంస్థలు అతనికి సన్మానం చేశాయి. ఎన్నారై ఒకరు రూ.5 లక్షలు ధనాజీకి బహుమతిగా ఇవ్వడానికి ముందుకురాగా ఆ సొమ్మును కూడా తీసుకోలేదు. ఒకరి డబ్బు తో తనకు సంతృప్తి కలగదని, మనుషులు నిజాయితీతో బతకాలని ధనాజీ సందేశమిచ్చాడు. -
శభాష్... రమేష్
ఆటోలో మర్చిపోయిన రూ.10 లక్షల నగదు బ్యాగును సంబంధిత వ్యక్తులకు అప్పగించి రమేష్ అనే ఆటోడ్రైవర్ తన నిజాయతీని చాటుకున్నాడు. పలువురి ప్రశంసలు అందుకున్నాడు. బుధవారం గచ్చిబౌలి పరిధిలోని శ్రీరాంనగర్ కాలనీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గచ్చిబౌలి: ఆటోలో మరిచిపోయిన పది లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను సంబంధిత వ్యక్తులకు అప్పగించి ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. ఈ ఘటన బుధవారం గచ్చిబౌలి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. గచ్చిబౌలి సీఐ ఆర్ శ్రీనివాస్ తెలిపిన మేరకు.. సిద్ధిపేటకు చెందిన సోదరులు కొత్తూరు కృష్ణ, ప్రసాద్‌లు కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీలో భవనం నిర్మిస్తున్నారు. నిర్మాణ ఖర్చులు నిమిత్తం రూ. 10 లక్షల నగదు తీసుకొని ఇద్దరు సిద్దిపేట నుంచి బుధవారం ఉదయం బయలుదేరారు. జూబ్లీ బస్ స్టేషన్లో దిగి ఆటోలో శ్రీరాంనగర్ కాలనీలోని సైట్‌కు మధ్యాహ్నం 1 గంటలకు చేరుకున్నారు. రూ. పది లక్షల నగదు కల్గిన బ్యాగ్‌ను ఆటోలో మరిచిపోయారు. ఆటో డ్రైవర్ జర్పుల రమేష్ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్ది నిమిషాల తరువాత క్యాష్ ఉన్న బ్యాగ్‌ను ఆటోలో మరిచిపోయామని తెలుసుకున్న సోదరులు వెంటనే 100కు ఫోన్ చేసి ఆటోలో డబ్బు మరిచిపోయామని చెప్పారు. అప్రమత్తమైన గచ్చిబౌలి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి సమీపంలోని ఆటోలను తనిఖీ చేస్తున్నారు. అప్పటికే కొద్ది దూరం వెళ్లిన ఆటో డ్రైవర్ రమేష్ ఆటోలో మరిచిపోయిన బ్యాగ్‌ను గమనించి తెరచి చూశాడు. అందులో నగదు ఉండటంతో వెంటనే ప్యాసింజర్లను దింపిన సైట్ వద్దకు తిరిగి వచ్చాడు. బాధితులతో పాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్ సమక్షంలో క్యాష్ బ్యాగ్‌ను బాధితులకు అప్పగించారు. నిజాయితీ కల్గిన ఆటో డ్రైవర్‌ను డీసీపీ అభినందించారు. -
నిజాయతీ చాటిన బస్ కండక్టర్, డ్రైవర్
గుంటూరు: బస్సులో కాష్‌బ్యాగ్ మర్చిపోయిన బాధితులకు ఆర్టీసీ బస్ కండక్టర్, డ్రైవర్ కాష్‌బ్యాగ్‌ను అందజేసి నిజాయతీ చాటుకున్నారు. ఈ సంఘటన మంగళగిరి పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. మంగళగిరి డిపో మేనేజర్ విజయకుమార్ తెలిపిన వివరాల ప్రకారం పిడుగురాళ్ల సమీపంలో ఇనుమట్ల గ్రామానికి చెందిన సత్యనారాయణ మంగళవారం గుంటూరులో ఆర్టీసీ బస్టాండ్‌లో బస్ ఎక్కి విజయవాడలో ఉన్న తన కుమారుడి వద్దకు బయల్దేరాడు. ఈ క్రమంలో విజయవాడ ఐస్‌ఫ్యాక్టరీ దగ్గర బస్ దిగి కొంత దూరం వెళ్లిన తర్వాత తనతో పాటు తెచ్చుకున్న రూ.78వేల కాష్‌బ్యాగ్ బస్సులో వదిలివేసినట్లు గుర్తించాడు. హుటాహుటిన విజయవాడ బస్టాండ్‌కు వెళ్లి అక్కడ ఆర్టీసీ అధికారులను విచారించగా, ఆ బస్సు మంగళగిరి డిపోకు చెందినదిగా తెలుసుకుని, మంగళగిరి చేరుకున్నాడు. జరిగిన విషయాన్ని మంగళగిరి డిపో మేనేజర్‌కు బాధితుడు వివరించారు. అయితే అప్పటికే బస్ కండక్టర్ కె.పద్మ, డ్రైవర్ ఏ.డిల్లీరావులు బస్సులో మర్చిపోయిన క్యాష్ బ్యాగ్ వివరాలను తనకు తెలిపినట్లు డిపో మేనేజర్ విజయ్‌కుమార్ వెల్లడించారు.. సత్యనారాయణను విచారించి ఆ కాష్‌బ్యాగ్ అతనిదే అని నిర్థారించి ప్రయాణీకుల సమక్షంలో ఆయనకు డిపో మేనేజర్ బ్యాగ్ అందజేశారు. విధి నిర్వహణలో నిబద్ధత పాటించి, నిజాయతీగా వ్యవహరించిన బస్ కండక్టర్, డ్రైవర్లను డిపో మేనేజర్, ఆర్టీసీ సిబ్బంది, తదితరులు అభినందించారు. ఆర్టీసీ అధికారులకు, బస్ కండక్టర్, డ్రైవర్లకు బాధితుడు సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. -
రోడ్డుపై బ్యాగు.. భారీగా డబ్బు
-
రోడ్డుపై బ్యాగు.. భారీగా డబ్బు
విజయవాడ: విజయవాడ బీసెంట్ రోడ్డులో సంఘవి జ్యూలరీ షాపు వద్ద గల్లంతైన నగదు బ్యాగ్ కేసును సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు గంటల వ్యవధిలోనే చేధించారు. జ్యూయలరీ షాపులో పని చేస్తున్న గుమస్తా రామకృష్టకి బ్యాంకులో డీడీ తీయమని యజమాని రూ.36 లక్షలు ఇచ్చాడు. ఈ డబ్బును ఓ బ్యాగ్ లో పెట్టుకుని రామకృష్ణ తన బైక్ పెట్రోల్ ట్యాంకు కవర్ పై బ్యాగ్ పెట్టాడు. బ్యాంకుకు బయలు దేరేందుకు బైక్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నగదు బ్యాగు కిందకు జారి పడిపోయింది. అతడు చూసుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. షాపు నుంచి కొంచం దూరం వెళ్లిన తరువాత చూసుకోగా బ్యాగు లేక పోవటంతో కంగారు పడ్డ రామకృష్ణ చుట్టుపక్కల గాలించాడు. ఫలితం లేకపోవడంతో షాపు యజమానికి తెలియజేశాడు. యజమాని వెంటనే గవర్నర్‌పేట పోలీసులకి ఫిర్యాదు చేశారు. అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ శ్రావణి అధ్వర్యంలో పోలీసులు షాపు వద్ద పరిశీలించారు. షాపు వద్ద ఉన్న సీసీ పుటేజ్ పరిశీలించగా షాపు దగ్గర బైక్‌లో పెట్టుకున్న బ్యాగ్ అక్కడే పడిపోవడం అందులో రికార్డయింది. అప్పుడే అటుగా వచ్చిన ముగ్గురు పాదచారుల్లో ఓ వ్యక్తి ఆ బ్యాగ్ తెరచి చూసి డబ్బులు ఉండటంతో బ్యాగ్ తీసుకుని వెళ్లి పోవటం మొత్తం సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయి. పోలీసులు నగరంలో అన్ని ప్రాంతాలలో ఉన్న పోలీసులను అప్రమత్తం చేశారు. నగరంలో బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే బ్యాగ్‌ను తీసుకువెళ్లిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి నగదుతో కూడిన బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నారు. డబ్బు తిరిగి దొరకడంతో జ్యూయలరీ షాపు యజమాని, గుమాస్తా రామకృష్ట ఊపిరి పీల్చుకున్నారు. -
ఇంట్లో ఉంటే దొంగిలిస్తారని... బ్యాగులో పెట్టుకుంది..
హైదరాబాద్ : చైతన్యపురి నుంచి చౌటుప్పల్‌కు ఆటోలో వెళ్తున్న మాధవి అనే మహిళ హ్యాండ్ బ్యాగ్ మాయమైంది. చైతన్యపురిలో నివాసముంటున్న మాధవి వరలక్ష్మీ వ్రతం సందర్భంగా చౌటుప్పల్‌లోని తన ఇంటికి వెళదామని అనుకుంది. ఇంట్లో ఎవరూ లేకపోతే దొంగలు పడతారు అని భావించిన ఆమె.... ఇంట్లో ఉన్న 30 తులాల బంగారం, రూ.20 వేల నగదు బ్యాగ్‌లో పెట్టుకుని ఆటోలో చౌటుప్పల్‌కు బయలుదేరింది. అయితే హయత్‌నగర్ వచ్చేసరికి నగలు, నగదు ఉన్న బ్యాగ్ మాయమైంది. దీంతో బాధితురాలు హయత్‌నగర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నారు. -
రూ.5 లక్షల నగదు ఆటోలో మరిచిన రియల్టర్
గుంటూరు : రూ. 5 లక్షల నగదు సంచిని ఆటోలో మర్చిపోయాడు సుబ్బారావు అనే రియల్టర్. ఆ విషయాన్ని గమనించిన ఆటో డ్రైవర్ సదరు నగదు సంచితో ఉడాయించాడు. ఆటోలో నగదు మరిచిపోయిన సంగతి గుర్తుకు వచ్చిన సుబ్బారావు వెంటనే మరో వాహనంలో ఆటో కోసం గాలించాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన గుంటూరు నగరంలో బుధవారం చోటు చేసుకుంది. సుబ్బారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా నగరంలోని వివిధ కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. -
అలా వచ్చి క్యాష్ బ్యాగ్‌తో ఉడాయించారు
విజయవాడ: విజయవాడ వన్‌టౌన్‌లో సోమవారం దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ఎస్బీహెచ్ నుంచి 50 వేల రూపాయలు డ్రా చేసుకుని వెళ్తున్నాడో వృద్ధుడు. అది గమనించిన దొంగలు వృద్ధుడిని అనుసరించారు. బైక్‌పై వచ్చిన దొంగలిద్దరూ ఆ వృద్ధుడి నుంచి డబ్బుల బ్యాగ్ ను అపహరించారు. చేతులోని బ్యాగ్‌లో ఉన్న సొమ్ము కాస్తా దొంగల పాలు కావడంతో లబోదిబోమన్నాడు. దగ్గరోలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. బైక్‌పై వచ్చిన ఇద్దరు తన బ్యాగ్ ఎత్తుకెళ్లిపోయారంటూ వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.