
మాస్కో: సంక్షోభ అఫ్గాన్ నుంచి సంచులకొద్దీ సొమ్ముతో అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ పారిపోయారని తెలుస్తోంది. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్.. నగదుతో నిండిపోయిందని రష్యా అధికార వార్తా వెల్లడించింది. అఫ్గాన్ రాజధాని కాబూల్‌లో ఉన్న రష్యా రాయబార కార్యాలయం అందించిన వివరాలను రష్యా అధికారిక వార్త సంస్థ టాస్ (టీఏఎస్‌ఎస్) సోమవారం బయటపెట్టింది. ఘనీ కోసం భారీస్థాయిలో డబ్బుల కట్టలను కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించారు. మొత్తం నగదుతో నింపిన నాలుగు కార్లను ఎయిర్‌పోర్టు రన్‌వే మీదకు తెచ్చారు. కార్లలో ఉన్న నగదుతోపాటు విడిగా మరో క్యాష్ బ్యాగ్‌ను అక్కడికి తీసుకొచ్చారు. వీలైనంత ఎక్కువ నగదు కట్టలను హెలికాప్టర్‌లోకి ఎక్కించారు. సరిపడా ఖాళీ లేకపోవడంతో, చేసేదేమీలేక కొంత నగదును రన్‌వే మీదనే వదిలేసి అధ్యక్షుడు ఘనీ అఫ్గాన్‌ను వదిలి విదేశం వెళ్లిపోయారని ‘టాస్’ వెల్లడించింది. ఘనీతోపాటు చాలా నగదు దేశం దాటి పోయిందని రష్యా దౌత్య మిషన్ అధికార ప్రతినిధి నికిత ఇషెంకో చెప్పారు.