మన్య సీమలో కులాల మాయాజాలం | caste [olitics in manyam | Sakshi
Sakshi News home page

మన్య సీమలో కులాల మాయాజాలం

Published Tue, Aug 9 2016 12:21 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

మన్య సీమలో కులాల మాయాజాలం - Sakshi

మన్య సీమలో కులాల మాయాజాలం

 
మన్యసీమలో గిరిజనుల ప్రయోజనాలను తాము దక్కించుకునేవిధంగా తెలుగు తమ్ముళ్లు తమ కుటుంబ సభ్యుల కుల ధ్రువపత్రాలను అడ్డగోలుగా మార్చేస్తున్నారు. దీనికి మోకాలడ్డుతున్న అధికారులను అధికార మదంతో సాగనంపేందుకు సైతం వెనుకాడటం లేదు. ఇటువంటి తప్పుడు వ్యవహారాలను అడ్డుకుంటూ.. నిక్కచ్చిగా పని 
చేసే అధికారులకు భరోసా కల్పించాల్సిన ఉన్నతాధికారులు.. 
మంత్రుల సిఫారసులకే తలొగ్గుతున్నారు.
తల్లిదండ్రులు బీసీ.. కుమారులు ఎస్టీ సర్టిఫికెట్‌ కోసం 
‘తెలుగు తమ్ముళ్ల’ ఒత్తిళ్లు అడ్డగోలు యత్నాలకు 
తహసీల్దార్‌ అడ్డుకట్ట
సెలవుపై పంపేందుకు యత్నాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక నాయకుడి కుటుంబ సభ్యుల కులధ్రువీకరణ మార్పు వ్యవహారం ఏజెన్సీలో హాట్‌టాపిక్‌గా మారింది. ‘సాక్షి’ పరిశీలనలో ఇందుకు సంబంధించి పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఏజెన్సీ గంగవరం మండలం మొల్లేరుకు చెందిన పాము అర్జున్‌ టీడీపీ మండలాధ్యక్షుడు. అతడి భార్య పాము సూర్యాకాంతం. బీసీలకు రిజర్వ్‌ అయిన ఏజెన్సీ గంగవరం జెడ్పీటీసీ స్థానం నుంచి 2014లో ఆమె
 
పోటీ చేశారు. తూర్పు కాపు (బీసీ–డి) కులానికి చెందిన సూర్యాకాంతం.. వైఎస్సార్‌ సీపీ బీసీ అభ్యర్థిlకొటెకలపూడి రామతులసిపై విజయం సాధించారు. అంతకుముందు 2006లో మండల పరిషత్‌ కో ఆప్షన్‌ సభ్యుడిగా అర్జున్‌ ఎన్నికయ్యారు. అర్జున్, సూర్యాకాంతం దంపతుల కుమారులు భూపతిపాలెం స్కూల్‌లో ఎస్టీలుగా చదువుకుంటున్నారు. వారి కులంపై అనుమానం వచ్చిన మొల్లేరు ఉప సర్పంచ్‌ పంచదార్ల మరిడియ్య సమాచార హక్కు చట్టం ద్వారా ఎంపీడీఓకు దరఖాస్తు చేశారు. దీనికి గంగవరం ఎంపీడీఓ కార్యాలయ పర్యవేక్షకుడు కె.రంగ డిసెంబరు 18న బదులిచ్చారు. కో ఆప్షన్‌ సభ్యుడిగా దరఖాస్తు చేసేటప్పుడు అర్జున్‌ తన కులం తూర్పుకాపు (బీసీ–డి) అని ధ్రువపత్రం ఇచ్చారని, ఆర్‌సీ నంబర్‌ ఎ/01/2015 ద్వారా అర్జున్‌ కులం బీసీ–డి అని పేర్కొన్నారు. వీటన్నింటి నేపథ్యంలో భార్యాభర్తలిద్దరూ తూర్పుకాపు (బీసీ–డి) అని నిర్ధారణ అయింది.
మారిపోయిన కుమారుల కులం
ఇదిలా ఉండగా అర్జున్, సూర్యాకాంతం దంపతులకు ఇద్దరు కుమారులు. వారి పెద్ద కుమారుడు పాము శివ విజయ్‌ కొండకాపు (ఎస్టీ) రిజర్వేష¯Œæతో గోకవరం మండలం భూపతిపాలెం డీఎస్‌ రాజు ఏపీ రెసిడెన్షియల్‌ బాలుర పాఠశాలలో చదువుకోవడం విచిత్రం. అతడు గత విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేశాడు. అతడి తమ్ముడు పాము నాగ చంద్రకిశోర్‌ ప్రస్తుతం అదే స్కూల్‌లో ఎస్టీ రిజర్వేష¯Œæతో పదో తరగతి చదువుతున్నాడు. ఇతడు 2010లో గోకవరం మండలం మల్లవరం శ్రీ మెహర్‌ విద్యాసదన్‌ పబ్లిక్‌ స్కూల్‌లో నాలుగో తరగతి చదువుకున్నాడు. ఆ స్కూల్‌ సర్టిఫికెట్‌లో అతడి కులం తూర్పుకాపు(బీసీ–డి)గానే ఉంది. ఇతడి తండ్రి అర్జున్‌ మెహర్‌ విద్యాసదన్‌ హెడ్‌మాస్టర్‌కు 2011 ఏప్రిల్‌ 19న ఒక లేఖ రాశారు. దాని ప్రకారం, తమ కుమార్డు నాగచంద్రకిశోర్‌ను  మెహర్‌ విద్యా సదన్‌లో చేర్పించినప్పుడు తూర్పు కాపు(బీసీ–డి)గా నమోదు చేయించామని, ప్రస్తుతం తమ కులం కొండకాపు(ఎస్టీ)గా మారిందని, స్కూల్‌ రిజిస్టర్‌లో ఆ మేరకు మార్పు చేసి ఇప్పించాలని కోరారు. రెవెన్యూ అధికారి ఎంఏ బేగ్‌ 2007లో అందజేసిన ఎస్టీ కులధ్రువీకరణ పత్రాన్ని జత చేస్తున్నట్టు పేర్కొన్నారు.
కులం మార్చనన్న అధికారి మార్పునకు యత్నాలు
గతంలో మేన్యువల్‌గా ఇచ్చిన ఎస్టీ కుల ధ్రువపత్రాల్లో మెజార్టీవి బోగస్‌గా ఉన్నాయనే ఉద్ధేశంతో ప్రస్తుతం మీసేవ సర్టిఫికెట్‌లనే అనుమతిస్తున్నారు. ఉద్యోగం, ఉన్నత చదువులు.. ఇలా దేనికైనా ఆన్‌లైన్‌లో అందజేసిన సర్టిఫికెట్‌నే ఆమోదిస్తున్నారు. 2007లో పొందిన సర్టిఫికెట్‌ మేన్యువల్‌ది కావడంతో, దానిని తిరిగి ఇచ్చేసి మీ–సేవలో కంప్యూటరైజ్డ్‌ సర్టిఫికెట్‌ పొందాలని అర్జున్‌ భావించారు. ఈ మేరకు గంగవరం  తహసీల్దార్‌ పినిపే సత్యనారాయణకు ఇటీవల దరఖాస్తు చేసుకోగా ఆయన తిరస్కరించారని తెలుస్తోంది. 2007లో ఇచ్చిన ఎస్టీ కుల ధ్రువపత్రం ఆధారాలు రికార్డుల్లో లేకపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. గతంలో ఇటువంటి బోగస్‌ సర్టిఫికెట్లను రిటైరయ్యాక కూడా తహసీల్దార్లు రౌండ్‌సీల్‌ వేసి వెనుకటి తేదీతో సంతకాలు చేసి ఇచ్చినవెన్నో ఉన్నాయని గిరిజన సంఘాల ప్రతినిధులు అంటున్నారు. ఒక్క గంగవరం మండలంలోనే ఇటువంటివి 20 వరకూ ఉన్నాయని చెబుతున్నారు. ఈ బోగస్‌ సర్టిఫికెట్‌ల కారణంగా>నే ఆన్‌లైన్‌లో మీ సేవ ద్వారా వచ్చిన కులధ్రువ పత్రాలనే అనుమతిస్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే ప్రస్తుత తహసీల్దార్‌ ఎస్టీ సర్టిఫికెట్‌ తిరస్కరించారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సదరు టీడీపీ నేత ఒక మంత్రి ద్వారా జిల్లా అధికారులపై ఒత్తిడి తెచ్చి, ఎస్టీ కులధ్రువపత్రం కోసం పట్టుబడుతున్నారని తెలియవచ్చింది. ఇందుకు ససేమిరా అంటున్న తహసీల్దార్‌ను సెలవు పెట్టి వెళ్లిపోవాలని రెండు రోజుల క్రితం జిల్లా ఉన్నతాధికారుల నుంచి వర్తమానం వెళ్లింది. నిబంధనలకు విరుద్ధంగా మంత్రి, టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చినంత మాత్రాన ఒక దళిత తహసీల్దార్‌ను లేనిపోని సాకులతో సాగనంపేందుకు ప్రయత్నిస్తారా అని దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement