
మంత్రి ఎస్కార్ట్‌ను పరేశాన్ చేసిన పిల్లి!
కరీంనగర్: ఎవరైనా బాగా అల్లరిచేస్తే పిల్లిని పక్కన పెట్టుకున్నట్లుందంటారు! అచ్చం అలాంటి పరిస్థితే ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఎస్కార్ట్‌లో ఎదురయింది. హరితహారంపై కరీంనగర్ కలెక్టరేట్‌లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అటవీశాఖ మంత్రి జోగు రామన్న, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరీంనగర్ జెడ్పీ చైర్మన్ తుల ఉమ రాగా ఆమె వాహనంలో ప్రవేశించిన పిల్లి అందరినీ పరేషాన్ చేసింది.
కలెక్టరేట్‌లో పార్కు చేసిన వాహనం నుంచి బయటికి వచ్చిన పిల్లి జనాన్ని చూసి వెంటనే మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వాహనంలోకి దూరింది. పిల్లి కోసం డ్రైవర్ వెతకడంతో అందులో నుంచి దూకి పక్కనే ఉన్న మంత్రి ఈటల రాజేందర్ ఎస్కార్ట్ వాహనం బాయ్‌నెట్‌లోకి దూరింది. దీంతో ఎస్కార్ట్ సిబ్బందితోపాటు మంత్రి గన్‌మెన్‌లు దాన్ని పట్టుకోవటానికి నానా హైరానా పడ్డారు. చుట్టూ ఉన్న జనాన్ని చూసి ఇంజన్ బాయ్‌నెట్‌లో ఇరుక్కుని ఉన్న పిల్లి ఎంతకూ బయటికి రాలేదు. దీంతోతో ఎస్కార్ట్ వాహనాన్ని కలెక్టరేట్‌లోని చెట్లవైపు తీసుకెళ్లి పార్కింగ్ చేసి అటువైపు ఎవరూ వెళ్లకుండా చూడడంతో పిల్లి మెల్లిగా బయటపడి చెట్లపొదల్లోకి పారిపోయింది.