అవినీతి భాండాగారంపై సీబీ‘ఐ’
-
కేంద్రీయ భాండార్‌పై మెరుపు దాడి
-
రికార్డుల పరిశీలన.. అధికారులపై ప్రశ్నల వర్షం
-
సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలోనూ తనిఖీలు
-
తప్పుడు బిల్లులు.. దిద్దుబాట్ల నిలదీత
-
సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలిన అధికారులు
-
సాక్షి కథనం ఆధారంగా విచారణ
కేంద్రీయ భాండార్‌లో జరుగుతున్న అవినీతి బాగోతాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దృష్టి సారించింది. కేజీబీవీలకు సరుకులు సరఫరా చేసే ఈ భాండార్‌లో తప్పుడు బిల్లులు, దిద్దుబాట్లు.. వంటి మాయాజాలాలను ‘సాక్షి’ వారం క్రితమే బట్టబయలు చేసిన నేపథ్యంలో.. ఆ కథనం ఆధారంగా సీబీఐ భాండార్‌పై మెరుపుదాడి చేసింది. సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలోనూ సోదాలు చేసింది. ప్రశ్నల వర్షంతో అధికారులను ఉక్కిరిబిక్కిరి చేసింది. వాటికి సమాధానాలు చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారు.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం
కేంద్రీయ భాండార్ కార్యాలయంపై సీబీఐ అధికారులు బుధవారం మెరుపుదాడి చేశారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)లçకు సరుకులు సరఫరా చేసే భాండార్ అవకతవకలపై ‘అవినీతి భాండాగారం’ శీర్షికన గత నెల 27వ తేదీన ‘సాక్షి’ దినపత్రికలో కథనం ప్రచురితమైంది. పక్కా ఆధారాలతో ప్రచురించిన ఈ కథనంపై సీబీఐ అధికారులు స్పందించారు. నగరంలోని నీలమ్మ వేపచెట్టు సమీపంలో ఉన్న కేంద్రీయ భాండార్ కార్యాలయంలో బుధవారం సోదాలు చేపట్టారు. రికార్డులు, బిల్లులును తనిఖీ చేశారు. సాక్షి కథనంలో పేర్కొన్నట్టు.. బిల్లుల్లో తేడా ఎందుకొచ్చిందని అక్కడి అధికారులను ప్రశ్నించారు. బిల్లు నెంబర్లలో మాయాజాలంతో పాటు బిల్లుల్లో కొట్టివేతలు, దిద్దుబాట్లపై సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. పొరపాటున(బై మిస్టేక్) అలా జరిగిందని భాండార్ వర్గాలు వివరణ ఇవ్వబోగా వారు అసహనం వ్యక్తం చేశారు. బిల్లుల్లో అన్ని కరెక్షన్లు ఎందుకున్నాయని నిలదీశారు. దీంతో సరైన సమాధానం చెప్పలేక భాండార్ అధికారులు నీళ్లు నమిలారు. అనంతరం సీబీఐ అధికారులు నేరుగా సర్వశిక్ష అభియాన్(ఎస్‌ఎస్‌ఎ) కార్యాలయానికి వెళ్లారు. కేంద్రీయ భాండార్ సరఫరా చేస్తున్న సరుకుల వివరాలు, వాటికి సంబంధించిన బిల్లులు, రికార్డులను పరిశీలించారు. సాక్షి కథనంలో ప్రస్తావించిన బిల్లుల గురించి ఎస్‌ఎస్‌ఏ ప్రాజెక్టు అధికారి శివరామ్‌ప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆ వ్యవహారమంతా ఆడిట్ డిపార్ట్‌మెంట్ వాళ్లు చూస్తారని శివరామ్‌ప్రసాద్ చెప్పడంతో తేదీల్లో తేడా ఎందుకొచ్చిందని ఫైనాన్స్ అండ్ ఆడిటింగ్ అధికారి (ఎఫ్‌ఏఓ) నీలకంఠేశ్వర్రావును ప్రశ్నించారు.
అలాగే ‘సాక్షి’ కథనంలో పేర్కొన్న ఆనందపురం కేజీబీవీకి సంబంధించిన బిల్లుపై సూటిగా ప్రశ్నించారు. అక్కడి స్పెషల్ ఆఫీసర్‌ను పిలిపించాలని సీబీఐ అధికారులు ఎఫ్‌ఏవోను ఆదేశించారు. అయితే యాదృచ్ఛికంగా బుధవారం ఓ సమావేశానికి వచ్చిన ఆనందపురం ఎస్‌వో అక్కడే ఉండటంతో ఆ బిల్లుపై ఆమె వివరణ ఇచ్చారు. కొన్ని సరుకులు మిగిలిపోయిన సందర్భాల్లో వాటిని తిరిగి డీలర్లకే ఇచ్చేసి.. వాటికి బదులు అవసరమైన ఇతర సరుకులు తీసుకుంటామని ఆమె చెప్పుకొచ్చారు. అటువంటి సందర్భాల్లోనే బిల్లుల్లో కొట్టివేతలు చోటుచేసుకున్నాయని వివరించారు. దీనికి సీబీఐ అధికారులు స్పందిస్తూ దిద్దుబాటు బిల్లులను ఆడిటింగ్‌కు ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. మొత్తంగా సీబీఐ అధికారుల విచారణ అటు కేంద్రీయ భాండార్, ఇటు సర్వశిక్ష అభియాన్ వర్గాల్లో కలకలం రేపింది.