సంబరం.. ఆవిరి!
Published Sat, Dec 24 2016 11:42 PM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM
పండుగలకు పెద్ద సమస్య!
- క్రిస్మస్ పర్వదినంపై ప్రభావం
- త్వరలో నూతన సంవత్సరం, సంక్రాంతి
- జిల్లాకు రూ.750 కోట్లు అత్యవసరం
- ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలకు తిప్పలే..
- వేతనాలు పూర్తిగా నగదు రూపంలోనే ఇవ్వాలని డిమాండ్
కర్నూలు(అగ్రికల్చర్): క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పర్వదినాలు.. రానున్నది పండుగల సీజన్. ఈ నేపథ్యంలో నగదు కొరత అన్ని వర్గాల ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. బ్యాంకుల్లో డబ్బులు లేవు.. ఉద్యోగులు, రైతులు, సామాన్యులు ఎవ్వరి వద్దా డబ్బుల్లేని పరిస్థితి. కరెన్సీ కొరతతో అప్పులు సైతం పుట్టడం కష్టమయింది. గత ఏడాదితో పోలిస్తే క్రిస్మస్ వ్యాపారం 50శాతం పైగా పడిపోయినట్లు స్పష్టం అవుతోంది. రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసి నేటికి 47 రోజులు దాటింది. ఇప్పటి వరకు డిపాజిట్ల రూపంలో రద్దయిన నోట్లు బ్యాంకులకు రూ.8,500 కోట్లు వరకు వచ్చినట్లు తెలుస్తోంది. ఉన్న కరెన్సీలో 80శాతం బ్యాంకులకు వెళ్లడంతో మార్కెట్‌లో కొరత తీవ్రమైంది. నోట్ల రద్దు నుంచి ఇప్పటి వరకు ఆర్‌బీఐ నుంచి రూ.1000 కోట్లు కూడా జిల్లాకు చేరకపోవడంతో మార్కెట్‌లో మనీ సర్క్యులేషన్ పూర్తిగా పడిపోయింది. క్రిస్మస్ పర్వదినాన్ని ఏదో విధంగా జరుపుకుంటున్నా నూతన సంవత్సరం, సంక్రాంతి పర్వదినం ముంచుకొస్తుండటంతో నగదు కొరత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. డిసెంబర్ నెల వేతనాలు ఉద్యోగులకు జనవరి 1న బ్యాంకు ఖాతాల్లో పడుతున్నా చేతికి రావడం కష్టం కావడం ఆందోళన కలిగిస్తోంది.
నవంబర్ నెల జీతమే తీసుకోలేదు..
నవంబర్ నెల జీతం డిసెంబర్ 1న బ్యాంకు ఖాతాల్లో జమ అయింది. కానీ నగదు కొరత కారణంగా ఇప్పటికీ జీతంలో ఒక్క రూపాయీ తీసుకోని ఉద్యోగులు జిల్లా వ్యాప్తంగా 2500 మంది వరకు ఉన్నారు. తీసుకున్న వారు కూడా రూ.20వేల వరకు మాత్రమే అందుకున్నారు. డిసెంబర్ నెల ఏదో విధంగా గట్టెక్కినా జనవరి నెలను తలుచుకుంటేనే గుండె దడ మొదలవుతోంది. ఈ నెల 25న క్రిస్మస్ పండుగ రావడం, 2017 నూతన సంవత్సరం, సంక్రాంతి వస్తుండటంతో అందరి దృష్టి నగదు సమస్యపై ఉంది. జనవరి 1న అకౌంట్లలో జీతాలు పడితే ఏం లాభం.. తీసుకోవడానికి బ్యాంకుల్లోను, ఏటీఎంల్లోనూ డబ్బులు ఉండాలి కదా అని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగదు కొరత జనవరిలో ఉద్యోగులకే కాదు.. అన్ని వర్గాలకు పెనుభారం కానుంది. రూ.500, రూ.1000 నోట్లు రద్దయి 47 రోజులయినా బ్యాంకుల్లో నో క్యాష్, నో విత్ డ్రాయల్ బోర్డులు సర్వసాధారణం కావడం గమనార్హం.
ఉద్యోగుల జీతాలకే దాదాపు రూ.264 కోట్లు అవసరం
జిల్లా ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు 55వేల మంది, పెన్షనర్లు 30వేల మంది, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు 10వేల మంది ఉన్నారు. వరుస పండుగలతో వీరందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎన్టీఆర్ భరోసా పింఛన్లను డిసెంబర్ నెలలో బ్యాంకు ఖాతాలకు జమ చేయడం వల్ల వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారడంతో జనవరి నెల పింఛన్లను నగదు రూపంలోనే పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఉద్యోగుల వేతనాలకు కనీసం రూ.264 కోట్లు అవసరం. పింఛన్లు పంపిణీ చేయడానికి దాదాపు రూ.40 కోట్లు అవసరం అవుతున్నాయి. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల కారణంగా నగదు అవససం పెరిగింది. పప్పులు పెట్టినట్లు జీతాలను రూ.5వేలు, రూ.10వేలు, రూ.15వేల ప్రకారం పంపిణీ చేస్తే తీసుకునేందుకు సిద్ధంగా లేరు. ఆర్‌బీఐ నుంచి కరెన్సీ కనీసం రూ.750 కోట్లు వస్తే తప్ప పరిస్థితి గట్టెక్కేదనేది సుస్పష్టం.
ఆన్‌లైన్ లావాదేవీలపై అవగాహన నిల్
నగదు కొరతను అధిగమించేందుకు నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని ప్రభుత్వం చెబుతోంది. జిల్లా స్థాయిలో కలెక్టర్ నగదు రహిత లావాదేవీల నిర్వహణపైనే నెల రోజులుగా దృష్టి సారించారు. అన్ని వర్గాల వారికి శిక్షణనిచ్చారు. కానీ ఇప్పటి వరకు నగదు రహిత లావాదేవీలు 10 శాతం కూడా లేవు. ఇది పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులతో సహా 80 శాతం మందికి ఆన్‌లైన్ లావాదేవీలపై అవగాహన కరువైంది. అవగాహన లేకుండా ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహిస్తే నష్టపోయే ప్రమాదం కూడా ఉండటంతో ఇప్పటికిప్పుడు నగదు రహిత లావాదేవీలకు ఉద్యోగలు సైతం సిద్ధంగా లేరు.
Advertisement
Advertisement