..హా! | chai chamak full length story | Sakshi
Sakshi News home page

..హా!

Published Sat, Aug 19 2017 10:02 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

..హా! - Sakshi

..హా!

తేనీరు.. జీవితంలో ఓ భాగం
- జిల్లాలో పెరిగిన కేఫ్‌ సంస్కృతి
- రకరకాల రుచులతో ఆహ్వానం
- కోట్ల రూపాయలతో ముడిపడిన వ్యాపారం
- పెట్టుబడి తక్కువ.. లాభాలు ఎక్కువ
- టీ, కాఫీలు లేనిదే మనిషి మాట వినని మనసు
- స్నేహితులు కలిస్తే ఇదే పార్టీ


ఉరుకులు పరుకుల జీవితం. అడుగడుగునా అడ్డంకులు.. అవాంతరాలు. ఈ రోజు గడిచిందనుకుంటే.. రేపు మరో గండం ఉండనే ఉంటుంది. పోటీ ప్రపంచంలో ప్రతి విషయంలోనూ పరుగెత్తక తప్పని పరిస్థితి. పాఠశాలకు వెళ్లడం మొదలు.. ర్యాంకుల వేట.. ఉన్నత విద్య.. కోరుకున్న కొలువు.. జీవితంలో స్థిరపడటం.. కుటుంబం.. పిల్లలు.. ఇలా ఒత్తిడి దైనందిన జీవితంలో భాగమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే.. జీవితమే ఓ చదరంగం. ఇలాంటి ఉక్కిరిబిక్కిరి పరిస్థితుల్లో మనసు కాస్త ఊరట కోరుకోవడం సహజం. అదెలా అంటే.. ప్రతి ఒక్కరికీ ఠక్కున గుర్తుకొచ్చేది టీ. ఉదయం లేవగానే.. మంచం దిగకుండానే.. గొంతులో కప్పు కాఫీ దిగనిదే శరీరం స్వాధీనంలోకి రాదంటే అతిశయోక్తి కాదు. కార్యం ఏదయినా.. కారణం ఎవరైనా.. కాలంతో పని లేకుండా టీ తాగనిదే మనసు మనిషి మాట వినదు. నలుగురు కలిస్తే చాలు.. నాలుక కోరుకునే రుచి ఇదే. ఒక్క టీ రూ.5 అన్న మాటే కానీ.. మొత్తంగా లెక్కేస్తే ఇది కోట్ల రూపాయలతో ముడిపడిన వ్యాపారం. టీ, కాఫీలతో పాటు లెక్కకు మించిన రకాలు.. రుచులతో ఈ తేనీరు ఆహా అనిపిస్తోంది.

తేనీరు కహానీ
మొత్తం దుకాణాలు :
ఒక్క రోజు వ్యాపారం :
రకాలు :
ధరలు : రూ.5 నుంచి రూ.100పైనే


చాయ్‌ చమక్‌!
– రిలీఫ్‌కు కేరాఫ్‌గా మారుతున్న టీకేఫ్‌లు
– రోజురోజుకూ పెరుగుతున్న కేఫ్‌ల సంస్కృతి
– జిల్లా వ్యాప్తంగా రోజూ రూ. కోటి దాటుతున్న టీ వ్యాపారం


అనంతపురం: తేనీరు.. చాయ్‌.. టీ.. నేటి యాంత్రిక ప్రపంచంలో ఒత్తిళ్ల నుంచి కాస్త రిలీఫ్‌ పొందాలంటే ఈ పదార్థం తప్పనిసరిగా మారింది. ఆవేశంగా ఘర్షణ పడుతున్న ఇద్దరి మధ్య ఓ కప్పు టీ ఉంచితే.. కొద్ది సేపటిలోనే ఘర్షణ వాతావరణం సమసిపోతోంది. నిరంతర చదువులతో అలసిన మెదళ్లుకు ఓ కప్పు మంచి చాయ్‌ అందిస్తే... కాసేపు తర్వాత రెట్టించిన ఉత్సాహంతో పాఠ్యపుస్తకాలను తిరగేయడానికి దోహదపడుతోంది. మంచికైనా.. చెడుకైనా.. సందర్భం ఏదైనా.. తేనీరు తప్పనిసరిగా మారింది. అదే చాయ్‌లోని చమక్‌! ఈ విషయాన్ని గుర్తించిన పలువురు టీ స్టాళ్లు.. కేఫ్‌లు ఏర్పాటు చేసి జోరుగా వ్యాపారం సాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఒక్క రోజుకు వివిధ కేంద్రాల ద్వారా రూ. కోటికిపైగా టీ వ్యాపారం సాగుతోందంటే చాయ్‌లోని చమక్‌ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

ఒకప్పుడు ఆలయాలు, మసీదులు, పార్కుల్లో కూర్చుని యోగక్షేమాలు, కుటుంబ సమస్యలు చర్చించుకుంటూ ప్రజలు గడిపేవారు. రానురానూ పరిస్థితుల్లో మార్పులు  చోటు చేసుకున్నాయి. నలుగురు కలిస్తే చాలు ఓ హోటల్‌కెళ్లి కాఫీ, టీ తాగి వచ్చే వరకు తనవి తీరదు.  కాలానుగుణంగా ట్రెండ్‌లో కూడా మార్పు వచ్చింది. ఈ క్రమంలోనే ‘కేఫ్‌ కల్చర్‌’ అనంతను తాకింది. ఇప్పటిదాకా  పెద్ద నగరాల్లో మాత్రమే ఉండే ఛాయ్‌ కేఫ్‌లు నేడు జిల్లాలోనూ విస్తరించాయి. అయితే మిగిలిన ప్రాంతాల కంటే  ‘అనంత’ టీకేఫ్‌లు ప్రత్యేకతను చాటుకుంటున్నాయి.

సువిశాల మైదానంలో..
జిల్లాలో టీ కేఫ్‌లు సువిశాల మైదానంలో ఏర్పాటు చేస్తున్నారు. నీడ కోసం పైభాగాన రేకుల కప్పు వేస్తున్నారు. తక్కినదంతా ఓపెన్‌ప్లేస్‌గా ఉంటుంది. దీనికి తోడు కేఫ్‌లు చాలా వరకూ నగర నడిబొడ్డున ఉండడంతో ఎంత సేపు కూర్చొన్నా అడ్డు చెప్పే వారు ఉండరు. అంతేకాక వైఫై సదుపాయం కూడా అందుబాటులో ఉంచడంతో చాలా మంది కేఫ్‌లలో గడపడంపై  ఆసక్తి చూపుతున్నారు. మరీ ముఖ్యంగా బైకులు పెట్టుకునేందుకు కూడా పార్కింగ్‌ సదుపాయం ఉండడంతో విద్యార్థులు, యువతకు కేరాఫ్‌గా కేఫ్‌లు మారుతున్నాయి. ఈ కేఫ్‌లో ఉన్నంత సేపు ఎవరి లోకం వారిదే. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ రాజకీయాలు మాట్లాడుకుంటారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు, డబ్బు లావాదేవీలు, జీవనోపాధుల గురించి, చర్చ, విద్యాసమాచారం అందిపుచ్చుకోవడం. ఉద్యోగావకాశాలపై చర్చ... ఇలా ఎంత సేపు గడిచిందో కూడా తెలియని స్థితిలో యువతతో పాటు ఉద్యోగ, వ్యాపారులు కేఫ్‌లో గడిపేస్తుంటారు. మరికొందరు స్మార్ట్‌ఫోన్‌లలో ప్రపంచాన్ని చుట్టి వచ్చేస్తారు.

‘అనంత’లోనే 80కు పైగా కేఫ్‌లు
అనంతపురం నగరంలో 2008లో నాలుగైదు కేఫ్‌లతో ప్రారంభమైన ఈ సంస్కృతి నేడు 80కి పైగా చేరుకుంది. మొన్నటిదాకా నగరానికే పరిమితమైన ఈ కేఫ్‌లు ఇప్పుడు  తాడిపత్రి, గుంతకల్లు, పామిడి, ధర్మవరం తదితర ప్రాంతాలకూ పాకాయి. జిల్లా వ్యాప్తంగా 150కుపైగా కేఫ్‌లు ఉంటాయని అంచనా.  కేవలం టీ, కాఫీ తయారీకి మాత్రమే చిన్నగదిలా ఉంటూ తక్కిన స్థలమంతా ఖాళీగా ఉంటుంది.  అందులో వందలాది చైర్లు వేసి ఉంటారు.

రోజూ రూ.కోటికి పైగా టీ వ్యాపారం
జిల్లా వ్యాప్తంగా  టీ కేఫ్‌లలోనే రోజుకు సగటున రూ. 40 లక్షల వరకూ టీ వ్యాపారం సాగుతోంది. ఇక హోటళ్లు, టీస్టాళ్లను కలుపుకుంటే రోజుకు రూ. కోటికి పైగా టీ వ్యాపారం సాగుతున్నట్లు సమాచారం. రోజూ 20 లీటర్లు మొదలుకుని 60 లీటర్ల దాకా పాలు ఖర్చయ్యే కేఫ్‌లు కూడా జిల్లాలో ఉన్నాయి.

ఖాళీ స్థలాలకు భద్రత
టీకేఫ్‌ల ఏర్పాటుకు ఖాళీ స్థలం తప్ప గదులు ఏమాత్రం అవసరం లేదు. నిర్మాణ ఖర్చు ఎక్కువ కాదు. అంతేకాక రాబడితో పాటు ఖాళీ స్థలాలకు భద్రత కూడా ఉండడంతో చాలా మంది టీకేఫ్‌ల ఏర్పాటుకు తమ స్థలాలను బాడుగకు ఇస్తున్నారు. ఒక్కో కేఫ్‌ యజమాని నెలకు రూ. 10 వేలు నుంచి రూ. 30 వేల వరకు అద్దె చెల్లిస్తున్నారు.

సీసీ కెమరాల నిఘా
కొన్ని కేఫ్‌లు అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారాయి. పోలీసుల విచారణలో ఈ విషయం వెలుగు చూసింది. దీంతో పోలీస్‌ ఉన్నతాధికారులు టీకేఫ్‌ నిర్వాహకులపై నిఘా పెంచారు. ఈ క్రమంలోనే ప్రతి కేఫ్‌లోనూ సీసీ కెమరాలు అమర్చాలని నిర్ధిష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో చాలా కేఫ్‌ల్లో సీసీ కెమరాలు ఏర్పాటు చేశారు. వీటివల్ల మంచి ఫలితాలున్నాయని, గొడవలు, ఇతర ఇబ్బందులు లేకుండా పోయాయని కేఫ్‌ల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.

ఆరోగ్యాన్ని మేలు చేకూర్చే చాయ్‌
కేవలం టీ, కాఫీ, బూస్ట్‌లకే పరిమితం కాకుండా ఆరోగ్య రక్షణలో భాగంగా వచ్చిన రాగిమాల్ట్, లెమన్‌ టీ, గ్రీన్‌టీ, అల్లం పాలు, హనీ మిల్క్‌ తదితర రకాలు ప్రస్తుతం టీ కేఫ్‌ల్లో అందుబాటులో ఉంచారు. రాగిమాల్ట్‌ ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తున్నాయి.  శరీరంలో ఉష్ణాన్ని తగ్గించడంతో పాటు బీపీ, షుగర్‌ కూడా నియంత్రణలో ఉంచుతుండడంతో రాగిమాల్ట్‌కు డిమాండ్‌ బాగానే ఉంటోంది.
 
బ్లాక్‌ టీ ప్రత్యేకం
బ్లాక్‌ టీ తాగడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుందని పరిశోధకుల అంచనా. బ్లాక్‌టీలో కేఫిన్‌ ఎక్కువగా ఉంటుంది. ఇతర టీలతో పోల్చుకుంటే ఈ టీ వాసన కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది తాగడం వల్ల గుండె సంబంధింత రుగ్మతలు తగ్గుతాయని, ఎముకల బలపడడంతో పాటు శరీరంపై ఏర్పడే మచ్చలను నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
 
అల్లం టీ
ఉదయం అల్లం టీ తాగితే ఆ రోజంతా హుషారుగా ఉంటారు. అలాగే అల్లం టీ తీసుకోవడం వల్ల ఛాతిలో మంట, అజీర్ణం వంటి సమస్యలకు చెక్‌ పెట్టినట్లు ఉంటుందని ఆరోగ్య నిఫుణులు చెబుతున్నారు. ఇందులో యాంటి యాక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉండడం వల్ల రోజూ ఒక కప్పు అల్లం టీ తీసుకుంటే జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉంటుందని పేర్కొంటున్నారు.  

గ్రీన్‌ టీ టేస్టే వేరు
రుచితో పాటు పలు రకాలుగా మెరుగైన ఆరోగ్యానికి గ్రీన్‌ టీ ఉపయోగపడుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్ధిష్టంగా ఉంచుతుంది.  గ్రీన్‌ టీ తాగడం వల్ల మెదడులో చురుకుదనం పెరుగుతుందనే వాదన కూడా ఉంది. కేన్సర్‌ కారకాలను కూడా వ్యతిరేకించే గుణం ఈ టీ ప్రత్యేకం. కీళ్ల నొప్పుల నివారణతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుందని నిపుణులు అంటున్నారు.

లెమన్‌ టీ
రోజూ లెమన్‌ టీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో జీవ క్రియలను మెరుగు పరిచేందుకు దోహదపడుతుంది. నాడీ వ్యవస్థ చురుగ్గా ఉంటుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు లెమన్‌ టీ ఒక కప్పు తాగితే తక్షణమే రిలాక్స్‌ పొందవచ్చు.

నెట్‌ ఉపయోగపడుతోంది
కేఫ్‌లో ఇంటర్నెట్‌ బాగా ఉపయోగపడుతోంది. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్‌ లాంటి వాటిని  వినియోగించుకుంటూ దూర ప్రాంతాల్లో ఉన్నæ స్నేహితులతో చాటింగ్‌ చేస్తుంటాం. దీనికితోడు స్నేహితులంతా ఇక్కడే కలుస్తుంటాం. సమకాలీన అంశాలపై చర్చించుకునేందుకు ఇది మంచి వేదికగా మారింది.
– ప్రశాంత్‌ చిరు ఉద్యోగి, అనంతపురం

వైఫై ఉపయోగించుకుంటున్నా
కేఫ్‌లో కూర్చుని టీ తాగి వైఫై ఉపయోగించుకుంటున్నాం.  కొత్త పరిచయాలు, సబ్జెక్ట్‌కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటున్నాం.
– అఫ్జల్, డిగ్రీ సెకండియర్‌ విద్యార్థి, అనంతపురం

కాసేపు సరదాగా...
నగరంలో ఎక్కడ కలవాలన్నా ఇబ్బందిగా ఉంటోంది. టీ స్టాల్స్‌లో నిలబడేందుకు కూడా అవకాశం ఉండదు. అదే కేఫ్‌లో అయితే కాసేపు ప్రశాంతంగా కూర్చొని సరదాగా మాట్లాడుకోవచ్చు.  
– అనిల్‌ విద్యార్థి, ఎస్‌వీ డిగ్రీ కళాశాల, అనంతపురం

ప్రశాంతంగా ఉంటుంది
ప్రస్తుత రోజుల్లో వర్క్‌ టెన్షన్‌ ఎక్కువగా ఉంటోంది. కాసేపు ప్రశాంతంగా గడిపేందుకు  టీ కేఫ్‌లు బాగా ఉపయోగపడుతున్నాయి. రోజూ తప్పకుండా కేఫ్‌లో ఓ అరగంటæ కూర్చుని ఓ మంచి కాఫీ తాగి వెళుతుంటాను.
– రాజు ప్రైవేట్‌ ఉద్యోగి, అనంతపురం

హడావుడి ఉండదు
హడావుడి లేకుండా కమ్మని టీ తాగడమే కాకుండా కాసేపు కూర్చొని మాట్లాడుకునే అవకాశాలు చిన్న టీ కొట్లలో దొరకదు. దీనికి తోడు పెద్ద హోటళ్లతో పోలిస్తే తక్కువ ధరకే టీకేఫ్‌ల్లో  చాయ్‌ దొరుకుతోంది.
– బాలమురళీకృష్ణ, ప్రైవేటు ఉద్యోగి

లెమన్, గ్రీన్,బ్లాక్‌ టీతో పాటు రాగిమాల్ట్‌కు డిమాండ్‌
నేను 15 ఏళ్లుగా టీమాస్టర్‌గా ఉన్నా. కొన్ని సంవత్సరాల ముందు వరకు టీ, కాఫీ, బూస్ట్, పాలు ఎక్కువగా తాగేవారు. ఇటీవల లెమన్‌ టీ, గ్రీన్‌ టీ, బ్లాక్‌ టీ, రాగిమాల్ట్‌కు గిరాకీ పెరుగుతోంది. మార్నింగ్‌ వాకర్స్‌ మొదలుకుని ఈవినింగ్‌ వాకర్స్‌ వరకు చాలా మంది వీటినే సేవిస్తున్నారు.
– రమేష్, టీ మాస్టర్‌, అనంతపురం

నెలకు రూ. 25 వేలు
ఓ ప్రైవేట్‌ కంపెనీలో మార్కెటింగ్‌ రెఫ్‌గా పని చేసేవాడిని. ఆ పని వదిలిపెట్టి టీకేఫ్‌ పెట్టాను. నాతో పాటు మరో ముగ్గురు ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. నెలకు అన్ని ఖర్చులు పోనూ రూ. 25 వేలు వరకూ మిగులుతోంది. ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రశాంతంగా గడిచిపోతోంది.
– శ్రీకాంత్, గెలాక్సీ టీకేఫ్‌, అనంతపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement