
దొరికినంతా దోచెయ్
జిల్లా కేంద్రం ఏలూరు నగరంలో చెయిన్ స్నాచింగ్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు.
► ఏలూరులో పెచ్చుమీరిన చెయిన్ స్నాచింగ్‌లు
► ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
► నిఘా పెంచామని డీఎస్పీ వెల్లడి
ఏలూరు అర్బన్: జిల్లా కేంద్రం ఏలూరు నగరంలో చెయిన్ స్నాచింగ్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. ఒంటరిగా కనిపించిన మహిళలు లక్ష్యంగా చెలరేగిపోతున్నారు. గతంలో నగరంలో చెయిన్ స్నాచింగ్ నేరాలు ఎక్కువగా జరిగిన నేపథ్యంలో వాటిని సవాలుగా తీసుకున్న పోలీసు యంత్రాంగం నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంది. నగరంలో పోలీసింగ్ పెంచడం, పాత నేరస్తుల కదలికలపై నిఘా పెంచడం, ఉదయం, సాయంత్రం వేళల్లో గస్తీ, నగర శివారులపై ప్రత్యేక దృష్టి సారించడం వంటి చర్యలతో నేరాలను కట్టడి చేశారు. అయితే కొంతకాలంగా పోలీసుల నిఘా తగ్గడంతో చెయిన్ స్నాచింగ్ నేరగాళ్లు మళ్లీ రెచ్చిపోతున్నారు.
పోలీసింగ్ పెరగాలి
మిగిలిన నేరాలతో పోల్చితే చెయిన్ స్నాచింగ్ నేరం భిన్నమైంది. ఈ నేరాల్లో కేవలం ఇద్దరు యువకులు, మోటార్ బైకు ఉంటే సరిపోతుంది. నేరాలకు పా ల్పడేందుకు వేకువజాము, సాయంత్రం చీకటి పడే సమయాలను అనుకూలంగా చేసుకుని నేరస్తులు చోరీలకు పాల్పడుతున్నారు. పథకం ప్రకారం ఒంటరి మహిళలను వెంబడించి మోటార్ సైకిళ్లపై వచ్చి చోరీలకు పాల్పడుతున్నారు. అయితే ఇటీవల జరిగిన చాలా నేరాలను కొత్త వ్యక్తులు పాల్పడటం పోలీసులకు సవాలుగా మారింది. దీంతో కేసులను ఛేదించడానికి సమయం పడుతోంది.
జాగ్రత్తలు తప్పనిసరి
చెయిన్ స్నాచింగ్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు మహిళలు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఉదయం వాకింగ్‌లు వెళ్లే మహిళలు ఒంటరిగా కాకుండా నలుగురైదుగురితో కలిసి వెళ్లాలని అంటున్నారు. ఒకవేళ ఒంటరిగా వెళ్లాల్సి వస్తే వంటిపై బంగారు ఆభరణాలు తీసివేయడం ఉత్తమమని చెబుతున్నారు.
నగరంలో నేరాలు ఇలా..
నాలుగు రోజుల కిందట ఏలూరు త్రీటౌన్ పరిధిలోని సత్రంపాడు ప్రాంతంలో అన్నపూర్ణ అనే మహిళ వేకువజామున వాకింగ్ నిమిత్తం పంచాయతీ కార్యాలయం రోడ్డులో నడిచి వెళుతుండగా వెనుక నుంచి దాడి చేసిన యువకుడు ఆమె మెడలోని నాలుగు కాసుల గొలుసు లాక్కుపోయాడు.
ఏలూరు టూటౌన్ ప్రాంతంలోని బీడీ కాలనీ సమీపంలో మహిళ ఒంటరిగా నడిచి వెళ్తూండగా యువకుడొకడు ఆమె చేతిలోని బ్యాగ్‌ను లాక్కుపోయాడు.
గతనెల 29న వన్‌టౌన్ పరిధిలోని దక్షిణపు వీధికి చెందిన మహలక్ష్మి అనే వృద్ధురాలు రాత్రి 7 గంటల సమయంలో మార్కెట్‌కి వెళ్లి వస్తుండగా హఠాత్తుగా దాడి చేసిన అగంతకుడు మెడలోని రెండున్నర కాసుల బంగారు గొలుసు తెంపుకుని కొద్దిదూరంలో ఆగి ఉన్న బైకుపై పారిపోయాడు.
మే నెలలో స్థానిక ఆర్‌ఆర్ పేట లోబ్రిడ్జి వద్ద ఓ మహిళ రాత్రి 7 గంటల సమయంలో నడుచుకుంటూ వెళ్తుండగా బైకుపై వచ్చిన అగంతకుడు మెడలోని బంగారు గొలుసు తెంపుకుపోయాడు.
ఏప్రిల్ 17న అశోక్‌నగర్‌లోని అపార్ట్‌మెంట్ వద్ద పూలు కోసుకుంటున్న మహిళ మెడలోని గొలుసును గుర్తుతెలియని వ్యక్తి లాక్కుపోయాడు.
ఏప్రిల్ 13న పత్తేబాద ప్రాంతంలో ఒంటరిగా నడిచి వెళుతున్న వృద్ధురాలును బైక్‌పై వెంబడించిన అగంతకుడు ఆమె మెడలోని గొలుసు తెంపుకుపోయాడు.
నిఘా పెంచాం
నగరంలో చెయిన్ స్నాచింగ్‌ల నిరోధానికి చర్యలు తీసుకుంటున్నాం. గతంలో అనుసరించిన విధానాల కారణంగా నేరాలను అదుపు చేయగలిగాం. చెయిన్‌లు తెంపుకుపోతున్న సంఘటనలు మళ్లీ మొదలయ్యాయి. పాత నేరస్తులను విచారించి కొత్తగా పుట్టుకొస్తున్న నేరస్తుల వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నాం. కౌన్సెలింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించాం. – గోగుల వెంకటేశ్వరరావు, ఏలూరు డీఎస్పీ