ఉస్మానియా ఆస్పత్రి, ఛాతీ వ్యాధుల వైద్యశాల, సెక్రటేరియట్ తరలింపునకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
యాచారం: ఉస్మానియా ఆస్పత్రి, ఛాతీ వ్యాధుల వైద్యశాల, సెక్రటేరియట్ తరలింపునకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడా లిస్టులో చంచల్‌గూడ జైలు కూడా చేరింది. తాజాగా చంచల్ గూడ జైలు మార్చేందుకు ప్రయత్నాలు వేగవంతం చేశారు అధికారులు. ఇందుకోసం రంగారెడ్డి యాచారం మండలం మొండిగౌరెల్లిని ఎంచుకోనున్నట్లు సమాచారం. అధికారులు నాగార్జున సాగర్- హైదరాబాద్ రహదారికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొండిగౌరెల్లి సమీపంలో ఉన్న ప్రభుత్వ అసైన్డ్ భూములను పరిశీలించారు.
చంచల్‌గూడ జైలు నగరం మధ్యన ఉండడం, వివిధ కేసుల్లో జైలుకు వచ్చే వీవీఐపీలు, తీవ్రవాదులను జైలు నుంచి కోర్టులకు తీసుకెళ్లడం భద్రత సిబ్బందికి కష్టతరంగా మారింది. ఇంతేకాకుండా ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని నగర శివారు, ఔటర్‌రింగు రోడ్డుకు అతి సమీపంలోని ప్రభుత్వ, అసైన్డ్ భూముల ఎంపికపై దృష్టి పెట్టారు. మంచాల, ఇబ్రహీంపట్నం, కందుకూర్ మండలాల్లో కూడా ప్రభుత్వ భూములను పరిశీలించినా మొండిగౌరెల్లినే ఎంపిక చేసే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు.