
అనంతపురం రండి.. రాష్ట్రపతికి బాబు ఆహ్వానం
రాష్ట్రాన్ని సంపూర్ణ కరవు రహిత ప్రాంతంగా మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన 'నీరు-ప్రగతి' కార్యక్రమాన్ని ఈ నెలాఖరున అనంతపురంలో ప్రారంభించి రాష్ట్ర రైతులకు స్పూర్తినివ్వాలని సీఎం చంద్రబాబు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంపూర్ణ కరవు రహిత ప్రాంతంగా మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన 'నీరు-ప్రగతి' కార్యక్రమాన్ని ఈ నెలాఖరున అనంతపురంలో ప్రారంభించి రాష్ట్ర రైతులకు స్పూర్తినివ్వాలని సీఎం చంద్రబాబు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరారు. ఈనెల 29 లేదా 30 తేదీలలో ఒకరోజు వీలు చూసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు రావాలని సోమవారం సాయంత్రం ఆయన ప్రణబ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు, పథకాల గురించి సీఎం రాష్ట్రపతికి వివరించారు.
రెండంకెల వృద్ధి లక్ష్యాన్ని చేరుకునేందుకు గుర్తించిన మొత్తం 42 వృద్ధి కారకాల్లో 23 ప్రాథమిక రంగంలోనే ఉన్నాయని, అందుకే సేద్యపు రంగానికి, జలవనరులకు తొలి ప్రాధాన్యం ఇచ్చామని అన్నారు. 'నీరు-చెట్టు' కార్యక్రమం పెద్దఎత్తున చేపట్టామని, ఆకాశమార్గం నుంచి మారుమూల పర్వత ప్రాంతాల్లో కూడా విత్తనాలు చల్లించామని చెప్పారు. భూగర్భజలాలు పెంచేందుకు, సాగునీటి అవసరాలు తీర్చేందుకు తాజాగా 'పంట సంజీవని' పేరుతో ఫామ్‌పాండ్స్ తవ్విస్తున్నామని తెలిపారు.
కరువుసీమ రాయలసీమను ఉద్యాన కేంద్రంగా మార్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన రాష్ట్రపతికి వివరించారు. అనంతపురం జిల్లాలో 'నీరు-చెట్టు' సబ్ మిషన్‌లో భాగంగా లక్ష పామ్ మొక్కలను నాటాలని సంకల్పించామని తెలిపారు. దేశంలో అత్యంత వర్షాభావం ఉన్న జిల్లాలలో రెండోదైన అనంతపురం జిల్లాలో భూగర్భ జలాలను 3 నుంచి 8 మీటర్లలోనే అందుబాటులో ఉండేలా ప్రయత్నిస్తున్నామన్నారు.