చంద్రబాబు ఆశీస్సులతోనే..!
‘కాల్‌మనీ’తో కోట్లకు పడగలెత్తిన టీడీపీ నేతలు
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాల్‌మనీ ముఠా ఆగడాలు శ్రుతిమించిపోయాయి. అడ్డగోలు దందాకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశీస్సులు సైతం ఉండటం వల్లే తెలుగు తమ్ముళ్ల అకృత్యాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కేసుకు సంబంధించిన కొందరు నిందితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు సీఎంతో సన్నిహితంగా మెలగడం, తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి.. ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు.
1. ముఖ్యంగా ఈ కేసులో ఏ-4గా ఉన్న ఎలక్ట్రికల్ డీఈ (టెక్నికల్) సత్యానందం భుజంపై చేయి వేసి మరీ చంద్రబాబు ఫొటో దిగడం.. సత్యానందం ఆయనకెంతో సన్నిహితుడో స్పష్టం చేస్తోంది. ఒకప్పుడు విద్యుత్ శాఖలో ఓ సాధారణ ఇంజనీర్ అయిన సత్యానందం ఇప్పుడు కోట్లకు పడగలెత్తడానికి.. ప్రభుత్వ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారులతో ఉన్న సత్సంబంధాలే కారణమని తెలుస్తోంది. తాజాగా కాల్‌మనీ కేసులో కేసు నమోదు కావడంతో సత్యానందం వ్యవహారాలు, ప్రభుత్వ పెద్దలతో ఆయనకున్న సాన్నిహిత్యంపై చర్చ సాగుతోంది.
2.ఇదిలావుంటే ఈ కేసులో ఏ-5గా ఉన్న వెనిగళ్ల శ్రీకాంత్‌తో పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సన్నిహిత సంబంధాలు కూడా తాజాగా వెలుగు చూశాయి. వీరిద్దరూ కలసి గతంలో పలుమారు విదేశాల్లో విహార యాత్రలకు వెళ్లారు. కాల్‌మనీ-సెక్స్ రాకెట్ బయటపడినప్పుడు కూడా ఇద్దరూ బ్యాంకాక్ పర్యటనలో ఉన్నారు. విషయం తెలిసిన తర్వాత శ్రీకాంత్ బ్యాంకాక్ నుంచి మా యమయ్యాడు. బోడె ప్రసాద్ రాష్ట్రానికి తిరిగి వచ్చి తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఎమ్మెల్యే ఎదురుగానే కన్పిస్తున్నా, ఏ-5 శ్రీకాంత్ తో కలసి ఆయన విహార యాత్రలకు వెళ్లినట్టుగా ఫొటోలు స్పష్టం చేస్తున్నా.. పోలీ సులు బోడె ప్ర సాద్‌ను ఇంతవరకు ప్రశ్నించలేక పోయారంటేనే ఈ కాల్‌మనీ దందాకు ప్రభుత్వ పెద్దల స్థాయిలో పూర్తి అండదండలున్నట్టు స్పష్టమవుతోంది. కనీసం శ్రీకాంత్‌తో ప్రసాద్‌కున్న సంబంధాలేమిటి, బ్యాంకాక్ నుంచి శ్రీకాంత్ ఎక్కడికి వెళ్లాడు లాం టి అంశాలపై కూడా ఆరా తీసే ప్రయత్నం చేయలేక పోయారంటే ఏ స్థాయిలో పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు ఉన్నాయో విదితమవుతోంది.
3. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ అదనపు డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు నమ్మినబంటనే ప్రచారం ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో కీలకమైన విజయవాడ నగర కమిషనర్‌గా వెంకటేశ్వరరావును చంద్రబాబు నియమించారు. తర్వాత ఓటుకు కోట్లు కేసు నేపథ్యంలో ఎంతో ప్రాధానత కలిగిన ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతిని చేశారు. ప్రస్తుతం ఈయనపై ఆరోపణలు వస్తున్నా.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక చంద్రబాబు ఆశీస్సులే కారణమన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఏ-4 సత్యానందంకు, వెంకటేశ్వరరావుకు మధ్య కూడా సత్సంబంధాలు ఉండటం ఈ సందర్భంగా గమనార్హం.
4. అధికారపార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన సమీప బంధువులు కాల్‌మనీ వ్యాపారంలో ఉన్నారు. అక్క జగదీశ్వరి, వరుసకు సోదరులైన బుద్దా నాగేశ్వరరావు, బుద్దా భాస్కరరావు, బుద్దా సత్యనారాయణలు వడ్డీ వ్యాపారం, కాల్‌మనీ వ్యాపారాలను విస్తృతంగా చేశారనేది ప్రధాన ఆరోపణ. వీరందరికీ పెట్టుబడి వెంకన్నేనన్న ఆరోపణలున్నాయి. వీరందరూ కలిసే ఉంటారు. అయినా వెంకన్న వారితో తనకెలాంటి సంబంధం లేదని చెబుతారు. అయితే టీడీపీ విజయవాడ నగర అధ్యక్షుడిగా ఉన్న వెంకన్న నారా లోకేష్ ఆశీస్సులతో ఎమ్మెల్సీ పదవి పొందారు. పదవి రాగానే లోకేష్ ఫొటోతో కూడిన వందల ఫ్లెక్సీలు నగరంలో ఏర్పాటు చేసి స్వామి భక్తి చాటుకున్నారు. ఈనెల ఐదున ఫ్లైఓవర్ శంకుస్థాపన సమయంలో వేదికపైనే సీఎం చంద్రబాబుకు వెంకన్న సాష్టాంగ నమస్కారం చేయడం చర్చనీయాంశమయ్యింది.
5. కాల్‌మనీ ముఠా వేధింపులపై రెండునెలల క్రితమే ముఖ్యమంత్రి వద్దకు వెళ్లినా తమకు న్యా యం జరగలేదని బాధితుడొకరు వాపోవడం.. కాల్‌మనీ ముఠాకు ఏ స్థాయిలో అండదండలున్నాయో స్పష్టం చేస్తోంది. ప్రభుత్వం స్పందించి అప్పుడే కనుక చర్యలు తీసుకుని ఉంటే మనీ - సెక్స్ దారుణాలకు కొంతవరకైనా అడ్డుకట్ట పడేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఇక కాల్‌మనీ కేసు దర్యాప్తును వేగవంతం చేసి పలు ప్రాంతాల్లో దాడులు చేయించడం, కేసులు నమోదు చేయించడం ద్వారా కాల్‌మనీ బాధితులకు కొంతవరకు ఊరట కల్పించిన సీపీ గౌతం సవాంగ్‌ను సెలవుపై పంపించడం కూడా.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి ప్రభు త్వ పెద్దల ఆశీస్సులు ఉండటం వ ల్లేన ని తెలుస్తోంది. అధికార పార్టీ నేతలకు అన్నివిధాలుగా సహకరిస్తున్నందునే వారు కోరినట్టుగా చంద్రబాబు.. సవాంగ్‌ను సెలవుపై పంపారని పోలీసు వర్గాలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నాయి.
6. మరోవైపు ఈ కేసునుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు, ప్రధాన కేసును నీరుగార్చే ప్రయత్నాల కు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. కాల్‌మనీ ముఠా రూ.20 వరకు వడ్డీకి అప్పులివ్వడమే తప్పు. పైగా బలవంతపు వసూళ్లకు పాల్పడటం, సభ్య సమాజం తలదించుకునేలా మహిళలపై అకృత్యాలకు పాల్పడటం, వాటిని వీడియోల్లో చిత్రీకరించి బెదిరించడం వంటి దారుణాలకు ఈ ముఠా పాల్పడింది. అలాంటి ముఠాను సాధారణ వడ్డీ వ్యాపారులతో ముడిపెట్టి వారిపై దాడులకు ముఖ్యమంత్రి ఆదేశించడం గమనార్హం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కాల్‌మనీ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై మంగళవారం దాడులు చేశామని డీజీపీ చెప్పారు. కాల్‌మనీ వ్యవహారంలో అధికార పార్టీ నేతలకు చంద్రబాబు ఆశీస్సులున్నాయనేందుకు ఇంతకంటే నిదర్శనాలేం కావాలని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.