బాబు సర్కార్ సమర్పించు..బీచ్ లవ్
వేదిక : విశాఖ తీరం
సారథ్యం : ఏపీ సర్కార్
ముఖ్య అతిథి : సీఎం చంద్రబాబు
- దేశ విదేశాల నుంచి 9 వేల జంటలకు ఆహ్వానం
- జంటల కోసం బీచ్‌లో ప్రత్యేకంగా టెంట్‌ల ఏర్పాటు
- అందాల పోటీలు, హాలీవుడ్, బాలీవుడ్ తారల నృత్యాలు
- ఫిబ్రవరి 12 నుంచి మూడురోజుల పాటు నిర్వహణ
- ఇది విదేశీ విష సంస్కృతికి బీజం
- మహిళా, విద్యార్థి, ప్రజా సంఘాల మండిపాటు
సాక్షి, విశాఖపట్నం: ఎప్పుడూ విదేశీ భజన చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇప్పుడవే విదేశీ పోకడలను రాష్ట్రానికి దిగుమతి చేసేందుకు పూనుకున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విశాఖ తీరంలో బీచ్ లవ్ ఉత్సవాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మందు, విందులతో పాటు గానా బజానాలకు రంగం సిద్ధమవుతోంది. గతంలో గోవా బీచ్‌లో ఇలాంటి ఉత్సవం నిర్వహించారు. ఈ ఏడాది విశాఖపట్నంలో అదే తరహా కార్యక్రమాలకు పూనుకోవడం, పర్యాటకాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ పేరిట సర్కారు సైతం విశృంఖల పాశ్చాత్య సంస్కృతి వ్యాప్తికి దోహదపడే ప్రదర్శనలు, ఆట పాటలు, నృత్యాల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం ప్రకంపనలు సృష్టిస్తోంది. నిరసనలు మిన్నంటుతున్నాయి.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు గొడ్డలి పెట్టులాంటి ఈ ఉత్సవాన్ని అడ్డుకుని తీరతామని విద్యార్థి, మహిళా, ప్రజా సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. పర్యాటకం పేరిట రాష్ట్ర సర్కారు బరితెగించి వ్యవహరిస్తోందని మండిపడుతున్నాయి. ఇప్పటిదాకా దేశంలో ఒక్క గోవాలో తప్ప మరెక్కడా ఇలాంటి లవ్ ఫెస్టివల్ నిర్వహించిన దాఖలా లు లేవు. అయితే గోవా సంస్కృతి సంప్రదాయాలు వేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది యువ తను పెడదారి పట్టించే ప్రమాదం ఉందని అంటున్నారు. ఆడవాళ్లను అందాల ప్రదర్శనకు, మగాళ్లను బల ప్రదర్శనకు పెట్టి ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోందని మహిళా సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఈ వివాదాస్పద బీచ్ ఫెస్టివల్‌పై విశాఖలో పర్యాటక శాఖ అధికారులు గానీ, వుడా, జీవీఎంసీ అధికారులు గానీ నోరుమెదపడం లేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడమే తప్ప తామేమీ చేయలేమని అంటున్నారు.
మూడురోజులు ఉత్సవాలు
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముంబైకి చెందిన పాజిటివ్ గ్లోబల్ సర్వీసెస్ అండ్ కన్సల్టెన్సీ సంస్థ ఈ ప్రేమోత్సవం నిర్వహించనుంది. ఫిబ్రవరి 12 నుంచి ప్రేమికుల దినమైన 14వ తేదీ వరకు మూడురోజుల పాటు బీఎల్‌ఎఫ్-2017 పేరిట ఉత్సవాలు జరగనున్నాయి. ప్రఖ్యాత పాప్ గాయని, బెల్లీ డ్యాన్సర్ షకీరా ఆటపాటలు, హాలీవుడ్, బాలీవుడ్ తారలు, మోడళ్ల క్యాట్ వాక్‌లు, అందాల పోటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఐరోపా, అమెరికా తదితర దేశాల నుంచి ఏకంగా 9వేల జంటలను ఈ ఉత్సవానికి ఆహ్వానిస్తున్నారు. వారికోసం ప్రత్యేకంగా టెంట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖ తీరంలో ఎక్కడ ఈ ఫెస్టివల్ నిర్వహించాలన్న దానిపై తర్జన భర్జనలు సాగుతున్నాయి.
ప్రసిద్ధ బౌద్ధారామాలున్న తొట్లకొండ, సాగర్‌నగర్ బీచ్, ప్రపంచ ప్రఖ్యాత ఎర్రమట్టి దిబ్బలు అనువైనవిగా ప్రాథమికంగా గుర్తించారు. ఆయా ప్రదేశాల్లో ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. ఉత్సవంలో భాగంగా పెట్టుబడిదారుల సదస్సులతో పాటు మిస్టర్ అండ్ మిసెస్ బీచ్ లవ్ వంటి పలు పోటీలు నిర్వహించి విజేతలకు అవార్డులను అందజేయాలని కూడా యోచిస్తున్నారు. మారథాన్ వంటి పోటీలను మిల్కాసింగ్, పీటీ ఉషలతో ప్రారంభింపజేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు ప్రత్యేకంగా టికెట్ ధర కూడా నిర్ణయించనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం.
పర్యాటకాభివృద్ధికి ఇలాంటి ఉత్సవమా?!
విశాఖ పేరును దెబ్బతీసే బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహణ అభ్యంతరకరం. పర్యాటకరంగం అభివృద్ధికి ఇలాంటి ఫెస్టివల్‌ను ఎంచుకోవడం తగదు. వీటివల్ల యువత పెడదోవ పట్టే ప్రమాదం ఉంది. దీనిని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశా. ఆయన అందుబాటులో లేకపోవడంతో సీఎం పేషీ అధికారులతో, టూరిజం శాఖ కార్యదర్శితో మాట్లాడా. ఒకవేళ ఈ ఫెస్టివల్ అనుమతించాల్సి వస్తే కేవలం విదేశీ ప్రతినిధులకే పరిమితం చేయాలి.
- పి.విష్ణుకుమార్‌రాజు, బీజేపీ ఎమ్మెల్యే, విశాఖ ఉత్తర నియోజకవర్గం
సంస్కృతిని మంటగలుపుతున్నారు
ఓ ప్రైవేటు సంస్థ తమ వ్యాపార ప్రయోజనాల కోసం లవ్ ఫెస్టివల్ పేరిట మహిళల శరీరాన్ని ప్రదర్శనకు పెట్టడం, దానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేయడం దుర్మార్గం. గోవా బీచ్‌లో విశృంఖల పాశ్చాత్య పోకడలకు వ్యతిరేకంగా ఒకపక్క ఆందోళనలు చేస్తుంటే.. అలాంటి దుష్ట సంస్కృతిని విశాఖలో ప్రవేశపెడితే చూస్తూ ఊరుకోం. పర్యాటకరంగ అభివృద్ధికి ఇలాంటి వాటిని ఎంచుకోవడం దురదృష్టకరం. దీనిని అడ్డుకుంటాం.
- ఎం.లక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రగతిశీల మహిళా సంఘం.