జన్మభూమి కమిటీలతో కలెక్టర్‌లకు కూడా అధికారాలు లేకుండా చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు విమర్శించారు. ద్రాక్షారామలో
-
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు
ద్రాక్షారామ (రామచంద్రపురం రూరల్) :
జన్మభూమి కమిటీలతో కలెక్టర్‌లకు కూడా అధికారాలు లేకుండా చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు విమర్శించారు. ద్రాక్షారామలో పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ అధ్యక్షతన జరిగిన గడప గడపకూ ముగింపు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో పోలీసులను దుర్వినియోగం చేసినంతగా ఏ ప్రభుత్వం చేయలేదని, భవిష్యత్‌లో కూడా ఏ ప్రభుత్వం ఇలా చేయదని కన్నబాబు అన్నారు. టీడీపీ నాయకులు చేస్తున్న అవినీతి గురించి నాయకులు ప్రశ్నిస్తుంటే తప్పుడు కేసులు బనాయించి రౌడీషీట్లు పెట్టిస్తున్న ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. ఎల్లప్పుడూ తామే అధికారంలో ఉంటామనే భ్రమలో టీడీపీ నాయకులు ఉన్నారని, అధికారం ఎప్పుడూ ఒకరి చేతుల్లోనే ఉండదనే విషయాన్ని గుర్తెరిగి మెలగాలని ఆయన అన్నారు. జిల్లాలో రైతులు పండించిన పంటకు ప్రభుత్వం బ్యాంకుల్లో రూ.500 కోట్లు వేస్తే వాటిని డ్రాచేసుకునేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయన్నారు. బ్యాంకుల్లో రైతులు డబ్బును ఒకేసారి డ్రా చేసుకునే సదుపాయం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులు జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై పెట్టిన కేసులకు బెదిరేదిలేదని, 2019లో రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ విజయఢంకా మోగించటం ఖాయమన్నారు.
ప్రాజెక్టులు మావేనని గొప్పులు చెప్పకుంటున్న చంద్రబాబు
గతంలో డాక్టర్‌వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వేసి నీటి ప్రాజెక్టులకు చంద్రబాబు ప్రారంభోత్సవాలు చేసి తామే నిర్మించామని గొప్పులు చెప్పుకుంటున్నారని, దీనిని ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్సీ బోస్ అన్నారు. ఎన్ని గొప్పలు చెప్పుకున్నా ఫర్వాలేదని, రాష్ట్రంలో జలయజ్ఞం చేసింది డాక్టర్ వైఎస్‌ఆర్ మాత్రమేనని బోస్ స్పష్టం చేశారు. బీస్సీ, ఎస్సీలపై టీడీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురిచేస్తోందని, పోలీసులు అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తే చూస్తూ ఊరుకునేది లేదని, స్టేషన్లు ముట్టడిస్తామన్నారు. రాష్ట్ర కార్యదర్శి వట్టి కూటి సూర్యచంద్రరాజశేఖర్, బీసీ సెల్ కార్యవర్గ సభ్యుడు వాసంశెట్టి శ్యాం, లీగల్ సెల్ కార్యదర్శి మాగాపు అమ్మిరాజు, జిల్లా వైద్య, ఎస్సీ సెల్ విభాగాల అధ్యక్షులు డాక్టర్ యనమదల మురళీకృష్ణ, పెట్టా శ్రీనివాసరావు, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి సత్తిశంకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి టేకుమూడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.