తప్పులు చేసేవాళ్లే గుడికి వెళ్తున్నారు
కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ బ్యూరో: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పులు చేసేవారే ఎక్కువగా గుళ్లకు వెళుతున్నారని అన్నారు. ఎక్కువ తప్పులు చేసి హుండీలో ఎక్కువ డబ్బులు వేస్తున్నారని చెప్పారు. అందుకే రాష్ట్రంలో దేవాలయాల ఆదాయం బాగా పెరుగుతోందని అన్నారు. అధికారులు కష్టపడకపోయినా రాష్ట్ర ఆదాయంలో 27 శాతం ఆ శాఖ నుంచే వస్తోందని చెప్పారు. నగరంలోని వెన్యూ కన్వెన్షన్ సెంటర్‌లో బుధవారం నుంచి రెండురోజుల పాటు జరిగే జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం మాట్లాడారు. చర్చిలు, మసీదులు, దేవాలయాలు లేకపోతే చాలామందికి పిచ్చి పట్టేదన్నారు.
ప్రజలకు కష్టం వస్తే దేవాలయాలకు వెళుతున్నారని, కొంతమంది బ్రాందీ, విస్కీలు తాగి సంతృప్తి చెందుతున్నారని అన్నారు. మద్యం తాగకుండా ఉండడం కోసం కొందరు అయ్యప్ప దీక్ష చేస్తున్నారని, ఆ 40 రోజులు మద్యం అమ్మకాలు తగ్గిపోతున్నాయని వ్యాఖ్యానించారు. కొన్ని ప్రభుత్వ శాఖలపై భారీ అవినీతి ముద్ర ఉందని, అధికార యంత్రాంగం బాధ్యత లేకుండా పనిచేస్తున్నారనే భావన ఉందని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అవినీతి పరులనే విషయం జనంలో నాటుకుపోయిందని అన్నారు.
వారసత్వంగా వచ్చిన సమస్యల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజలకు అవసరమైన ఫైళ్లపై కాకుండా కిందిస్థాయిలో ఎవరికో అవసరమైన ఫైళ్లపైనే తాను సంతకం చేస్తున్నానని చెప్పారు. ఫైళ్ల క్లియరెన్స్ కోసం ఎవరైతే వెంటబడతారో వారి ఫైళ్లే క్లియర్ అవుతున్నాయని, వెంటబడని వారి ఫైళ్లు అలాగే ఉండిపోతున్నాయన్నారు. ఈ-ఫైలింగ్ విధానం అమలు చేస్తే ఈ పరిస్థితి ఉండదని తెలిపారు. జూన్ ఒకటి నుంచి ప్రతి జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ-ఆఫీసు కార్యక్రమం అమలు కావాలన్నారు. జూన్ నెలాఖరు నాటికి ప్రతి ఫైలు ఆన్‌లైన్‌లో ఉండాలని, దీనికి జాయింట్ కలెక్టర్ నోడల్ అధికారిగా ఉంటారని ముఖ్యమంత్రి తెలిపారు.
పట్టణ జనాభా పెరగాలి
తలసరి ఆదాయంలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల కంటే మనం వెనుకబడి ఉన్నామన్నారు. 13 జిల్లాలకు వివిధ అంశాల్లో ర్యాంకులు ఇస్తామని, వెనుకబడిన జిల్లాలు మెరుగైన ర్యాంకు కోసం పోటీ పడాలని సీఎం చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో పోల్చితే పట్టణ జనాభా రాష్ట్రంలో తక్కువగా 29 శాతం మాత్రమే ఉందని, దీన్ని పెంచుకుంటేనే ముందుకెళతామన్నారు. రాష్ట్రంలో 50 శాతం మందే ప్రభుత్వ స్కూళ్లకు వస్తున్నారని, పట్టణాల్లో అయితే ప్రభుత్వ స్కూళ్లు మూతపడే పరిస్థితి ఉందని అన్నారు.
నాణ్యమైన విద్య అందిస్తే ప్రభుత్వ స్కూళ్లకే అందరూ వస్తారన్నారు. ప్రజల సంతృప్తస్థాయి 80 శాతం ఉండేలా పథకాలు అమలు చేయాలని అధికారులను కోరారు. పల్స్ సర్వే చేపట్టడం ద్వారా ఇంటింటికీ వెళ్లి సమగ్ర వివరాలు సేకరించాలని ఆదేశించారు. చేనేత కళాకారులకు విదేశీ మార్కెట్‌లో సంబంధాలు నెలకొల్పేలా ప్రైవేటు ఏజెన్సీలను ప్రోత్సహించాలని సూచించారు. పవర్‌లూమ్స్ ఏర్పాటు చేసే చేనేత కార్మికులకు భారీగా సబ్సిడీ ఇస్తామన్నారు. బోయలు, వడ్డెరలకు
రుణాలిస్తామన్నారు.
జూన్ 2న నవనిర్మాణ దీక్ష
రాష్ట్రం విడిపోయి రెండేళ్లవుతున్న సందర్భంగా జూన్ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. జూన్ 2న నవ నిర్మాణ దీక్ష చేపడతామని, 8న మహాసంకల్పం నిర్వహిస్తామని చెప్పారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన రాష్ట్రానికి చెందిన నీలిమను సమావేశంలో ముఖ్యమంత్రి అభినందించారు. మండలాల వారీగా వృద్ధి రేటు, రెండంకెల వృద్ధి, మనం-మన అభివృద్ధి పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. విశాఖ సాగర తీరంలో జూలై రెండో తేదీన జరిగే బే మారథాన్ వెబ్‌సైట్‌ను www. vizagbaymarathon. com ప్రారంభించారు.
అలాగే కార్మికుల బీమా సౌకర్యం కోసం ఉద్దేశించిన వెబ్‌సైట్ www.chandrannabima.ap. gov.inను కూడా ప్రారంభించారు. కేంద్ర నిధులు రాకపోయినా రాష్ట్రాన్ని చంద్రబాబు ముందుకు తీసుకెళుతున్నారని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రారంభోపన్యాసంలో పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ ప్రజల విశ్వాసం కోల్పోతోందని, మీ-సేవల్లో అవినీతిని అరికట్టాలన్నారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సీఎస్ ఎస్పీ ఠక్కర్ తదితరులు మాట్లాడారు. సీసీఎల్‌ఏ అనిల్ చంద్ర పునేఠా స్వాగతోపన్యాసం చేయగా మంత్రులు, వివిధ శాఖాధిపతులు, విభాగాధిపతులు పాల్గొన్నారు. మొదటిరోజు ఉదయం పది గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి 9.30 గంటలకు ముగిసింది.