సూర్యప్రభ వాహనంపై వెంకయ్యస్వామి
గొలగమూడి(వెంకటాచలం):
గొలగమూడి వెంకయ్యస్వామి 34వ ఆరాధనోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం సూర్యప్రభ వాహనసేవ నిర్వహించారు. ఉదయం స్వామికి నిత్య పూజల అనంతరం వాహనంపై ఆశీనులను చేసి పూలతో అలంకరిచారు. అనంతరం మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. స్వామి ఆశ్రమ భజన బృందం కోలాట ప్రదర్శన నిర్వహించింది. గ్రామోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. సూర్యప్రభ వాహనసేవకు నాయుడుపేటకు చెందిన సన్నారెడ్డి కృష్ణారెడ్డి ఉభయకర్తగా వ్యవహరించారు.
వేడుకగా గజ వాహనసేవ
ఆరాధనోత్సవాల్లో ఆదివారం రాత్రి గజ వాహనసేవ నిర్వహించారు. గజ వాహనంపై స్వామివారిని ఆశీనులను చేసి పూల, విద్యుద్దీపాలంకరణ చేశారు. పురవీధుల్లో గ్రామోత్సవం సాగింది. గ్రామోత్సవంలో వందలాది మంది భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఆమంచర్లకు చెందిన దాసరి వెంకటేశ్వరరావు గజ వాహనసేవకు ఉభయకర్తగా వ్యవహరించారు. నాట్యాచార్యులు జె.శ్రీరామచంద్రమూర్తి(విజయవాడ) శిష్యులచేత భరతనాట్య ప్రదర్శన చేశారు. ఉత్సవ ఏర్పాట్లను ఆశ్రమ కార్యనిర్వాహణాధికారి బాలసుబ్రహ్మణ్యం పర్యవేక్షించారు.
ఉత్సవాల్లో నేడు
సోమవారం ఉదయం అశ్వవాహనసేవ, రాత్రి పెదశేషవాహనసేవ నిర్వహించనున్నారు. అనంతరం వేదాంతం విజయలక్ష్మి శిష్యులచే కూచిపూడి నృత్య ప్రదర్శన, శ్రీరామాంజనేయ యుద్దం వార్‌సీను, సత్యహరిశ్చంద్ర పూర్తినాటకం ప్రదర్శించనున్నారు.