చీటీల పేరుతో ముంచేసింది
చీటీల పేరుతో ముంచేసింది
Published Thu, Jul 21 2016 9:46 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
నూజివీడు :
చీటీల పేరుతో ఓ మహిళ జనాన్ని ముంచేసింది. నమ్మకంగా ఉంటూ రూ.1.40 కోట్ల మేర వసూలు చేసుకుని మూడు నెలల క్రితమే ఉడాయించింది. బాధితులు గురువారం సాయంత్రం ఆ మాయ‘లేడీ’ ఇంటి వద్ద ఆందోళన చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... పట్టణంలోని సిబ్బందిపేటలో నివాసముండే దొంతాల వెంకట నాగరత్నకుమారి పదేళ్లకు పైగా చీటీపాటలు నిర్వహిస్తోంది. ప్రారంభంలో చీటీలు పాడిన వారికి సకాలంలో డబ్బులు ఇస్తూ మంచిపేరు పొందింది. దీంతో స్థానిక మహిళలు ఎక్కువ మంది ఆమె వద్ద చీటీ పాటలు వేసేందుకు ఆసక్తి చూపేవారు. అదే సమయంలో నాగరత్నకుమారి పలువురి వద్ద అప్పు కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలో మూడునెలల క్రితం నూజివీడు నుంచి ఆమె వెళ్లిపోయింది. ఆమె ఊరు వెళ్లి ఉంటుందని భావించారు. మూడు నెలలు గడిచినా రాకపోవడం, ఫోన్ చేస్తే సరిగా సమాధానం చెప్పకపోవడంతో ఆమె వ్యవహారంపై అనుమానం వచ్చింది. ఆమె భర్తను నిలదీస్తే తన భార్య ఎక్కడికి వెళ్లిందో తెలియదని చెప్పాడు. ఆమె ఇవ్వాల్సిన డబ్బులతో కూడా తనకు సంబంధం లేదని పేర్కొన్నాడు. దీంతో బాధిత మహిళలు ఆమె ఇంటి వద్ద బైఠాయించారు.
ఆందోళనలో బాధితులు
పలువురు కూలీలు, ఉద్యోగులు ఆమె వద్ద చీటీలు వేశారు. అందరికీ రూ.1.40 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని బాధితులు చెబుతున్నారు. తనకు రూ.9.50లక్షలు ఇవ్వాలని కొనకాల గీతాలక్ష్మి అనే మహిళ ఆవేదన వ్యక్తంచేశారు. తనకు రూ.10లక్షలు ఇవ్వాలని అప్పినేని వసంతకుమారి చెప్పారు. తమకు కూడా రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఇవ్వాలని అప్పినేని లీల, కె.కృష్ణవేణి, పసల కృష్ణకుమారి, వరాటి బాలకుమార్, ఆకుల సత్యపార్వతి తెలిపారు. వీరంతా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Advertisement
Advertisement