వృథా వ్యయం
♦ ప్రచారం కోసం ప్రజాధనం దుర్వినియోగం
♦ సీఎం పర్యటనపై సర్వత్రా విమర్శలు
♦ కార్యక్రమం వల్ల ప్రయోజనమేమిటని విసుర్లు
విజయనగరం గంటస్తంభం:
చేసింది గోరంతయితే... ప్రచారం కొండంత... ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న వైఖరి. సొంత ప్రచారం కోసం ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలకు బుధవారం చీపురుపల్లి పర్యటన అద్దం పట్టింది. ప్రచారానికి తప్ప జిల్లా ప్రజలకు ఈ కార్యక్రమం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని చర్చనడుస్తోంది. ప్రభుత్వం ప్రచారం కోసం ఎన్నో కార్యక్రమాలు గడచిన మూడేళ్లలో చేపట్టిన విషయం విదితమే. ఈ తరహాలోనే బుధవారం నుంచి మూడురోజులపాటు జలసిరికి జనహారతి పేరుతో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ద్వారా నదులు, కాలువల వద్ద కార్యక్రమాలు పెడుతోంది. ఇందులో భాగంగానే బుధవారం చీపురుపల్లిలో తోటపల్లి కాలువ వద్ద జనహారతి కార్యక్రమం చేపట్టింది. కాలువ వద్ద ముఖ్యమంత్రి హారతి ఇచ్చారు. అనంతరం చీపురుపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ కార్యక్రమం ఎందుకోసం నిర్వహిస్తున్నారన్నది ఎవరికీ అంతుచిక్కని ప్రశ్న.
దాదాపు రూ. కోటి వృథా....
వాస్తవానికి జనహారతి కార్యక్రమం కోసం జిల్లాలో దాదాపుగా రూ.కోటి ఖర్చువుతుందని అధికారవర్గాలు చెబుతున్న మాట. కాలువ వద్ద హారతికి ఏర్పాట్లు, బహిరంగ సభకు వేదిక, అక్కడకు రైతులు, ఇతర వర్గాలను తెప్పించడానికి, వారికి ఉపశమన చర్యలకు, ముఖ్యమంత్రికి ఏర్పాటు చేసిన కాన్వాయ్ అద్దె, ఇతర ఖర్చులు అన్నీ కలిపితే ఆ మాత్రం ఖర్చు తప్పదు. రెండు రోజులుగా అధికారులు ఏర్పాట్లకు, వారి తిండి, రవాణా ఖర్చులు ఇందులో కలిపితే ఇంకా ఎక్కువే ఉంటుందన్న అభిప్రాయం కూడా ఉంది.
ఏమి ప్రయోజనం
ఇంత ప్రజాధనం వినియోగించిన తర్వాత ఈ కార్యక్రమం వల్ల ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఏమైనా మేలు జరిగిదంటే లేదనే చెప్పుకోవాలి. ఒకసారి కార్యక్రమాన్ని చూస్తే తోటపల్లి నుంచి వస్తున్న కాలువ వద్ద ముఖ్యమంత్రి నిల్చున్నారు. హారతి ఇచ్చి వెళ్లిపోయారు. బహిరంగ సభ వద్ద మాట్లాడారు. అంతే అంతటితో కార్యక్రమం ముగిసింది. ఇదంతా చూస్తే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ప్రచారం కోసమేనన్నమాట నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే హారతి ఇవ్వకపోయినా తోటపల్లి నీరు కాలువల ద్వారా ప్రవహించడం ఆగదు. ప్రకృతి సహకరించి... ఒడిశాలో భారీ వర్షాలు పడితే తోటపల్లికి నీరు చేరక తప్పదు. ముఖ్యమంత్రి హారతి ఇవ్వకపోయినా పంట పొలాలకు నీరు అందుతుంది.
పోనీ అదనంగా ఆయకట్టుకు నీరించేందుకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేసుంటే ముఖ్యమంత్రి కార్యక్రమం వల్ల ప్రయోజనం ఉండేదన్న అభిప్రాయం జనాల్లో ఉంది. ఇదే కార్యక్రమం ఇతర సాగునీటి ప్రాజెక్టులు, పధకాలు నిర్మాణానికి పెడితే రైతులు సంతోషించేవారని, పాత ప్రాజెక్టుల వద్ద హారతిలు ఇచ్చి ఏమి ప్రయోజనం ఉంటుందని పలువురు చెప్పుకుంటున్నారు.