వాస్తు బాగోలేదు.. కూల్చి పారేయ్
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని సామెత. తెలుగుదేశం పార్టీ నాయకులు, అధినాయకులు అందరూ వాస్తు పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుపెడుతున్నారు. అసలే ఒకపక్క రాష్ట్రం లోటులో ఉందని, కొత్త రాజధాని నిర్మాణానికి ప్రజలంతా విరివిగా విరాళాలు ఇవ్వాలని జోలె పట్టి మరీ అడుగుతున్న టీడీపీ నాయకులు.. వాస్తు పేరుతో పదే పదే భవనాలు మారుస్తూ కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారు.
చంద్రబాబు తాత్కాలికంగా పరిపాలన సాగించడానికి సచివాలయంలోని హెచ్ బ్లాకులో సీఎం కార్యాలయం కోసం దాదాపు రూ. 3 కోట్లు వెచ్చించి సర్వహంగులూ పూర్తి చేశారు. అయితే చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఆయన సన్నిహితులు, జ్యోతిష్యులు దాన్ని పరిశీలించి వాస్తు సరిగా లేదంటూ.. సీఎం కోసం ఎల్ బ్లాకును ఎంపిక చేశారు. దాంతో హెచ్ బ్లాకులో వెచ్చించిన రూ. 3 కోట్లు వృథా అయ్యాయి. తర్వాత మళ్లీ పది కోట్ల రూపాయలు వెచ్చించి ఎల్ బ్లాకులో కొత్తగా పనులు చేపడుతున్నారు. ఇవి మూడునెలల్లో పూర్తవుతాయని, ఆ తర్వాత ఆయన అందులోకి వెళ్తారని చెప్పారు.
ఇక ఆయన బాటలోనే ఆయన అనుంగు సహచరుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు కూడా పయనిస్తున్నారు. తాజాగా విజయవాడ ఇరిగేషన్ కార్యాలయంలో ఉమా ఆదేశాల మేరకు ఓ భవంతిని కూల్చారు. వాస్తు ప్రకారం లేదని ఆమాత్యులు హుకుం జారీ చేయడంతో అధికారులు ఆగమేఘాల మీద ఈ బిల్డింగ్‌ను కూల్చేశారు. ఈ భవనంలో రెండో అంతస్తు కోసం ఇటీవలే పదిలక్షల రూపాయల మేర ఖర్చు పెట్టాటి అధికారులు.. మంత్రి ఆదేశంతో మరోమాట మాట లేకుండా కూల్చేశారు. ఇలా టీడీపీ నాయకులు ఎవరికి తోచిన స్థాయిలో వాళ్లు ప్రజాధనాన్ని వృథా చేస్తూనే ఉన్నారు.