వైద్యం అందక చిన్నారి మృతి
వైద్యం అందక చిన్నారి మృతి
Published Sun, Apr 2 2017 9:37 PM | Last Updated on Tue, Sep 5 2017 7:46 AM
- వైద్యులే కారణమని తల్లిదండ్రుల ఆరోపణ
– వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఆలూరు రూరల్ : వైద్యం అందక ఎనిమిదిఏళ్ల బాలుడు ఆదివారం మృత్యువాత పడ్డాడు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ కుమారుడి మృతికి ఆలూరు ఆస్పత్రి వైద్యులు, సిబ్బందే కారణమని ఆరోపించారు. వివరాల్లోకి వెళితే... ఆలూరు మండల పరిధిలోని అరికెరతండాకు చెందిన సోమ్లానాయక్, దుర్గీబాయిల కుమారుడు(మొదటి సంతానం) సుంకానాయక్(8ఏళ్లు) ఆలూరులోని ఓ ప్రయివేట్ పాఠశాలలో ఫస్ట్‌క్లాసు చదువుతున్నాడు. ఆ విద్యార్థి గత మూడు రోజులుగా తీవ్ర జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నాడు. శనివారం తల్లిదండ్రులు చికిత్స కోసం ఆలూరు ఆస్పత్రికి తీసుకొచ్చారు.
డ్యూటీలో ఉన్న మత్తుమందు డాక్టర్ గయాజ్, ఆస్పత్రి సిబ్బంది అప్పటికప్పుడు ప్రాథమికంగా చికిత్స అందించి సెలీన్‌బాటిల్ ఎక్కించారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలు దాటినా ఆ చిన్నారి ఆరోగ్యం కుదటపడకపోగా అస్వస్థలోనే ఉండిపోయాడు. దిక్కుతోచని పరిస్థితిలో కుటుంబసభ్యులు నియోజకవర్గకేంద్రమైన ఆలూరులోని ఓ మంత్రగాడు (ఆర్‌ఎంపీ డాక్టర్) వద్దకు ఆ బాలుడిని తీసుకెళ్లారు. అక్కడ ఆయన అంత్రం వేసి ఓ ఇంజక‌్షన్ వేసినట్లు తెలిసింది. అప్పటికే తీవ్ర అస్వస్థతలో ఉన్న చిన్నారికి అంత్రం, తంత్రం పేరుతో దాదాపు రెండుగంటలు బయటకు తీసుకెళ్లడంతో ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. దీంతో అంత్రం వేయించి బయటకు తీసుకొచ్చేలోపే సృహకోల్పోయాడు. గమనించిన తల్లిదండ్రులు, బంధువులు మరోమారు ఆలూరు ఆస్పత్రికి చికిత్స తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యసిబ్బంది చిన్నారి మృతిచెందినట్లు నిర్ధారించారు.
– వైద్యులపై కేసు నమోదు చేయాలని డిమాండ్
ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో తమ కుమారుడికి సకాలంలో మెరుగైన వైద్యసేవలు అందకపోవడంతోనే మృతిచెందాడని, బాధ్యులైన వైద్యసిబ్బందిపై కేసులు నమోదు చేయాలని చిన్నారి తల్లిదండ్రులు సోమ్లానాయక్, దుర్గీబాయి డిమాండ్ చేశారు. ఆదివారం కూడా తమ చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైనప్పటికీ విధి నిర్వహణలో ఉన్న వైద్యులు తమ కుమారుడిని పరీక్షించలేదని వారు ఆరోపించారు. తప్పని పరిస్థితుల్లో తాము అంత్రం వేయించేందుకు తీసుకెళ్లామన్నారు.
Advertisement