సంగారెడ్డి క్రైం, న్యూస్‌లైన్: చిన్న పిల్లలపై పెరుగుతున్న లైంగిక హింస పట్ల అవగాహన కల్పించడానికి చైల్డ్‌లైన్ ఇండియా ఫౌండేషన్, యూనిసెఫ్ సంయుక్తంగా రూపొం దించిన ‘మంచి స్పర్శ చెడు స్పర్శ’ పోస్టర్‌ను ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేటి సమాజంలో చిన్న పిల్లలపై ఇంటా, బయటా హింస పెరుగుతోం దన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన అవసరం చాలా ఉందన్నారు. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాల న్నారు. నేరం జరిగిన తర్వాత చట్టపరమైన చర్య తప్పకుండా ఉంటుందన్నారు. కానీ నేరం జరుగకుండా నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని సామాజిక బాధ్యతగా అందరూ భావించాలన్నారు.
చిన్న పిల్లలు ఎన్ని రకాలుగా లైంగిక హింసకు గురవుతున్నారో తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా పోస్టర్ ను తయారు చేసి విడుదల చేయడం అభినందనీయమన్నారు. చిన్నారులను హింసించే వారిని ప్రస్తుత చట్టాల ప్రకారం కఠినంగా శిక్షించవచ్చన్నారు. తల్లిదండ్రు లు కూడా పిల్లల భావాలను అర్థం చేసుకుని వారికి సరైన సమయంలో భద్రత ఇవ్వాలన్నారు. అనంత రం మెదక్ చైల్డ్‌లైన్ డెరైక్టర్ ఎం.ఎస్.చంద్ర మాట్లాడుతూ, చిన్నారులు ఎక్కడ హింసకు గురవుతున్నా వెంటనే చైల్డ్‌లైన్ 1098కు ఫోన్ చేయాలని కోరారు. కార్యక్రమంలో సంస్థ డెరైక్టర్ సుభాష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.