చదువు మాన్పిస్తున్న సక్సెస్! | children leavd in govt schools | Sakshi
Sakshi News home page

చదువు మాన్పిస్తున్న సక్సెస్!

Published Fri, Mar 4 2016 3:07 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

చదువు మాన్పిస్తున్న సక్సెస్! - Sakshi

చదువు మాన్పిస్తున్న సక్సెస్!

ఉన్నత విద్యకు దూరమవుతున్న పేద విద్యార్థులు
ఆందోళనలో తల్లిదండ్రులు
పట్టించుకోని విద్యాశాఖ అధికారులు

 ప్రభుత్వ బడుల్లో చదువుతున్న తమ పిల్లలు.. నాలుగు ఇంగ్లిష్ ముక్కలు నేర్చుకోవాలనే పేద, మధ్యతరగతికి చెందిన తల్లిదండ్రుల ఆశలు ఆవిరవుతున్నాయి. సక్సెస్ పాఠశాలల పేరుతో 2008లో ప్రభుత్వం ప్రారంభించిన స్కూళ్లలో చదివిన, చదువుతున్న విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆంగ్ల మాధ్యమ కళాశాలలు అందుబాటులో లేక, పైచదువుల కోసం ప్రభుత్వ చేయూత అందక.. చాలా మంది మధ్యలోనే ‘సక్సెస్’ బాట వీడుతున్నారు. మరికొందరు ఏకంగా చదువే మానేస్తున్నారు. 

దోమ: సక్సెస్ పాఠశాలల్లో చదివి ఇంగ్లిష్ మీడియంలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు.. వచ్చే విద్యా సంవత్సరం కూడా ఇబ్బందులు తప్పేలా లేవు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంగ్లిష్ మీడియం కళాశాలలు లేకపోవడం, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం అందకపోవడంతో.. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభంలో చాలా మంది విద్యార్థులు సక్సెస్ పాఠశాలల్లో చదువు మానేశారు. కొందరు మాత్రం తెలుగు మీడియం కళాశాలల్లో చేరి విద్యను కొనసాగిస్తున్నారు. కనీసం వచ్చే విద్యా సంవత్సరంలోనైనా ఇంగ్లిష్ మీడియం కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. 

 ప్రైవేటుపైనే ఆధారం....
ప్రభుత్వ కళాశాలల్లో ఇంగ్లిష్ మీడియం లేకపోవడంతో సక్సెస్ విద్యార్థులు విధిగా పట్టణాల్లో ఉండే ప్రైవేటు కాలేజీలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంటోంది. కార్పొరేట్ విద్యాసంస్థల్లో లక్షల రూపాయలు ఖర్చు చేసే స్థోమత లేక ఏటా చాలా మంది ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. ఇప్పటికైనా సక్సెస్ పాఠశాలల్లో టెన్త్ పూర్తిచేసిన విద్యార్థుల కోసం ఇంగ్లిష్ మీడియం కళాశాలలు ఏర్పాటు చేయడమో.. లేదంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లయినా చేయాలని ప్రజలు, తల్లిదండ్రులు కోరుతున్నారు. 

 2008లో ప్రారంభమైన సక్సెస్ పాఠశాలలు....
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆంగ్ల విద్యను అందించాలనే ఉద్దేశంతో దివంగత  నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా సక్సెస్ స్కూళ్లను ప్రారంభించారు. 2008లో ప్రారంభమైన వీటిలో 6వ తరగతిలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశాలు కల్పించారు. మొదటి బ్యాచ్ విద్యార్థులు 2013 మార్చిలో టెన్త్ వార్షిక పరీక్షలు రాశారు. పరిగి నియోజకవర్గంలో దోమ, కుల్కచర్ల, గండేడ్, పూడూరు, పరిగి మండలాల్లో కలిపి మొత్తం 25 ఉన్నత పాఠశాలలను అప్పట్లో ప్రభుత్వం సక్సెస్ స్కూళ్లుగా ఎంపిక చేసింది. ప్రస్తుత మార్చిలో 4వ బ్యాచ్ విద్యార్థులు ఫైనల్ పరీక్షలు రాయబోతున్నారు. జిల్లా వ్యాప్తంగా కేవలం గత ఏడాదిలోనే 13 వేల మంది సక్సెస్ పాఠశాలల విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 80 శాతానికి పైగా ఉన్నత చదువుల కోసం పడరాని పాట్లు పడ్డారు. ఈ ఏడాది కూడా ఇంచుమించు ఇదే సంఖ్యలో విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయనున్నారు. వీరికి కూడా అవస్థలు తప్పేలా లేవు. 

 భవిష్యత్ మాటేమిటి...

 

సక్సెస్ పాఠశాలల్లో ఫలితాలు బాగా వస్తున్నాయని సంబరపడుతున్న అధికారులు విద్యార్థుల భవిష్యత్తు గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. ఇంగ్లిష్ మీడియంలో టెన్త్ పూర్తి చేసిన వారు.. ఇంటర్ విద్యను అభ్యసించేందుకు అవసరమైన కళాశాలలు లేవన్న విషయాన్ని పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ కళాశాలల్లో కొన్నింటినైనా ఎంపిక చేసి ఇంగ్లిష్ మీడియంలో ఇంటర్ విద్యను అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement