
సెలవుపై వెళ్లిపో..
ప్రభుత్వ అధికారులు, సిబ్బందిపై తరచూ దాడులు, దూషణలకు దిగే ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈసారి...
అటవీశాఖ అధికారిపై చింతమనేని చిందులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రభుత్వ అధికారులు, సిబ్బందిపై తరచూ దాడులు, దూషణలకు దిగే ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈసారి అటవీ శాఖ అధికారిపై తన ప్రతాపం చూపించారు. తన మాటకు అడ్డొచ్చినందుకు ‘సెలవులోకి వెళ్లిపో. మీ ఇష్టమొచ్చినట్టు పనిచేస్తే కుదరదు. మేం చెప్పినట్టు చేయాలంతే...’అంటూ చిందులు తొక్కారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్‌లో శనివారం ఎంపీ మాగంటి బాబు అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో.. కొల్లేరు పరిధిలోని జిరాయితీ భూముల్లో చేపల పట్టుబడికి అనుమతి ఇవ్వాలని ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు కోరారు.
ఇందుకు చింతమనేని ప్రభాకర్ మద్దతు పలుకుతూ.. ‘అటవీ అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించాలి. కొల్లేరులో చేపల పట్టుబడికి అడ్డొస్తున్నారు. కేంద్రంలోను, రాష్ర్టంలోను మా ప్రభుత్వాలే ఉన్నాయి. మీ ఇష్టానుసారం వ్యవహరిస్తే ఎలా..’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో ఉన్న ఏలూరు ఇన్‌చార్జ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్‌వో) పి.శివశంకర్‌రెడ్డి స్పందిస్తూ.. నిబంధనల ప్రకారం జిరాయితీ భూముల్లో చేపల చెరువులు నిషిద్ధమని, సంప్రదాయ సాగుకు అభ్యంతరం లేదు కానీ ఫిష్ ట్యాంకులు వేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన చింతమనేని ‘అయితే నువ్వు సెలవులోకి వెళ్లు. ఇంకోడు వస్తాడు’ అని వ్యాఖ్యానించారు. ఇందుకు ప్రతిగా శివశంకర్‌రెడ్డి ‘నేను ఇప్పుడే సెలవు పెట్టేస్తా. శాంక్షన్ చేయించుకోండి’ అని సూటిగా బదులిచ్చారు.
ముందే సెలవుపెట్టాను : డీఎఫ్‌వో
‘జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో చేపల చెరువుల చర్చ సందర్భంగా ప్రజాప్రతినిధులు మా శాఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను రెండు నెలల కిందటే ఇన్‌చార్జిగా వచ్చాను. జిరాయితీ భూముల విషయంలో మేం నిబంధనల మేరకే నడుచుకుంటాం తప్ప ఎవరికీ వ్యతిరేకం కాదు.ఆరోగ్య కారణాల రీత్యా నేను ముందుగానే సెలవుపెట్టాను’ అని డీఎఫ్‌వో ‘సాక్షి’కి చెప్పారు.