
ఏసు నామంతో పులకించిన పుట్టపర్తి
పుట్టపర్తి టౌన్ : క్రిస్మస్ సందర్భంగా ఏసునామ స్మరణతో పుట్టపర్తి పులకించిపోయింది. ఆదివారం ఉదయం ప్రశాంతినిలయంలోని సాయికుల్వంత్ సభామందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత సత్యసాయి స్కూల్ విద్యార్థుల వయొలిన్ వాయిద్య కచేరితో వేడుకలు ప్రారంభమయ్యాయి. బ్రాస్‌బ్యాండ్ వాయిద్య కచేరి నిర్వహించారు. ఏసును, సత్యసాయిని కీర్తిస్తూ భక్తిగీతాలు ఆలపించారు. గత క్రిస్మస్ వేడుకలలో ఇచ్చిన సందేశాన్ని భక్తులకు డిజిటల్ స్క్రీన్‌ల ద్వారా ప్రదర్శించారు.
శాంతాక్లాజ్ తాత సాయికుల్వంత్ మందిరంలో కలియ తిరుగుతూ చాక్లెట్లు వెదజల్లుతూ మేరీ మేరీ క్రిస్మస్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. సాయంత్రం పూర్వపు ఇంటర్నేషనల్ క్రిస్మస్ కమిటీ చైర్మన్ జాన్‌బెన్హార్డ్ క్రిస్మస్ వేడుకలు, క్రీస్తు, సత్యసాయి సందేశాలను వివరిస్తూ ప్రసంగించారు. ఏసు, సత్యసాయి ఇద్దరూ లోక కల్యాణ సాధనకు పాటుపడిన మహనీయులన్నారు. అనంతరం పలువురు విదేశీ భక్తులు శాస్త్రీయ సంగీత వాయిద్య కచేరీ నిర్వహించారు. కళాకారులకు సత్యసాయి ట్రస్ట్ సభ్యులు నూతన వస్త్రాలను బహూకరించి సన్మానించారు. వేడుకలలో తెలంగాణ ఐజీ చారుసిన్హా, వివిధ దేశాల సత్యసాయి భక్తులు పాల్గొన్నారు.