సీఐడీ అధికారులు పరిశీలించిన వంశధార ఇన్విస్టిగేషన్ కార్యాలయం
ఆమదాలవలస : పట్టణంలోని వంశధార ప్రాజెక్టు డివిజన్ కార్యాలయంలో సోమవారం సీఐడీ కళకళం రేగింది. 2009–10 సంవత్సరంలో వంశధార కాలువల కోసం షట్టర్లు కొనుగోలులో కోట్లాది రూపాయల మేర కుంభకోణం జరిగింది. అప్పటి వంశధార అధికారులు సుమారు 32 మంది అవినీతికి పాల్పడినట్టు ఇటీవల వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని సీఐడీకి అప్పగించినట్టు సమాచారం. కేసు విచారణలో భాగంగా సోమవారం ఉదయాన్నే సీఐడీ అధికారులు ఆమదాలవలసలోని వంశధార ఇన్విస్టిగేషన్, నంబర్–1 డివిజన్ కార్యాలయాలకు వచ్చి వెళ్లారని తెలిసింది.
దీంతో వంశధార కార్యాలయ అధికారులు గుబులు చెందుతున్నారు. తొలుత కొంతమంది అధికారులు చింతాడ తదితర ప్రాంతాల వద్ద వంశధార కాలువలకు అమర్చిన షట్టర్లను పరిశీలించినట్టు సమాచారం. ఈ విషయాన్ని వంశధార అధికారులు గుట్టుగా ఉంచుతున్నారు. ఇదే విషయాన్ని వంశధార డివిజిన్–1 కార్యాలయ మేనేజర్ లక్ష్మీపార్వతి వద్ద ప్రస్తావించగా, సీఐడీ అధికారులు ఎవరూ రాలేదని చెప్పారు. ఈఈ కూడా శ్రీకాకుళం మీటింగ్‌కు వెళ్లారని చెప్పారు. కార్యాలయంలో రికార్డులు సక్రమంగా ఉంచాలని, సీఐడీ అధికారులు ఏ సమయంలోనైనా వచ్చే అవకాశం ఉందని వంశధార ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్టు మేనేజర్ తెలిపారు. కాగా, రోజూ సాయంత్రం 5 గంటలకు మూతపడే వంశధార కార్యాలయం సోమవారం 6.30 గంటల వరకు తెరిచి ఉంచడం అనుమానాలకు తావిస్తోంది.∙