కక్ష సాధింపే లక్ష్యంగా... | Revenge is their intension | Sakshi
Sakshi News home page

కక్ష సాధింపే లక్ష్యంగా...

Published Thu, Sep 8 2016 4:59 PM | Last Updated on Sat, Aug 11 2018 8:21 PM

కక్ష సాధింపే లక్ష్యంగా... - Sakshi

కక్ష సాధింపే లక్ష్యంగా...

* భూమన కరుణాకర్‌రెడ్డిని రెండు రోజులపాటు విచారించిన సీఐడీ అధికారులు 
ఉదయం నుంచి రాత్రి వరకూ కొనసాగిన విచారణ 
అరెస్టు చేస్తారనే వదంతుల నేపథ్యంలో సీఐడీ కార్యాలయం వద్ద ఉత్కంఠ 
 
సాక్షి, గుంటూరు: తుని ఘటనలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని గుంటూరు సీఐడీ రీజనల్‌ కార్యాలయంలో రెండురోజుల పాటు కాకినాడ సీఐడీ పోలీసులు విచారించారు. తుని ఘటనతో ఎటువంటి సంబంధం లేని భూమనపై కక్షసాధింపుతో కేసులో ఇరికించేందుకు అధికార పార్టీ పన్నిన పన్నాగంలో ఇది భాగమేనని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రభుత్వం, సీఐడీ అధికారులు భూమనను రెండు రోజులపాటు సుదీర్ఘంగా విచారించి కొండను తవ్వి ఎలుకను పట్టారని విమర్శించారు. భూమనను మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు విచారణ చేసిన సీఐడీ అధికారులు బుధవారం కూడా హాజరు కావాలంటూ ఆదేశించడంతో విచారణకు హాజరయ్యారు. ఉదయం 11.30 గంటల సమయంలో గుంటూరులోని సీఐడీ రీజనల్‌ కార్యాలయానికి చేరుకుని విలేకరులతో మాట్లాడారు. అనంతరం సీఐడీ కార్యాలయంలోకి వెళ్లారు. భూమనను విచారిస్తున్న సీఐడీ అడిషనల్‌ ఎస్పీ హరికృష్ణ 12 గంటల సమయంలో కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటి నుంచి కొనసాగిన విచారణ బుధవారం రాత్రి ఏడు గంటలకు ముగిసింది. ఉదయం నుంచి రాత్రి వరకు సీఐడీ కార్యాలయ ఆవరణలో భూమన రాకకోసం ఎదురు చూసిన వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు  ఆయన బయటకు రాగానే జేజేలు పలుకుతూ ఘనస్వాగతం పలికారు. 
 
భారీగా తరలి వచ్చిన వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలు భూమన కరుణాకర్‌రెడ్డిని గుంటూరు సీఐడీ రీజనల్‌ కార్యాలయంలో విచారిస్తున్న విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. విచారణకు హాజరయ్యేందుకు గుంటూరుకు వచ్చిన భూమన కరుణాకర్‌రెడ్డికి వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్‌ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు చుట్టుగుంట వద్ద స్వాగతం పలికారు. పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. భూమన వెంట వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి అంబటి రాంబాబు, గంగాధర్, నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు బాలవజ్రబాబు తదితరులు ఉన్నారు. 
 
ఉత్కంఠకు తెర..
తుని ఘటనలో సీఐడీ విచారణకు హాజరై మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని బుధవారం సీఐడీ అధికారులు అరెస్టు చేస్తారనే వదంతులు రావడంతో వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందారు. సాయంత్రం 5.30 గంటల తర్వాత కూడా భూమనను సీఐడీ అధికారులు బయటకు పంపకపోవడంతో అరెస్టు చేస్తారనే వాదనకు బలం చేకూరి సీఐడీ కార్యాలయ ఆవరణలో ఉన్న వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలు ఆయన రాక కోసం ఉత్కంఠతో ఎదురు చూశారు. గుంటూరు అర్బన్‌ అడిషనల్‌ ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో సీఐలు కరిముల్లాషావలి, హైమారావు నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఐడీ కార్యాలయం వద్దకు ఎవరూ వెళ్లకుండా బారికెడ్లు ఏర్పాటు చేయడంతో అరెస్టుపై అనుమానాలు రెట్టింపయ్యాయి. రాత్రి ఏడు గంటల సమయంలో భూమన సీఐడీ కార్యాలయం నుంచి బయటకు రావడంతో ఉత్కంఠకు తెరపడింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement