
బీఏసీకి ఇచ్చిన హామీకీ విలువ లేదా!
• అసెంబ్లీ సమావేశాలంటే టీఆర్‌ఎస్ భయపడుతోంది: జానారెడ్డి
• గాంధీ విగ్రహం వద్ద సీఎల్పీ నిరసన
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు పెడతామని శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ)కి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీకి కూడా విలువ లేదా అని కాంగ్రెస్ శాసనసభాపక్షం ప్రశ్నించింది. రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయని, వాటిపై చర్చలు జరిపి పరిష్కరించడానికి వెంటనే శాసనసభ సమావేశాలను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేసింది. కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనలో పాల్గొన్నారు.
ప్రభుత్వ ధోరణి అప్రజాస్వామికం...
జానారెడ్డి మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో తాండవిస్తున్న అనేక సమస్యలపై చర్చించి, పరిష్కారం చూపించాల్సిన బాధ్యత చట్ట సభలకు ఉంది. జీఎస్టీ బిల్లు ఆమోదం సందర్భంగా వారంలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకుందామని, అన్ని సమస్యలపై వివరంగా చర్చించుకుందామని సీఎం బీఏసీలో హామీ ఇచ్చారు. సమావేశాలు జరిగి మూడు నెలలు కావస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. బీఏసీకి ఇచ్చిన మాటకు కూడా విలువలేదా? రైతులు, విద్యార్థులు, యువకులు, కూలీలు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు సమస్య వచ్చి చేరింది. వీటిపై చర్చించడానికి అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని అడుగుతుంటే కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు? ప్రజాస్వామికంగా నిరనసలు చెప్పాలనుకుంటే ప్రభుత్వం అప్రజాస్వామికంగా అణిచివేసే ప్రయత్నం చేస్తోంది. పోలీసులను మోహరించి, ప్రతిపక్షాలను భయపెట్టి, భయోత్పాతాన్ని సృష్టించాలనుకుంటోంది. అధికారం ఉందనే అహంకారంతో వ్యవహరిస్తోంది’అన్నారు.
కేసీఆర్ అబద్ధాలకోరు: ‘కేసీఆర్ పచ్చి అబద్ధాలకోరు. శాసనసభలోనూ పచ్చి అబ ద్ధాలు మాట్లాడే ఏకై క వ్యక్తి కేసీఆర్ ఒక్కరే. ప్రజాసమస్యలపై ప్రజా ప్రతినిధులు మాట్లాడవద్దంటే ఎలా’అని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డి.కె.అరుణ, సంపత్‌కుమార్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పొం గులేటి సుధాకర్‌రెడ్డి, ఆకుల లలిత, రంగారెడ్డి, సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.
తెలంగాణ తెచ్చుకుంది ఇందుకేనా?
బడ్జెట్ సమావేశాల తర్వాత అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడానికి ఎందుకు భయపడుతున్నారో కేసీఆర్ సమాధానం చెప్పాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. ‘జీఎస్టీ కోసం ప్రత్యేక సమావేశాలు పెట్టి, మరే ఇతర సమస్యలనూ చర్చించకుండా దాటేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏడాదికి 52 రోజులు అసెంబ్లీ నడిస్తే.. తెలంగాణలో కేవలం 18 రోజులే జరిగింది. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, ఏకపక్షంగా, నియంతృత్వంతో వ్యవహిరించడానికే తెలంగాణ తెచ్చుకున్నామా? ప్రజాస్వామ్యం, ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ అవమానిస్తున్నారు. శాసనసభ సమావేశాలను నిర్వహించకుంటే ఆందోళనలను మరింత పెంచుతాం’అని ఉత్తమ్ హెచ్చరించారు.
పోలీసుల మోహరింపుపై ఆగ్రహం
ధర్నా చేయాలని సీఎల్పీ నిర్ణరుుంచిన నేపథ్యంలో అసెంబ్లీ ఆవరణలో భారీగా పోలీసులను మోహరించడంపై జానారెడ్డి సహా కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వమే భయోత్పాతం సృష్టిస్తే ఎలా’అని అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాంను జానా ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అసెంబ్లీ ఆవరణలో అగౌరవపరుస్తున్నారన్నారు. విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకుపోతానని కార్యదర్శి చెప్పారు.