మేయర్ చాంబర్‌లో సీఎం మకాం
విజయవాడ సెంట్రల్ : కృష్ణా పుష్కరాలను సీఎం చంద్రబాబు నగరపాలక సంస్థ కార్యాలయం నుంచే పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం కౌన్సిల్ హాల్‌లో మేయర్ పోడియం వద్ద ప్రత్యేక వేదిక నిర్మిస్తున్నారు. కౌన్సిల్ హాల్ సమీపంలోని టౌన్‌ప్లానింగ్ ఆన్‌లైన్ విభాగం, సెక్రటరీ సెల్‌ను ఖాళీ చేయించారు. ఉన్నతాధికారులతో సీఎం సమీక్షలు నిర్వహించేందుకు వీలుగా మౌలిక వసతులు కల్పిస్తున్నారు. సోఫాలు, కుర్చీలు, మైక్‌లు సిద్ధం చేస్తున్నారు. ఈనెల 5వ తేదీన యుద్ధప్రాతిపదికన ప్రారంభమైన పనులు 10వ తేదీ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. తొలుత మోడల్ గెస్ట్‌హౌస్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసే అద్దాల మందిరం నుంచి సీఎం పర్యవేక్షణ ఉండాలని భావించారు. అధికారులతో సమీక్షలు, ప్రెస్‌మీట్‌లు అన్నీ అక్కడే నిర్వహిస్తారు. ఆ ప్రాంతంలో సీఎం మకాం పెడితే ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతుందని పోలీస్ శాఖ సూచించింది. ఈ క్రమంలో వేదికను నగరపాలక సంస్థ కార్యాలయానికి మార్చారు.
12 రోజులూ కార్పొరేషన్‌లోనే..
పుష్కరాలు జరిగే 12 రోజులూ సీఎం కార్పొరేషన్ కార్యాలయం నుంచే పర్యవేక్షిస్తారు. సీఎం ఉండేందుకు అనువుగా మేయర్ చాంబర్‌లో వసతుల కల్పన చేపట్టారు. మంత్రులు, ముఖ్య అధికారులతో ఆంతరంగిక చర్చలన్నింటినీ సీఎం మేయర్ చాంబర్‌లోనే నిర్వహిస్తారు. వివిధ శాఖల అధికారులతో సమీక్షలు, సమావేశాలను కౌన్సిల్ హాల్‌లో నిర్వహిస్తారు. సీఎం, ఇతర అధికారులు రాకపోకలు సాగించేందుకు వీలుగా నగరపాలక సంస్థ కార్యాలయంలోని పడమర వైపు ఉన్న కాంట్రాక్టర్స్ అసోసియేషన్ హాల్, యూసీడీ (అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్) షెడ్‌ను కూల్చివేశారు. పడమర వైపు ఉన్న ప్రధాన ద్వారం నుంచి సీఎం కాన్వాయ్, పక్కన కొత్తగా ఏర్పాటుచేస్తున్న గేటు నుంచి అధికారుల వాహనాలు కార్యాలయంలోకి చేరుకునేలా ప్లాన్ చేశారు. ఇక్కడే మీడియా పాయింట్ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో కౌన్సిల్ హాల్ చుట్టూ సుందరీకరణ పనులు చేపట్టారు. నగరపాలక సంస్థ కార్యాలయానికి రంగులు వేసి విద్యుత్ కాంతులు అమరుస్తున్నారు.