విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లోనూ త్వరలో అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు వెల్లడించారు. అన్న క్యాంటీన్లను పైలెట్ ప్రాజెక్టుగా వెలగపూడిలో ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. శనివారం వెలగపూడిలో అన్న క్యాంటీన్ను చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం అన్న క్యాంటీన్ లో ఆహార పదార్థాలను చంద్రబాబుతోపాటు ఆయన మంత్రి వర్గం సహచరులు, ఎమ్మెల్యేలు రుచి చూశారు. 300 చదరపు అడుగు విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన భోజనశాలను ఆయన ప్రారంభించారు. రోజుకు 300 నుంచి 400 మంది ఈ క్యాంటీన్కు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
అంతకుముందు అన్న క్యాంటీన్ను మంత్రి పరిటాల సునీత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పేదవారి ఆకలి తీర్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. రాయలసీమలోని అన్న క్యాంటీన్లలో రాగి సంకటి అందజేయనున్నట్లు సునీత చెప్పారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మరో రెండు క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు పరిటాల సునీత చెప్పారు.రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. ఈ అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.