మోదీతో మాట్లాడలేని అసమర్థత
ఎమ్మెల్యే ఆర్కే
మంగళగిరి: ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వార్థం కోసం రాష్ట్రంలోని ఐదుకోట్ల మంది ప్రజల జీవితాలను పణంగా పెడుతున్నాడని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) మండిపడ్డారు. హోదా కోరుతూ ఈ నెల 2వతేదీన చేపట్టిన బంద్‌పై తన కార్యాలయంలో సోమవారం నాయకులతో సమాయత్త సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఒటుకు నోటు కేసులో అడ్డంగా దొరికడంతో పాటు అవినీతిలో రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌గా చేసిన ముఖ్యమంత్రి కేంద్రాన్ని నిలదీస్తే ఎక్కడ కేసులలో ఇరికిస్తారనే భయంతోనే ప్రత్యేకహోదాపై ప్రధాని నరేంద్రమోదీని కలవనని నాటకాలాడుతున్నారన్నారు. హోదా అనేది రాష్ట్రానికి సంజీవని కాదని చంద్రబాబు అన్న రోజునే ఆయన నైజం బయటపడిందన్నారు. హోదా సాధించకపోతే భవిష్యత్తుతరాలకు తీవ్రంగా నష్టపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలంతా ఏకమై ఉద్యమాలు చేసి హోదా సాధించకపోతే భవిష్యత్తు తరాలు క్షమించవని హెచ్చరించారు.