సీఎం సీమ ద్రోహి
– కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి
– శ్రీశైలంలో కనీస నీటిమట్టం పాటించాలని డిమాండ్
– త్వరలో ఆరు జిల్లాల రైతులు, మేధావులతో సదస్సు
కోడుమూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన కోడుమూరులో విలేకరులతో మాట్లాడారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 854 అడుగుల నీటిమట్టం లేకుండానే నాగార్జునసాగర్‌కు విడుదల చేయడం సరికాదన్నారు. కనీస నీటి మట్టం పాటించకుంటే పాలమూరు, డిండి ప్రాజెక్టులతోపాటు హంద్రీనీవా ఎత్తిపోతల పథకాలకు నీరు చేరదని, అదే జరిగితే రాయలసీమ ప్రాంతం ఏడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమ రైతుల కోసం పార్టీలకు అతీతంగా కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతులు, మేధావులను ఏకం చేసి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. త్వరలో 6 జిల్లాల రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
జిల్లాలో పాలన అస్తవ్యస్తం..
జిల్లాలో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టులు, చెరువుల్లో నీరున్నప్పటికీ జనం తాగు, సాగునీటికి అవస్థలు పడే పరిస్థితి నెలకొందన్నారు. 38 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసే నంద్యాల వాటర్ స్కీం రెండేళ్లుగా పని చేయకపోయినా కాంట్రాక్టర్లు నిధులు స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ విజయమోహన్ అధికార పార్టీ తొత్తుగా మారారని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో సీబీ లత, సింగిల్‌విండో అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు కె.హేమాద్రి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.