
సీఎం ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారు
కడప కార్పొరేషన్: రాష్ట్ర ముఖ్యమంత్రే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం అత్యంత దారుణమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఉపాధ్యాయులు, ఉద్యోగులతో సమావేశాలు నిర్వహించి ఇళ్లు, ఇళ్లస్థలాలు ఇస్తామని ఎలా హామీలిస్తారని నిలదీశారు. ఆదివారం వైఎస్సార్ జిల్లా కడపలో కమలాపురం, రైల్వేకోడూరు ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, కడపమేయర్ సురేష్‌బాబులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ నిన్న జిల్లాకు వచ్చిన ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు ఆర్‌జేడీ, ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ మద్దతుతో పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేస్తున్న వారికి ఓట్లు వేయించే యత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ కోటకు బీటలు వారుతున్నాయని మంత్రి గంటా, టీడీపీ నాయకులు చెప్పడం హాస్యాస్పదమన్నారు. జిల్లాలో 500 మందికిపైగా వైఎస్‌ఆర్‌సీపీ ప్రజా ప్రతినిధులు ఉన్నారని, సంఖ్యాబలం లేకపోయినా టీడీపీ అనైతికంగా పోటీ పెట్టిందన్నారు. తమ ప్రజా ప్రతినిధులను ప్రలోభాలకు గురిచేసి, ఎర్రచందనం కేసులు పెడతామని బెదిరించి లొంగదీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకు చెందిన ప్రజా ప్రతినిధుల ఇళ్ల దగ్గరకు పోయి బలవంతంగా వారితో ఫిర్యాదులు ఇప్పిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అధికారపార్టీ సాగిస్తున్న అరాచకాలను ఖండిస్తున్నామని చెప్పారు. తమ పార్టీ తరఫున స్థానిక సంస్థల నియోజకవర్గానికి పోటీచేస్తున్న వైఎస్ వివేకానందరెడ్డి, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ చేస్తున్న వెన్నపూస గోపాల్‌రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.