మరోసారి బయటపడిన బాబు కుట్ర
సాక్షి, విశాఖపట్నం :ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అరకులో మంగళవారం చంద్రబాబు పర్యటించారు. బాక్సైట్ తవ్వకాలపై జారీ చేసిన జీవో 97 రద్దు చేస్తున్నట్లు ఈ సందర్భంగా సీఎం ప్రకటన చేస్తారని గిరిజనులు ఆశగా ఎదురు చూశారు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లడంతో పాటు బాక్సైట్ తవ్వకాలే తన అభిమతమని సీఎం పరోక్షంగా చెప్పడం వారిని కలవరపాటుకు గురిచేసింది. అంతే కాకుండా బాక్సైట్ పదం ఎత్తకుండా తమను బాక్సైట్ తవ్వకాలు ఒప్పించేందుకు సీఎం చేసిన ప్రయత్నం గిరిజనులు, గిరిజన సంఘాలను తీవ్ర విస్మయానికి గురిచేశాయి. ఇక్కడ అపారంగా ఉన్న సహజవనరులను సద్వినియోగం చేసుకుంటే మీ భవిష్యత్ బాగుంటుందంటూ బాబు చెప్పిన సలహాపై వారు మండిపడుతున్నారు.
చల్లారని బాక్సైట్ ఉద్యమం :
గిరిజనుల మనోభావాలకు విరుద్ధంగా విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ నిక్షేపాలను వెలికి తీసేందుకు చంద్రబాబు సర్కారు గతేడాది జీవో 97ను జారీ చేసింది. ఈ జీవోపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. గిరిజనులు, గిరిజన సంఘాలు ఉద్యమ బాటపట్టాయి. గిరిపుత్రులు విల్లంబులు చేతబట్టి బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఉవ్వెత్తున సాగిన ఉద్యమ తీవ్రతను చూసి చంద్రబాబు సర్కార్ వణికిపోయింది. ఓ వైపు మావోల నుంచి, మరో వైపు గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో జీవో అమలుపై కాస్త వెనక్కితగ్గింది. తనకు తెలియకుండానే ఈ జీవో జారీ అయిందని, తాత్కాలికంగా దీన్ని పక్కన పెడుతున్నట్టు చంద్రబాబే మీడియా ముందుకొచ్చి ప్రకటించాల్సి వచ్చింది. చంద్రబాబుతో సహా మంత్రులు, ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఏజెన్సీలో తిరిగేందుకే భయపడ్డారు. సీఏం చంద్రబాబు అయితే తాను దత్తత తీసుకున్న పెదలబుడు పంచాయతీలో పర్యటించాలని నాలుగుసార్లు జిల్లాకు వచ్చినప్పుడు ఆలోచన చేసినప్పటికీ బాక్సైట్ ఉద్యమ నేపథ్యంలో వెనక్కి తగ్గారు. గతేడాది ఆదివాశీ దినోత్సవాన్ని కూడా విశాఖపట్నంలోనే నిర్వహించి తీవ్ర విమర్శలకు గురయ్యారు. కొంతకాలంగా బాక్సైట్ తవ్వకాలపై అధికారపార్టీ నేతలెవరూ నోరు మెదపడం లేదు. అయితే బాబు సర్కార్ జారీ చేసిన జీవో 97ను రద్దు చేయాలంటూ గిరిజనులు, గిరిజన సంఘాలు డిమాండ్‌చేస్తూ ఉద్యమాన్న కొనసాగిస్తూనే ఉన్నాయి.
స్పందన కరువు :
ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అరుకులోయలో పర్యటనకు తర్జనభర్జనలనంతరం సీఏం పర్యటన ఖరారైంది. తొలుత పెదలబుడు పంచాయతీకి వెళ్లకూడదని భావించినప్పటికీ తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పంచాయతీలో గ్రామస్తులతో ముఖాముఖీ ఏర్పాటుచేశారు. వారు అడిగిన ప్రతి పనినీ చేసేస్తామంటూ హామీలు గుప్పించారు. 413 ఇళ్లు, 70 మరుగుదొడ్లు, రూ.9.5 కోట్లతో సీసీ రోడ్లు నిర్మిస్తామన్నారు. కానీ ఆయన ఏం చెప్పినా జనం నుంచి స్పందన రాలేదు. పెదలబుడులోనే ఫైబర్‌గ్రిడ్‌కు శ్రీకారం చుడతామని, ప్రతి ఇంటికి వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం వస్తుందని సీఎం అనగానే తమకు టీవీలే లేవని స్థానికులు బదులిచ్చారు. టూరిజం అభివద్ధికి ప్రైవేటు భాగస్వామ్యం తీసుకుంటామని సీఎం చెప్పారు. పెదలబుడు పంచాయతీలో 22 హేబిటేషన్లు ఉండగా కేవలం పెదలబుడు గ్రామానికే సీఎం హామీలు ఇచ్చారు. అరకులో చంద్రబాబు రోడ్‌షో నిర్వహించినా ఎక్కడా జనం పెద్దగా కనిపించలేదు.