పారిశ్రామిక కారిడార్గా తీరప్రాంతం
హంసలదీవి పర్యటనలో సీఎం చంద్రబాబు
కోడూరు : పరిశ్రమలు స్థాపించేందుకు అనువుగా ఉన్న సముద్రతీర ప్రాంతం వెంబడి పారిశ్రామిక(ఇండస్ట్రియల్) కారిడార్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సీఎం ఎన్.చంద్రబాబు తెలిపారు. హంసలదీవి పవిత్ర కృష్ణా సాగరసంగమ ప్రాంతంలో సీఎం గురువారం పర్యటించి.. పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. ఇచ్ఛాపురం దగ్గర నుంచి తడ వరకు సముద్రతీరం వెంబడి రోడ్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సీఎం చెప్పారు.
బందరు పోర్టు పనులను త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక హెలీకాప్టర్ ద్వారా సాగరసంగమ ప్రాంతానికి చేరుకున్న సీఎం కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణమ్మ-సాగరుడు కలిసే ప్రాంతంలో నదీమతల్లికి హారతులిచ్చారు. ఎన్టీఆర్ వైద్యసేవలో మరో 106 వ్యాధులను చేర్చామని తెలిపారు. ఇప్పటికే వైద్యశాలల్లో వ్యాధిగ్రస్తుల డేటా ఉందని, ఈ డేటాను వైద్యులు తీసుకుని వారివద్దకే వెళ్లి వైద్యం చేస్తారని చెప్పారు.
26,27న గుంటూరులో జాబ్‌మేళా: దళిత, గిరిజన యువతకు జాబ్‌మేళాలు నిర్వహించాలని సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబును సీఎం చంద్రబాబు ఆదేశించారు. గురువారం ఉదయం తన నివాసంలో మంత్రి రావెలతో కలసి ఈనెల 26, 27న గుంటూరులోని చౌడవరంలో నిర్వహించే జాబ్‌మేళా వాల్‌పోస్టర్‌ను సీఎం విడుదల చేశారు. రావెల ట్రస్ట్, వికాస సంస్థ ఆధ్వర్యంలో ఆర్వీఆర్-జేసీ కళాశాల ప్రాంగణంలో మేళా జరగనుంది. టెన్త్ నుంచి ఇంజనీరింగ్ వరకు చదువుకున్న వారెవరైనా ఈ మేళాకు రావచ్చన్నారు. ఆసక్తి గలవారు www.ravelatrust. org వెబ్‌సైట్ ద్వారా ఈనెల 23లోగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.