భక్తుల నెత్తిన టెంకాయ బాదుడు
భక్తుల నెత్తిన టెంకాయ బాదుడు
Published Sat, Aug 6 2016 12:34 AM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
– ఉరకుంద క్షేత్రంలో భక్తులను దోచుకుంటున్న టెంకాయ వ్యాపారులు
– జత టెంకాయలు రూ.60 విక్రయం
– మార్కెట్లో జత టెంకాయలు రూ.30
– కళ్లు మూసుకున్న క్షేత్రం అధికారులు
మంత్రాలయం:
ఉరుకుంద ఈరన్న క్షేత్రంలో భక్తుడు అడుగు పెట్టింది మొదలు స్వామికి హారతి పట్టేంత వరకు నిలువు దోపిడీకి గురికావాల్సిందే. ఓ వైపు భక్తుల జేబులు గుల్ల అవుతున్నా అధికారులు చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా టెంకాయ బాదుడు చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. స్వామి వారికి నిర్మలైన మనస్సుతో టెంకాయ సమర్పించాలని కొనేందుకు వెళ్తే జేబులు చూసుకోవాల్సి వస్తోంది. ఈ క్షేత్రంలో శ్రావణమాసంలో అధికంగా సోమ, గురువారాలు లక్షలాది మంది భక్తులు క్షేత్రాన్ని సందర్శిస్తారు. దాదాపు 15 లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు. వచ్చిన ప్రతి భక్తుడూ స్వామికి జోడు నారీకేళాలు సమర్పించుకుంటారు. టెంకాయలు విక్రయించేందుకుగానూ ఇటీవల రూ.82.10 లక్షలకు టెండర్ దక్కించుకున్నారు. క్షేత్రంలో దాదాపు 55 టెంకాయ దుకాణాలు ఉన్నాయి. క్షేత్రంలో టెంకాయల విక్రయదారులు గాలి ఉన్నప్పుడు తూర్పార బట్టాలన్న సామెతను ఒంట బట్టించుకున్నారు. అడ్డగోలుగా టెంకాయల ధరలకు రెక్కలు తొడిగారు. రెట్టింపు చేసేసి భక్తులను పీల్చి పిప్పిచేసేస్తున్నారు. మార్కెట్‌లో జోడు టెంకాయలు రూ.30కే లభిస్తున్నాయి. అదే హోల్‌సేల్‌కు తీసుకుంటూ రూ.20 మించి పలుకవు. ఇక్కడ మాత్రం జోడు టెంకాయలు రూ.60. సగానికి సగం ధర పెంచేశారు. మాసంలో 20 లక్షలకుపైగా టెంకాయలు విక్రయిస్తారు. ఈ లెక్కన దోచేస్తున్న సొమ్ము దాదాపు రూ.30 లక్షలు. టెంకాయ బాదుడుకు బదులు టెంకాయలు కొట్టే చోట దక్షిణ సమర్పించుకోవాలి. ఒక్క నారీ కేళ సమర్పణకే గుడి నుంచి బయటకు వచ్చేలోపు రూ.70కి పైగా ఖర్చు. నారీ కేళాలు సమర్పించుకుందామంటే రెక్కలు తొడిగిన ధరలతో నిలువు దోపిడీ చేస్తున్నారు. భక్తులు అరచీ గీపెట్టుకున్నా అధికారుల్లో చలనం లేదు. భక్తులను ఇంత దోచేస్తున్నా అధికారుల మౌనానికి ఆంతర్యం స్వామికే ఎరుక. భక్తుల దోచిన పాపంలో అధికారుల పాత్ర ఉందంటూ లక్షలాది మంది భక్తులు గొంతెత్తి ఆరోపిస్తున్నారు.
ఎక్కడా చూడలేదు : నాగరాజు, ఎమ్మిగనూరు
స్వామి మొక్కు కోసం కాలినడకన ఇక్కడకు వచ్చాం. క్షేత్రంలో రూ.60 చెల్లించి రెండు టెంకాయలు తీసుకున్నాం. ఏ క్షేత్రంలోనూ ఇంత దోపిడీ చూడలేదు. సగానికి సగం ధర కట్టి విక్రయిస్తున్నారు. భక్తులను దోచుకోవడమే ఇక్కడ పనిగా పెట్టుకున్నారు.
అధికారులు ఏమి చేస్తున్నారు : కొండయ్య, పోలకల్
సత్యానికి, ధర్మానికి నిలయాలు దైవ క్షేత్రాలు. అయితే ఉరకుంద క్షేత్రంలో ధర్మం మంట గలిసింది. భక్తులను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఇక్కడి అధికారులు ఏమి చేస్తున్నారో తెలియడం లేదు. ఇలాంటి అధికారులుంటే భక్తులు క్షేత్రాలకు రావడమే మానేస్తారేమో.
దోపిడీ అరికట్టాలి: బద్రి, ఎర్రకోట
ఉరకుంద క్షేత్రం రెండు టెంకాయలు రూ.60 విక్రయిస్తున్నారు. బయట మార్కెట్లో రూ.30కే లభిస్తున్నాయి. టెంకాయలు కొనాలంటేనే ఆలోచించాల్సి వస్తోంది. భక్తులను దోచుకోవడం నిజంగా మోసం. ఇక్కడి అధికారులు కాకపోయినా ఉన్నతాధికారులు కళ్లు తెరచి దోపిడీకి కళ్లెం వేయాల్సిన అవసరం ఉంది.
Advertisement
Advertisement