ధర రాక... దరి లేక.. | coconut workers facing more problems | Sakshi
Sakshi News home page

ధర రాక... దరి లేక..

Published Fri, Jul 14 2017 11:28 PM | Last Updated on Tue, Sep 5 2017 4:02 PM

ధర రాక...  దరి లేక..

ధర రాక... దరి లేక..

అంతరాష్ట్రీయంగా డిమాండ్‌
ఒడిదుడుకుల్లో కొబ్బరి రైతు తగ్గిపోతున్న తోటల విస్తీర్ణం
గిట్టుబాటు కాని ధరలు  కాయకు రూ.3 నుంచి రూ.5లు
మార్కెట్‌లో మాత్రం అధిక రేటు విదేశాలకూ  ఎగుమతులు
కొత్తగా జీఎస్టీ తలపోటు 
 
నరసాపురం:  జిల్లా పేరు చెపితే వరి తరువాత గుర్తుకు వచ్చేది కొబ్బరి. దేశంలో కేరళ తరువాత ఎక్కువ స్థాయిలో కొబ్బరి ఎగుమతులు సాగించేది మన రాష్ట్రమే. రాష్ట్రంలో కూడా గోదావరి జిల్లాల నుంచే కొబ్బరి ఎగుమతులు ఎక్కువగా సాగుతుంటాయి. ఇందులో మన జిల్లా స్థానం ప్రత్యేకమైనది. కొడుకును నమ్ముకునే బదులు ఓ కొబ్బరి చెట్టును పెంచుకుంటే మేలనే నానుడి జిల్లాలో ఎప్పటి నుంచో ఉంది. 
కొబ్బరి చెట్టు ఆర్ధికంగా ఆసరాగా ఉంటుందనే భరోసా అందరిలో ఉంటుంది.

అలాంటి కొబ్బరి పరిశ్రమ ప్రస్తుతం ఒడిదుడుకుల్లో పడింది. బయట మార్కెట్‌లో డిమాండ్‌ను బట్టి రూ. 15లు నుంచి రూ. 20లు వరకూ కొబ్బరి కాయధర పలుకుతోంది. అదే రైతుకు మాత్రం రూ. 3 నుంచి రూ. 5లు వరకూ మాత్రమే దక్కుతోంది. డిమాండ్‌ను బట్టి ఒక్కోసారి రైతుకు మరో అర్ధ రూపాయో, రూపాయో పెరుగుతుంది అంతే. కేవలం రైతులే కాదు కొబ్బరి దింపు, వలుపు, లారీల్లోకి, ట్రాక్టర్లలోకి ఎగుమతి, దిగుమతి.. ఇలా జిల్లాలో కొబ్బరి పరిశ్రమపై ఆధాపరడి వేల కుటంబాలు జీవిస్తున్నాయి. ఇంకోవైపు జిల్లాలో కొబ్బరిసాగు విస్తీర్ణం ప్రతీ ఏటా తగ్గుతోంది.

చెరువుల సాగు పెరగడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకూ కొబ్బరి ఎగుమతులపై ఎలాంటి పన్నులు లేవు. అయితే కొత్తగా జీఎస్టీ పరిధిలోకి కొబ్బరిని పరోక్షంగా తీసుకొచ్చారు. దీంతో జిల్లాలో కొబ్బరి ఎగుమతులు కొన్ని రోజులుగా నిలిచిపోయాయి కూడా. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో కొబ్బరిసాగు, పరిశ్రమ కూడా సంక్షభంలోకి వెళుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. 
 
డిమాండ్‌ ఫుల్‌.. రైతుకు నిల్‌..
జిల్లాలో పాలకొల్లు కేంద్రంగా కొబ్బరి ఉత్పత్తుల ఎగుమతి విస్తృతంగా సాగుతుంది. రోజుకు 50 లారీలు తక్కువ కాకుండా ప్రతీరోజూ ఎగుమతి అవుతుంటాయి. అంటే జిల్లా నుంచి రోజుకు రూ. 1 కోటి నుంచి రూ. 1.50 కోట్ల వరకూ కొబ్బరి ఉత్పత్తుల ఎగుమతి జరుగుతుంది. జార్ఖండ్, హర్యానా, చత్తీస్‌గడ్, గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. ఉత్తర భారతదేశంలోని 14 రాష్ట్రాలకు ఇక్కడ నుంచి కొబ్బరి ఎగుమతులు జరుగుతాయి.

కోఫ్రా (పైచెక్క తొలగించిన కురిడి), ఇడిబుల్‌ కోఫ్రా (ఆయిల్‌కు వినియోగించే విధంగా ముక్కలు చేసినవి), కోఫ్రా స్లైస్‌ (తరుము) రింగ్స్‌అండ్‌స్లైసెస్‌ (కురిడికాయను చిన్నచిన్న ముక్కలుగా చేసినవి) విదేశాలకు ఎగుమతి అవుతాయి. కొబ్బరికి ఇంత డిమాండ్‌ ఉంది. అయితే కొబ్బరి రైతులకు డిమాండ్‌కు అనుగుణంగా ధర దక్కడం లేదు. గుంటూరు, తిరుపతి, హైదరాబాద్‌ ప్రాంతాల్లో కాయ ధర రూ. 15లు పలుకుతోంది. ఇతర రాష్ట్రాల్లో అయితే రూ. 20లు నుంచి రూ. 25లు వరకూ ఉంది.

ఇక్కడి రైతుకు రూ. 5లు మాత్రమే దక్కుతుంది. రైతు వద్ద తీసుకున్న కాయ బయట ప్రాంతాల్లో మూడు నుంచి నాలుగురెట్లు పలుకుతుందన్నమాట. ప్రస్తుతం జాతీయంగా కొబ్బరికి విపరీతమైన డిమాండ్‌ ఉంది. దీంతో కాయ ఒక్కింటికి రైతుకు రూ. 5ల నుంచి రూ. 7లు వరకూ సైజును బట్టి ముట్టజెపుతున్నారు. కొబ్బరి బొండాలదీ ఇదే పరిస్థితి. రైతులు చాలా కాలంగా దారుణంగా నష్టపోతున్నారు.
 
జిల్లాలో తగ్గుతున్న విస్తీర్ణం..
  జిల్లాలో కొబ్బరిసాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. ఆక్వాసాగు పెరగడంతో భూములు అన్నీ చెరువులుగా మారడం ఒక కారణమైతే, కొత్తగా కొబ్బరిసాగుకు రైతులు మొగ్గు చూపకపోవడం మరో కారణంగా కనిపిస్తోంది. జిల్లాలో 22 మండలాల్లో కొబ్బరిసాగు విస్తృతంగా సాగుతోంది. నరసాపురం, పాలకొల్లు, ఆచంట, పోడూరు, యలమంచిలి మండలాల్లో విపరీతంగా సాగవుతోంది. కొవ్వూరు, దేవరపల్లి, గోపాలపురం, పెదవేగి, ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం, భీమడోలు, నల్లజర్ల మండలాల్లో కూడా సాగు ఎక్కువగా ఉంది. డెల్టాలో అయితే చేను గట్ల మధ్య కొబ్బరి మొక్కలు పెంచే సంప్రదాయం ఎక్కువగా ఉంది. మెట్టలో మాత్రం తోటల పెంపకం ఎక్కువగా జరుగుతుంది. డెల్టాలో చెరువులు ఎక్కువగా తవ్వుతుండటంతో కొబ్బరి చెట్లను భారీగా నరికి వేస్తున్నారు. తుఫాన్‌ల ప్రభావంతో చెట్లు పడిపోవడం, కొత్తగా కొబ్బరి మొక్కలు నాటక పోవడం కూడా జరుగుతోంది.

దీంతో విస్తీర్ణం తగ్గిపోతోంది. జిల్లాలో ప్రస్తుతం 98 వేల ఎకరాల్లో కొబ్బరి తోటలు ఉన్నాయి. చెరువుగట్లపైనా, రోడ్ల పక్కనా ఉన్నవాటితో కలుపుకుని. పదేళ్ల క్రితం అయితే 1.10 లక్షల ఎకరాల్లో కొబ్బరితోటలు ఉండేవి. చెరువుల తవ్వకాలు ఇలాగే కొనసాగితే మరో పదేళ్లలో 20వేల ఎకరాలుపైనే కొబ్బరి చెట్లు మాయమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. రైతులకు అన్నం పెట్టడమే కాకుండా కొబ్బరి పరిశ్రమ జిల్లాలో వేల మందికి ఉపాధి చూపిస్తోంది. కొబ్బరి ఎగుమతులకు సంబంధించి ఒలుపు, లోడింగ్, ట్రాన్స్‌పోర్ట్, వ్యాపారం ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఈ రంగంపై జిల్లాలో 20 వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. కొబ్బరి సాగు సంక్షోభంలోకి వెళితే వీరందరకీ గడ్డు పరిస్థితి తప్పదు.
 
జీఎస్టీ తలపోటు...
కొత్తగా జీఎస్‌టీ తలనొప్పి కొబ్బరి ఎగుమతులకు పట్టుకుంది. ప్రస్తుతం కొబ్బరి ఎగుమతులకు ఎలాంటి వాణిజ్య పన్నులు లేవు. ప్రస్తుతం జీఎస్‌టీలోకి కొబ్బరి ఎగుమతులను ప్రత్యక్షంగా చేర్చనప్పటికీ, పరోక్షంగా భారం వేశారు. కొబ్బరిలోడు లారీ ఎగుమతికి సంబంధించి హమాలీ లోడింగ్‌ చార్జీలు, గన్నీ సంచుల చార్జీలు, దళారీ కమీషన్, లారీ కిరాయి వీటన్నిటినీ ఎగుమతి దారులు బిల్లులో పొందు పరుస్తారు. వీటికి సర్వీస్‌టాక్స్‌ నిమిత్తం ఇప్పుడు జీఎస్‌టీలో 18శాతం విధించారు. అంటే ఒకలారీ లోడుకు అదనంగా ఇప్పుడు జీఎస్‌టీ క్రింద రూ. 20 నుంచి రూ 25వేల వరకూ ఖర్చవుతుంది. దీంతో ఎగుమతి దారులు గత 10 రోజులుగా ఎగుమతులు నిలిపివేశారు. మొత్తంగా రెండు రోజుల నుంచి ఎగుమతులు మళ్లీ ప్రారంభమయ్యాయి. అయితే జీఎస్టీ  విధానంలో  స్పష్టతలేక పోవడంతో ఎగుమతులు మందకొడిగా సాగుతున్నాయి. 
 
రూ. 5లు మించి ధర ఉండదు చిలకా సత్యనారాయణ, మర్రితిప్ప, నరసాపురం మండలం, కొబ్బరి రైతు కొబ్బరి పువ్వు నుంచి కాయగా మారడానికి 40 రోజులు పడుతుంది. చెట్టును పెంచాలంటే పదేళ్లు పైనే పడుతుంది. కాయకి ప్రస్తుతం రూ. 5లు ఇచ్చి మా దగ్గర కొంటున్నారు. మేమే ఏదైనా గుడి దగ్గర కాయ కొనుక్కోవాలంటే రూ. 15లు పెట్టాలి. మాకు ఎప్పుడూ రూ. 5లు, రూ. 6లు మించి ఇవ్వరు. ధరలేని రోజుల్లో అయితే కాయ ఓ రూపాయి, రాపాయిన్నరకు కూడా కొంటారు. ఎరువులు అవీ వేసి పెంచే పని లేదు కాబట్టి , ఏదో అలా వెళ్లిపోతుంది. మా పరిస్థితి మాత్రం దారుణం.
 
కొబ్బరి చెట్ల సంఖ్య తగ్గుతోంది. ముఖ్యంగా నరసాపురం, పాలకొల్లు, యలమంచిలి ప్రాంతాల నుంచి గతంలో వచ్చినంత దిగుబడి రావడం లేదు. గత మూడేళ్లలో అయితే మరీ దారుణంగా ఉంది. చెట్ల సంఖ్య తగ్గిపోవడమే కారణం. చేల గట్ల మధ్య ఇక్కడ ఎక్కువ సంఖ్యలో చెట్లు ఉండేవి. ఇప్పుడు చెరువులు తవ్వేస్తున్నారు. మొగల్తూరు లాంటి ప్రాంతాల్లో తోటలు కూడా తవ్వేసి చెరువులు చేసేస్తున్నారు. 
 
 
20 ఏళ్లుగా కొబ్బరి వలుపు పని చేస్తున్నాను. ఇప్పుడు 100 కాయలు ఒలిస్తే రూ. 70లు ఇస్తున్నారు. ఈ మధ్యనే కూలి పెరిగింది. మొన్నటి వరకూ కాయకు అర్ధ రూపాయి ఇచ్చేవారు. కాపుబాగా కాస్తే మాకు పని ఉంటుంది. ధరలేక పోయినా, ఎగుమతులు లేక పోయినా పని ఉండదు. ఈ పని చేసేవాళ్లం మరో పని చేయలేము. 
 
 
కొబ్బరి ఎగుమతులపై గతంలో వాణిజ్య పన్నులు ఉండేవి. అయితే 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రద్దు చేశారు. ప్రస్తుతం ఎలాంటి పన్నులు లేవు. అయితే కిరాయి, హమాలి చార్జీలు వాటిపై 18శాతం జీఎస్టీ ఉందని అంటున్నారు. కొంతమంది లేదంటున్నారు. ఈ విషయంలో స్పష్టతలేదు. అందుకే కొన్ని రోజులు ఎగుమతులు కూడా నిలిపివేశారు. కొబ్బరి ఎగుమతులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకూడదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement