పుష్కరాల్లో 'చిల్లర' వ్యాపారం
రాజమండ్రి : గోదావరి పుష్కరాల్లో చిల్లర వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రతిరోజు వివిధ జిల్లాల నుంచి లక్షల్లో తరలివస్తోన్న భక్తులు ఘాట్ల వద్ద స్నానాలు ఆచరిస్తున్నారు. అయితే వీరికి పూజలు, గోదావరిలో నాణేలు వేసే ఆచారం కోసం పెద్ద ఎత్తున చిల్లర అవసరమవుతోంది. దీంతో ఈ అవకాశాన్ని వ్యాపారంగా మలచుకుని పెద్ద ఎత్తున లాభాలు సంపాదిస్తున్నారు కొందరు వ్యాపారులు. వంద రూపాయలకు పది రూపాయలు కమీషన్ తీసుకుని భక్తులు అడిగిన చిల్లర ఇస్తున్నారు. కొందరు ఘాట్ల వద్ద ఈ చిల్లర వ్యాపారం చేస్తుంటే మరికొందరు బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల సమీపంలో నాణేలు కమీషన్ ప్రాతిపదికపై అందిస్తున్నారు.
అటు ప్రభుత్వరంగసంస్థ బ్యాంకులు సైతం భక్తులకు దగ్గరవడానికి నాణేలు అందిస్తున్నారు.రిజర్వ్‌బ్యాంక్ నుంచి ఆర్డర్లు రప్పించి రోజుకు రూ.2లక్షల వరకు సరఫరా చేస్తున్నాయి. ఒక్క బ్యాంకులే పుష్కరాలు ముగిసేలోగా రూ.40లక్షల వరకు చిల్లర నాణేలు భక్తులు అందించనున్నాయి.అటు ప్రైవేటు వ్యాపారులు అనధికారికంగా స్టాళ్లు ఏర్పాటు చేసుకుని చిల్లర వ్యాపారం చేస్తున్నాయి. యాత్రికులకు ఈ సౌలభ్యం గురించి తెలియకపోయినా ఘాట్ల వద్ద తమ మనుషులను నియమించుకుని ఈ తరహా వ్యాపారం చేస్తున్నాయి. ఈ విధంగా ప్రైవేటు చిల్లర వ్యాపారులు ఇప్పటివరకు రూ.5 లక్షల వరకు వ్యాపారం చేశారని అంచనా. పుష్కరాలు ముగిసే సరికి చిల్లర నాణేలను సుమారుగా రూ.20లక్షలకుపైగా సరఫరా చేయాలని అంచనా వేసుకున్నారు.