చలి చంపుతోంది
–పట్టు పురుగులకు సున్నపుకట్టు వ్యాధి
– మల్బరీ రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి
– పట్టుశాఖ సేవా కేంద్రం టీఓ ఎస్‌ఏ ఫిరోజ్‌బాషా
అనంతపురం అగ్రికల్చర్ : ఈ ఏడాది కాస్తంత ముందుగానే చలి వాతావరణం కనిపిస్తుండటంతో పట్టు పురుగుల పెంపకంలో రైతులు జాగ్రత్తలు పాటించాలని పట్టుపరిశ్రమశాఖ సాంకేతిక సేవా కేంద్రం (టెక్నికల్ సర్వీసు సెంటర్) టెక్నికల్ ఆఫీసర్ (టీఓ) ఎస్‌ఏ ఫిరోజ్‌బాషా (98495 63802) సూచించారు. రాత్రిళ్లు చలిపెడుతున్నా పగటి పూట పూట ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉండటంతో కొద్దిరోజుల పాటు పగలు, రాత్రిళ్లు తప్పనిసరిగా వాతావరణాన్ని నియంత్రించుకోవాలన్నారు. మొత్తమ్మీద చలికాలం వచ్చేస్తుండటంతో గాలిలో తేమశాతం పెరిగి బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి సూక్ష్మజీవులు పట్టు పురుగులకు సోకి పంట ఉత్పత్తులకు నష్టం కలిగించే సున్నపుకట్టు (మస్‌కార్డిన్) వ్యాధికి కారణమవుతుందన్నారు.
వ్యాధి లక్షణాలు
చలికాలం, వర్షాకాలంలో ఈ వ్యాధి వస్తుంది. వ్యాధి సోకిన పురుగులు జీర్ణశక్తి, చురుకుదనాన్ని కోల్పోతాయి. నల్లటి మచ్చలు కనిపించి అప్లోటాక్సిన్ అనే విషపదార్థం ఉత్పత్తి వలన చనిపోతాయి. చనిపోయిన 6 నుంచి 8 గంటలకు దేహం గట్టిపడి దఢంగా మారుతుంది. అసంఖ్యాక కొనీడియాలు ఏర్పడటం వల్ల తెల్లగా తయారై సుద్దముక్కలా మారుతుంది. దీన్నే తెల్లబూజు కట్టు రోగం లేదా సున్నకట్టు వ్యాధిగా పిలుస్తారు.
నివారణ ఇలా..
పెంపకం గది, పరిసరాలు, వాడే పరికరాలు శుభ్రంగా ఉండాలి. పంట పూర్తయిన తర్వాత వ్యాధి వల్ల చనిపోయిన పురుగులు, సుద్దముక్కల మారిన వాటిని, నాసిరకం పట్టుగూళ్లను తొలగించి కాల్చివేయాలి. 2 శాతం బ్లీచింగ్ పౌడరు, 0.2 శాతం సున్నపుపొడి ద్రావణంతో శుభ్రం చేసుకోవాలి. పట్టుగుడ్లు ఉపరితల భాగం నీలిచుక్క దశకు తిరగక మునుపే రెండో సారి 2 శాతం ఫార్మాలీన్ ద్రావణంలో ముంచి మంచినీటితో కడిగి నీడలో అరబెట్టి పొదిగించాలి. నాణ్యమైన పుష్టికరమైన మల్బరీ (రేషం) ఆకులను పురుగులకు ఇవ్వాలి. పురుగులు జ్వరానికి వెళ్లేముందు సున్నపుపొడిని పడకలపై చల్లి, గాలి, వెలుతురు ప్రసరించేలా చూడాలి. షెడ్డులో గాలి, వెలుతురు ప్రసరించేలా కిటికీలు ఎప్పుడూ తెరచివుండాలి.
కిటికీలు, వెంటిలేటర్లను పాలిథీన్ కవర్లు, గోనె సంచులతో మూయకూడదు. పెంపకం షెడ్డులో 80 శాతం లోపు తేమ, 25 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. రాత్రి పూట ఉష్ణోగ్రత 20 డిగ్రీల కన్నా తక్కువగా ఉంటే బొగ్గు కుంపెట్లు లేదా ఎలెక్ట్రికల్ హీటర్‌ను ఏర్పాటు చేసి ఉష్ణోగ్రతను పెంచుకోవాలి. ఇవి వాడే సమయంలో కిటికీలు తెరవాలి. రాళ్ల సున్నంపై నీళ్లుచల్లి పొడిచేసిన సున్నపు పొడినే విధిగా వాడాలి. రోజూ పురుగుల పడకలను శుభ్రం చేసిన తరువాత వ్యర్థ పదార్థాలు షెడ్డు పరిసరాల్లో వేయడం వల్ల రోగకారక క్రిములు పురుగులకు వ్యాపించే అవకాశం ఉంది. షెడ్డుకు దూరంగానూ లేదా అలాంటి వ్యర్థాలను గోతి తీసి పూడ్చాలి. పెంపకం గదిలో గోడలు, స్టాండుల కింద సున్నపుపొడిని చల్లాలి.