కోర్టు కేసుతో నిలిచిన కోల్డ్ స్టోరేజీ స్వాధీనం
ప్రత్తిపాడు : కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ధర్మవరంలోని హైవేపై ఉన్న సాయిభ్య అగ్రి కోల్డ్ స్టోరేజీని స్వాధీనం చేసుకునేందుకు కాకినాడ ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు అధికారులు మంగళవారం తరలివచ్చారు. అయితే బినామీ రుణాలపై కేసు నడుస్తున్నందున న్యాయ సలహా తీసుకున్న తరువాత అప్పగిస్తామని తహసీల్దార్ కె.నాగమల్లేశ్వరరావు చెప్పడంతో బ్యాంకు అధికారులు కోల్డ్ స్టోరేజీని పరిశీలించి వెళ్లారు. ధర్మవరం సాయిభ్య అగ్రి కోల్డ్ స్టోరేజీ యజమాని కంచుస్తంభం వెంకట సత్యప్రసాద్.. స్టోరేజీలోని కార్మికులను రైతులుగా చూపించి ఈ బ్యాంకు నుంచి రూ.27.58 కోట్లు స్వాహా చేసిన విషయం విదితమే. దేనా బ్యాంకుకు రుణాల చెల్లింపులు నిలిచిపోవడంతో బ్యాంకు అధికారులు స్టోరేజీని పరిశీలించినపుడు రైతుల వ్యవసాయ ఉత్పత్తులు లేకపోవడంతో ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌లో 111 మంది రైతులపై (బినామీలపై) కేసు నమోదైంది. దీంతో కోల్డ్ స్టోరేజీని సీజ్ చేశారు కాకినాడ సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి పది మంది పేర్లతో రూ.పది లక్షల రుణం పొందిన కంచుస్థంబం వెంకట సత్యప్రసాద్ ఐదుగురు రుణాల చెల్లించి మరో ఐదుగురి రుణాలు చెల్లించలేదని బ్యాంకు సీనియర్ మేనేజర్ రాజేశ్వరరావు తెలిపారు. ఇదిలాఉండగా, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు, కాకినాడ సూర్యారావు పేట బ్రాంచి నుంచి కూడా ఈ సంస్థల పేరుతో రుణం పొందారు. ఈ బ్యాంకుకు సుమారు రూ.22.38 కోట్లు చెల్లించాల్సి ఉంది. 2014 జనవరిలో బ్యాంకు డిమాండ్ నోటీస్ జారీజేసింది. సంస్థ స్పందించకపోవడంతో బ్యాంకు అధికారులు కోర్టును ఆశ్రయించారు. స్టోరేజి ఆస్తులతో పాటు తాళ్లరేవులోని ఐస్ ప్యాక్టరీని ఐఓబీకి అప్పగించాలంటూ కలెక్టర్ హెచ్. అరుణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో, స్టోరేజీని స్వాధీనం చేయమంటూ ఐఓబీ విశాఖ రీజియన్ చీఫ్ మేనేజర్ బి.హన్సాద, కాకినాడ బ్రాంచ్ మేనేజర్ బి.అప్పలరాజు, రికవరీ ఆఫీసర్ రామాంజనేయులు తదితరులు తహసీల్దార్‌ను కలిశారు.